ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

PM MODI : మళ్లీ నేనే!

ABN, First Publish Date - 2023-08-16T02:47:45+05:30

వచ్చేసారి కూడా అధికారం తమదేనని.. 2024 ఎన్నిక(2024 election)ల్లోనూ నెగ్గి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ(PM MODI ) ఎర్రకోట సాక్షిగా చెప్పకనే చెప్పారు.

వచ్చే ఏడాదీ జెండా ఎగరేస్తా.. ఎర్రకోట వేదికగా మోదీ ప్రకటన

అవినీతి, వారసత్వం, బుజ్జగింపు రాజకీయాలను అంతం చేస్తాం

వచ్చే ఐదేళ్లలో మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్‌

ఓబీసీ చేతివృత్తిదారులకు 13-15 వేల కోట్లతో విశ్వకర్మ యోజన

మధ్యతరగతి సొంతింటి కల సాకారానికి త్వరలోనే కొత్త పథకం

తక్కువ వడ్డీకే బ్యాంకు రుణాలు.. దీంతో వారికి రూ.లక్షలు ఆదా

‘లఖ్‌పతి దీదీ’తో 2లక్షల మంది మహిళలను లక్షాధికారుల్ని చేస్తా

6జీ టెక్నాలజీ దిశగా వేగంగా అడుగులు: ప్రధాని నరేంద్ర మోదీ

ఎర్రకోట వేడుకల్లో పాల్గొన్న హైదరాబాద్‌ ఉపాధ్యాయురాలు

న్యూఢిల్లీ, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): వచ్చేసారి కూడా అధికారం తమదేనని.. 2024 ఎన్నిక(2024 election)ల్లోనూ నెగ్గి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ(PM MODI ) ఎర్రకోట సాక్షిగా చెప్పకనే చెప్పారు. 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం ఎర్రకోట(Red Fort)పై పతాకావిష్కరణ చేసిన ప్రధాని.. వచ్చే ఏడాది ఆగస్టు 15న కూడా ఎర్రకోట నుంచి తాను ఇదే విధంగా దేశం సాధించిన విజయాల గురించి ప్రజలకు చెప్తాననడం ద్వారా మరోసారి ప్రధాని పదవి చేపడతానని పరోక్షంగా చెప్పినట్లయింది. దాదాపు గంటన్నరకు పైగా సాగిన ప్రసంగంలో మోదీ తమ హయాంలో సాధించిన విజయాల గురించి.. గత ప్రభుత్వాల వైఫల్యాల గురించి ప్రస్తావించారు. అవినీతి, వారసత్వ పాలన, బుజ్జగింపు రాజకీయాలంటూ.. ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 2014లో ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని.. సంస్కరణలు, పనితీరు, పరివర్తన ద్వారా నెరవేర్చానని.. అందువల్లే 2019లో మళ్లీ తనను ఆశీర్వదించారని పేర్కొన్నారు. దేశం అవినీతి సంకెళ్లలో కూరుకుపోయి.. లక్షలకోట్ల రూపాయల కుంభకోణాలు ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్న సమయంలో.. పాలన బలహీనంగా మారిన తరుణంలో తాము లీకేజీలను ఆపి బలమైన ఆర్థిక వ్యవస్థను సృష్టించామని మోదీ చెప్పుకొన్నారు. పదేళ్ల క్రితం కేంద్రం నుంచి రాష్ట్రాలకు రూ.30 లక్షల కోట్లు వెళ్లేవని, అది ఈ తొమ్మిదేళ్లలో రూ.100 లక్షల కోట్లకు చేరుకున్నదని చెప్పారు. పేదల ఇళ్ల నిర్మాణానికి నాలుగు రెట్లు ఎక్కువగా రూ.4 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు. తన మొదటి ఐదేళ్ల పాలనలోనే 13.5 కోట్లమంది ప్రజలు పేదరిక సంకెళ్లను తెంచుకుని మధ్యతరగతిలోకి ప్రవేశించారని తెలిపారు. చేతివృత్తులు, హస్తకళలను ఆశ్రయించిన ఓబీసీల కోసం విశ్వకర్మ జయంతి రోజున ‘విశ్వకర్మ యోజన’ను ప్రకటిస్తామన్నారు.

