Minister Udayanidhi: తేల్చిచెప్పిన మంత్రి ఉదయనిధి.. భయపడను.. క్షమాపణలు చెప్పను
ABN, First Publish Date - 2023-09-06T08:54:27+05:30
సనాతన ధర్మాలను నిర్మూలించాలని తానిచ్చిన పిలుపుపై దేశవ్యాప్తంగా వ్యతిరేక స్పందనలు అధికమయ్యాయని, కేంద్ర
- తేల్చి చెప్పిన ఉదయనిధి
- విచారణకు గవర్నర్ అనుమతి కోరిన బీజేపీ
- సుప్రీంకోర్టు సీజేకు 262 మంది ప్రముఖుల ఫిర్యాదు
- మంత్రి నివాసాలకు భద్రత పెంపు
- జగద్గురు పరమహంస ఆచార్య దిష్టిబొమ్మల దహనం
చెన్నై, (ఆంధ్రజ్యోతి): సనాతన ధర్మాలను నిర్మూలించాలని తానిచ్చిన పిలుపుపై దేశవ్యాప్తంగా వ్యతిరేక స్పందనలు అధికమయ్యాయని, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా నుంచి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వరకూ అందరూ తనను అరెస్టు చేసేందుకు పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారని, అయితే వాటికి తాను భయపడే ప్రసక్తే లేదని రాష్ట్ర యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖల మంత్రి ఉదయనిధి స్టాలిన్(Minister Udayanidhi Stalin) తేల్చిచెప్పారు. తూత్తుకుడిలో జరిగిన డీఎంకే యువజన విభాగం బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ... సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మునుపు అంబేడ్కర్, పెరియార్, కరుణానిధి పోరాడారని, ప్రస్తుతం ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) వారి బాటలోనే పయనిస్తున్నారని చెప్పారు. సనాతన ధర్మాలను నిర్మూలించే వరకూ డీఎంకే పోరాడుతూనే ఉంటుందన్నారు. ఈ కారణం వల్లే డీఎంకేని హిందువుల వ్యతిరేక పార్టీగా ప్రత్యర్థులు చిత్రీకరిస్తున్నారన్నారు. సనాతన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని అడుగుతున్నారని, తాను కరుణానిధి మనవడినని, ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పే ప్రసక్తేలేదన్నారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా భయపడనని, వాటిని చట్ట ప్రకారం ఎదుర్కొంటానని ఉదయనిధి స్పష్టం చేశారు.
క్రిమినల్ కేసుకు అనుమతివ్వండి...
సనాతన ధర్మాన్ని కించపరిచేలా ప్రసంగించిన మంత్రి ఉదయనిధిపై క్రిమినల్ కేసు దాఖలుకు అనుమతివ్వాలని గవర్నర్ ఆర్‌ఎన్ రవి అనుమతిని కోరుతూ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఎ. అశ్వత్థామన్ లేఖ రాశారు. సనాతన ధర్మాన్ని మంత్రి ఉదయనిధి డెంగీ, మలేరియాలతో పోల్చి హిందువుల మనోభావాలను కించపరిచారన్నారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించడమే తన ధ్యేయమంటూ ఉద్దేశపూర్వకంగా మతచిచ్చును రగిల్చే రీతిలో ప్రసంగించారని ఆ లేఖలో అశ్వత్థామన్ పేర్కొన్నారు.
సీజేకు 262 మంది లేఖలు...
సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ప్రసంగించిన ఉదయనిధిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మాజీ న్యాయమూర్తులు, రచయితలు, హిందూ మత సంస్థల నేతలు సహా 262 మంది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. సుప్రీంకోర్టు సుమోటోగా కేసును స్వీకరించి ఉదయనిధి వివాదాస్పద వ్యాఖ్యలపై విచారణ జరపడంతో పాటు కఠినంగా శిక్షించాలని ఆ లేఖల్లో విజ్ఞప్తి చేశారు.
