Modi Shinde: ఫడ్నవీస్‌ను మించిపోయిన షిండే..?
ABN, First Publish Date - 2023-06-13T21:17:14+05:30
ఏకనాథ్ షిండే సారథ్యంలోని శివసేన ఇచ్చిన ఓ పత్రికా ప్రకటన తాజాగా మహారాష్ట్రలో రాజకీయ వివాదానికి దారితీసింది. ''దేశానికి మోదీ, మహారాష్ట్రకు షిండే'' అనే శీర్షికతో షిండే శివసేన పలు పత్రికల్లో పూర్తి పేజీ ప్రకటన ఇచ్చింది. ఇందులో బీజేపీ మాజీ సీఎం, ప్రస్తుత డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ప్రస్తావన కానీ, ఫోటో కానీ ఎక్కడా లేదు.
ముంబై: ఏకనాథ్ షిండే సారథ్యంలోని శివసేన ఇచ్చిన ఓ పత్రికా ప్రకటన తాజాగా మహారాష్ట్రలో రాజకీయ వివాదానికి దారితీసింది. ''దేశానికి మోదీ, మహారాష్ట్రకు షిండే'' (Modi For india, Shinde For Maharashtra) అనే శీర్షికతో షిండే శివసేన పలు పత్రికల్లో పూర్తి పేజీ ప్రకటన ఇచ్చింది. ఇందులో బీజేపీ మాజీ సీఎం, ప్రస్తుత డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ప్రస్తావన కానీ, ఫోటో కానీ ఎక్కడా లేదు. పైగా, రాష్ట్రంలో నిర్వహించిన ఓ సర్వేను ఉటంకిస్తూ ఇచ్చిన ఈ ప్రకటనలో ఫడ్నవిస్ కంటే షిండేకే ఎక్కువ ఆదరణ ఉన్నట్టు పేర్కొనడం రాజకీయ పార్టీల్లో చర్చకు దారితీసింది.
''26.1 శాతం ప్రజలు తదుపరి ముఖ్యమంత్రిగా షిండేను కోరుకోగా, 23.2 శాతం మంత్రి ఫడ్నవిస్‌ను కోరుకుంటున్నారు'' అని ఆ ప్రకటన పేర్కొంది. ఈ ప్రకటనపై శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ ఘాటుగా స్పందించారు. ఇది గతంలోని బాలాసాహెబ్ శివసేన కాదని, నరేంద్ర మోదీ-అమిత్‌షాల శివసేన అని విమర్శించారు. బాలాసాహెబ్ ఫోటో ఎందుకు లేదని ప్రశ్నించారు. షిండే తనను తాను ప్రమోట్ చేసుకునేందుకు ఇలాంటి ప్రకటనలు ఇస్తున్నారని కాంగ్రెస్ విమర్శించింది. కాగా, షిండే వర్గం ఆయనను సమర్ధిస్తూ, షిండే ఎప్పుడూ ప్రజల్లోనూ ఉంటారని, సర్వే నిర్వహించమని ఏ మీడియా సంస్థను తాము అడగలేదని వివరణ ఇచ్చింది. బీజేపీ ఆచితూచి స్పందించింది. ఒక పార్టీకి కానీ, ఒక నాయకుడికి ఎంత జనాకర్షణ ఉందనేది చెప్పడానికి ఎన్నికల ఫలితాలే ప్రమాణమని, క్యాబినెట్ మంత్రిగా ఉన్నప్పుడే షిండేకు పేరుందని, ఇప్పుడు ఆయనకు సీఎంగా కొంత ఆదరణ పెరిగి ఉండవచ్చని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాంకులే వ్యాఖ్యానించారు.
Updated Date - 2023-06-13T21:44:50+05:30 IST