ఆ పథకం కింద వారికి రూ.13 నుంచి 15 వేల కోట్లు ఇస్తామని తెలిపారు. అలాగే.. నగరాల్లో అద్దె ఇళ్లలో నివసించే మధ్యతరగతి ప్రజల, మురికివాడల్లో నివసించే పేదల సొంతింటి కల సాకారానికి త్వరలో కొత్త పథకం తెస్తామన్నారు. వారు ఇల్లు నిర్మించుకోవాలనుకుంటే తక్కువ వడ్డీకే బ్యాంకు రుణాలు ఇప్పిస్తామని చెప్పారు. ఆదాయపన్నును రూ.2 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచడం వల్ల వేతన, మధ్యతరగతి జీవులకు ఎంతగానో ప్రయోజనం చేకూరిందన్నారు. అలాగే.. ‘లఖ్‌పతి దీదీ’ పథకం కింద దేశంలో రెండు కోట్ల మంది మహిళలకు ప్లంబింగ్‌, ఎల్‌ఈడీ బల్బుల తయారీ వంటివాటిలో నైపుణ్య శిక్షణ ఇప్పించి వారిని లక్షాధికారులను (ఏడాదికి రూ.లక్ష ఆదాయం వచ్చేలా) చేస్తామని.. రెండు కోట్ల మంది మహిళలను లక్షాధికారులను చేయడం తన కల అని పేర్కొన్నారు. ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కింద రూ.70 వేల కోట్లు.. కరోనా వ్యాక్సిన్‌పై రూ.40 వేల కోట్లు ఖర్చుచేసినట్టు తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా 5జీ సేవలను ప్రజలకు అందించింది భారతదేశమేనని.. ఇప్పటికే 700 జిల్లాల్లో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయని, ఇప్పుడు 6జీ సేవలను అందించడానికి కూడా సిద్ధమవుతున్నామని ప్రధాని తెలిపారు. ఇలా గత తొమ్మిదేళ్ల పాలనలో తమ ప్రభుత్వం సాధించిన విజయాలను ఏకరువు పెట్టిన మోదీ.. ద్రవ్యోల్బణాన్ని మాత్రం అంతగా తగ్గించలేకపోయామని అంగీకరించారు. అలాగే.. మణిపూర్‌లో సమస్యల పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయని, శాంతి నెలకొంటోందని చెప్పారు.

ప్రతిపక్షాలపై నిప్పులు..

2014, 2019లో బలమైన ప్రభుత్వం ఏర్పాటు చేసినందువల్లే సంస్కరణలు తీసుకువచ్చే ధైర్యం తనకు వచ్చిందన్న మోదీ.. తన ప్రసంగంలో ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత 75 ఏళ్లలో కొన్ని చెడు శక్తులు సమాజంలో చొచ్చుకుపోయినందువల్లే అభివృద్ధికి అడ్డంకులు ఏర్పడుతున్నాయన్నారు. విపక్షాల అవినీతి, వారసత్వ రాజకీయాలు, బుజ్జగింపు ధోరణులను మూడు దురాచారాలుగా అభివర్ణించిన ఆయన.. అవి దేశ ప్రజల ఆకాంక్షలను అణచివేశాయని.. ఎద్దులను కొమ్ములు పట్టుకుని వంచినట్లు ఈ మూడు దురాచారాలపై పోరాడాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు. అవినీతి పై పోరాటం తన వ్యక్తిగత నిబద్ధతగా పేర్కొన్నారు. గత తొమ్మిదేళ్లలో క్షేత్ర స్థాయిలో అవినీతి నిర్మూలనకు తాను చేపట్టిన చర్యల వల్ల పది కోట్ల మంది అక్రమంగా ప్రయోజనాలు పొందకుండా అడ్డుకోగలిగామని, 10 కోట్ల బినామీ కార్యకలాపాలను ఆపగలిగామని, అవినీతి పరుల ఆస్తులను మునుపటికంటే 20 రెట్లు ఎక్కువ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మారుస్తామని హామీ ఇచ్చారు. తాను జీవించేది.. తాను కలలు కనేది.. చెమట చిందించేదీ ప్రజల కోసమేనని ప్రధాని మోదీ అన్నారు. దేశ ప్రజలందరూ తన కుటుంబమేనన్నారు.