పరమహంస ఆచార్యకు వ్యతిరేకంగా ఆందోళన
ఉదయనిధి తల నరికితే రూ.10 కోట్లు ఇస్తానంటూ ప్రకటించిన అయోధ్యలోని జగద్గురు పరమహంస ఆచార్యకు వ్యతిరేకంగా రాష్ట్రంలో పలుచోట్ల డీఎంకే శ్రేణులు ఆందోళనలు నిర్వహించాయి. పరమహంస దిష్టిబొమ్మల్ని తగలబెడుతూ, ఆయన చిత్రపటాలను చెప్పులతో కొడుతూ తమ నిరసనను తెలిపాయి.
భారీ భద్రత...
సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ప్రసంగించిన మంత్రి ఉదయనిధికి బెదరింపులు అధికం కావడంతో చెన్నైలోని ఆయన నివాస గృహాల వద్ద పోలీసు భద్రతను పెంచారు. గ్రీన్‌వేస్ రోడ్డులో ఉన్న నివాస గృహానికి, నీలాంగరై వద్దనున్న మరో నివాసానికి పోలీసు ఉన్నతాధికారులు భద్రతను పెంచుతూ ఉత్తర్వు జారీ చేశారు. ఆ మేరకు ఈ నివాసగృహాల వద్ద పదిమందికిపైగా పోలీసు కానిస్టేబుళ్లు భద్రతా విధుల్లో పాల్గొంటున్నారు. ఇదివరకు ఆ రెండిళ్ల వద్ద నలుగురు కానిస్టేబుళ్లు రొటేషన్ పద్ధతిలో భద్రతా విధులను నిర్వర్తించేవారు. ప్రస్తుతం రెండు నివాస గృహాల వద్ద సుమారు ఇరవై మంది కానిస్టేబుళ్లతో భద్రతా ఏర్పాట్లను పటిష్ఠం చేశారు.
కేసు వేస్తాం: హిందూ మున్నని
సనాతన ధర్మాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన మంత్రి ఉదయనిధిపైనా, సనాతన ధర్మం నిర్మూలన మహానాడు జరిపేందుకు అనుమతి జారీ చేసిన పోలీసు అధికారులపైనా కేసు దాఖలు చేయనున్నట్లు హిందూ మున్నని అధ్యక్షుడు కాటేశ్వర సుబ్రమణ్యన్ ప్రకటించారు. మతచిచ్చును రగిల్చేలా ప్రసంగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవచ్చంటూ గతంలో సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా ఉదయనిధిపై తాము ఫిర్యాదు చేస్తామన్నారు. హిందువుల మనోభావాలను కించపరిచేలా ప్రసంగించిన మంత్రిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
అవన్నీ పెరియార్ మాటలే: పీసీసీ చీఫ్ కేఎస్ అళగిరి
రాష్ట్రమంత్రి ఉదయనిధి సనాతన ధర్మానికి వ్యతిరేకంగా చేసిన ప్రసంగ అంశాలన్నీ గతంలో ద్రవిడ ఉద్యమ నేత పెరియార్ చెప్పిన మాటల సారంశామేనని టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్ అళగిరి పేర్కొన్నారు. తిరునల్వేలిలో జరిగిన స్వాతంత్య్ర సమరయోధుడు వావుసి 152వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఆ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ... ఉదయనిధిని చంపాలంటూ ఉత్తరాదికి చెందిన సాధువు హెచ్చరించడం సనాతన ధర్మంలోని ఉగ్రవాదతత్వాన్ని ఎత్తి చూపుతోందన్నారు. ఏ అంశానికైనా సానుకూల, ప్రతికూల విమర్శలు తప్పవని, అయితే ప్రతికూల విమర్శలు చేస్తే చంపుతామని బెదరించడం బీజేపీ పెంచి పోషిస్తున్న మతతత్వవాదుల గుణాన్ని తెలియజేస్తోందన్నారు. ఉదయనిధి కొత్త విషయాలను చెప్పలేదని, ద్రవిడ ఉద్యమనేత పెరియార్ మాటలనే వల్లించారని తెలిపారు.
Updated Date - 2023-09-06T08:54:27+05:30 IST