తీర్పుల అనువాదం అభినందనీయం..

మన సైన్యం ఎప్పుడూ అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను కలిగి, సాధికారతతో ఉండాలని.. యవ్వనంతో ఉరకలు వేయాలని, ఎల్లప్పుడూ యుద్ధానికి సన్నద్ధంగా ఉండాలని.. అందుకే తాము సాయుధ దళాలకు సంబంధించి నిరంతరం సంస్కరణలను అమలు చేస్తున్నామని మోదీ చెప్పారు. గతంలో ఎక్కడో ఒకచోట నిత్యం బాంబు పేలుళ్లు జరుగుతుండేవని.. కానీ, దేశం ఇప్పుడు సురక్షితంగా ఉన్నదని, ఉగ్రవాద దాడులు గణనీయంగా తగ్గాయని మోదీ చెప్పారు. తెలిపారు. మాతృభాషలో విద్యను అందించాలని సిఫారసు చేయడం ద్వారా అందరికీ విద్యను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రాధాన్యమిస్తున్నట్టు వెల్లడించారు. మాతృభాషకు సుప్రీంకోర్టు ఇస్తున్న ప్రాధాన్యాన్ని, తీర్పులను పలు భాషల్లోకి అనువదించడాన్ని ప్రధాని అభినందించారు.

ప్రధానితో ముచ్చటించిన కాంతమ్మ

పొందూరు: శ్రీకాకుళం జిల్లా పొందూరుకు చెందిన 76 ఏళ్ల వడుకు కార్మికురాలు కాంతమ్మకు ప్రధాని మోదీతో కాసేపు ముచ్చటించే అవకాశం దక్కింది. ఎర్రకోటలో స్వాతంత్య్ర వేడుకలకు కాంతమ్మతో పాటు నేత కార్మికుడు బల్ల భద్రయ్యకు ప్రత్యేక ఆహ్వానం అందింది. మంగళవారం ప్రత్యేక గ్యాలరీలో ఉన్న కాంతమ్మను అధికారులు మోదీకి పరిచయం చేశారు. ఆయన ఆప్యాయంగా పలుకరించారు. కాంతమ్మ ప్రత్యేకంగా వడికిన 100 కౌంట్‌ చిలపను ఈ సందర్భంగా ప్రధానికి అందజేశారు. \

స్వాతంత్య్ర వేడుకల్లో హైదరాబాద్‌ ఉపాధ్యాయిని రేఖ

ఈసారి స్వాతంత్య్ర వేడుకలకు 50 మంది ఉపాధ్యాయులను ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించారు. వీరిలో హైదరాబాద్‌ కేంద్రీయ విద్యాలయం ఉపాధ్యాయిని మిట్టపల్లి రేఖ కూడా ఉన్నారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయిని పురస్కార గ్రహీత అయిన రేఖ.. ఎర్రకోటలో స్వాంత్య్ర వేడుకల్లో తాను పాల్గొనడం గర్వకారణంగా ఉందని పేర్కొన్నారు.

వచ్చే ఆగస్టు 15న.. ఇదే ఎర్ర కోట నుంచి.. భారతదేశం సాధించిన ఘనతల గురించి, మీ శక్తిసామర్థ్యాల గురించి, మీవల్ల సాధ్యమైన ప్రగతి గురించి, గొప్ప ఆత్మవిశ్వాసంతో సాధించిన విజయాల గురించి నేను మీ ముందుంచుతాను.

- స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ

Updated Date - 2023-08-16T04:22:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising