Moon temp 50 to 70 Degrees : చందమామ చల్లనేమీ కాదు
ABN , First Publish Date - 2023-08-28T02:56:14+05:30 IST
ఇన్నాళ్లూ మనం చందమామ చల్లనేమో అనుకున్నాం..! కానీ.. చంద్రయాన్-3 అది తప్పని నిరూపించింది. మనం ఊహించుకున్నట్టు జాబిల్లి చల్లగా ఏమీ లేదని, అక్కడ ఉపరితలంపై పగటి ఉష్ణోగ్రతలు 50 నుంచి 70 డిగ్రీల వరకూ ఉంటాయని తేల్చింది. ఉపరితలం నుంచి లోతుకు వెళ్లే కొలదీ ఉష్ణోగ్రతలు భారీగా ...

ఉపరితలంపై 50-70 డిగ్రీల ఉష్ణోగ్రతలు
10 సెం.మీ. లోతులో మైనస్ 10 డిగ్రీలు.. ఉపరితలంపై 70 డిగ్రీలు
వ్యత్యాసాలను గుర్తించిన ఛాస్టే పేలోడ్.. వివరాల గ్రాఫ్ ఇస్రోకు
‘శివశక్తి’ పేరు పెట్టడంలో తప్పేమీ లేదు
చంద్రయాన్-3 ల్యాండ్ అయిన ప్రదేశానికి ‘శివశక్తి’ పాయింట్ అని పేరు పెట్టడంలో ఎలాంటి వివాదమూ లేదని, ఆ పేరు పెట్టే హక్కు దేశానికి ఉందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ స్పష్టం చేశారు. ‘ప్రధాని మనందరికీ అర్థమయ్యేలా దాని (శివశక్తి) అర్థాన్ని వివరించారు. అందులో తప్పేమీ లేదనేది నా అభిప్రాయం. అలాగే చంద్రయాన్-2 పడిపోయిన ప్రాంతానికి కూడా తిరంగా అని పేరు పెట్టారు. ఈ రెండూ భారతీయ పేర్లే’ అని అన్నారు.
బెంగళూరు, తిరువనంతపురం, ఆగస్టు 27: ఇన్నాళ్లూ మనం చందమామ చల్లనేమో అనుకున్నాం..! కానీ.. చంద్రయాన్-3 అది తప్పని నిరూపించింది. మనం ఊహించుకున్నట్టు జాబిల్లి చల్లగా ఏమీ లేదని, అక్కడ ఉపరితలంపై పగటి ఉష్ణోగ్రతలు 50 నుంచి 70 డిగ్రీల వరకూ ఉంటాయని తేల్చింది. ఉపరితలం నుంచి లోతుకు వెళ్లే కొలదీ ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుతున్నాయని గుర్తించింది. దక్షిణ ధ్రువంపై సురక్షితంగా దిగిన నాలుగు రోజుల తర్వాత విక్రమ్ ల్యాండర్‌లోని చంద్రాస్ సర్ఫేస్ థర్మోఫిజికల్ ఎక్స్‌పెరిమెంట్ (ఛాస్టే) పేలోడ్ జాబిల్లి ఉపరితలంతోపాటు.. కాస్త లోతు (10 సెంటీమీటర్ల)లో సేకరించిన ఉష్ణోగ్రతల వివరాలను గ్రాఫ్ రూపంలో ఇస్రోకు పంపించింది. ఆ వివరాలను ఇస్రో ఆదివారం వెల్లడించింది. ‘ఛాస్టే పేలోడ్ పంపిన తొలి పరిశీలన ఇదే. చంద్రుని దక్షిణ ధ్రువంపై వద్ద నేల పైపొర ఉష్ణోగ్రతలను ఈ పేలోడ్ లెక్కిస్తుంది. తద్వారా జాబిల్లి ఉపరితలంపై ఉష్ణోగ్రతల తీరును అర్థం చేసుకునే అవకాశం లభిస్తుంది. నేలపై 10 సెంటీమీటర్ల లోతువరకు చొచ్చుకెళ్లి, ఉష్ణోగ్రతలను లెక్కించే సామర్థ్యం ఈ పేలోడ్‌కు ఉంది. దీనికోసం 10 సెన్సర్లు అమర్చాము’ అని ఇస్రో ట్విటర్ (ఎక్స్)లో వెల్లడించింది. ఈ గ్రాఫ్‌లో చంద్రుడి ఉపరితలం నుంచి 10 సెంటీమీటర్ల లోతులో మైనస్ 10 డిగ్రీల సెల్సియ్‌సగా ఉన్న ఉష్ణోగ్రతలు.. ఉపరితలంపైకి వచ్చేసరికి 50-70 డిగ్రీల సెల్సియ్‌సకు వరకు పెరిగినట్టు తెలుస్తోంది. అంటే జాబిల్లి ఉపరితలంపైన, కాస్త లోతులో నమోదైన ఉష్ణోగ్రతల్లో చాలా వ్యత్యాసం ఈ గ్రాఫ్‌లో స్పష్టంగా కనిపించింది.
ఆశ్చర్యపరిచిన వ్యత్యాసం..
చంద్రుని ఉపరితల ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల నుంచి 30 డిగ్రీల వరకు ఉండొచ్చని భావించామని, కానీ.. ఇది 70 డిగ్రీల వరకూ ఉందని ఇస్రో శాస్త్రవేత్త బీహెచ్‌ఎం దారుకేశ అన్నారు. తాము ఊహించిన దానికంటే ఆశ్చర్యకరంగా ఇది చాలా ఎక్కువగా ఉందని చెప్పారు. ఉపరితలంపై నుంచి కొన్ని సెంటీమీటర్ల లోతులోకి వెళ్లినప్పుడు సహజంగా 2-3 డిగ్రీల వ్యత్యాసం ఉంటుందని, కానీ.. చంద్రుడిపై ఈ వ్యత్యాసం దాదాపు 50 డిగ్రీల వరకూ ఉందని ఆయన పేర్కొన్నారు. ఇది చాలా ఆసక్తికర అంశమన్నారు. కాగా, దక్షిణ ధ్రువంలో చందమామ నేలకు సంబంధించిన ఉష్ణోగ్రతల వివరాలు ఈ ప్రపంచానికి తెలియడం ఇదే తొలిసారని ఇస్రో వెల్లడించింది. దీనికి సంబంధించిన సమగ్ర పరిశీలన జరుగుతోందని పేర్కొంది. ఛాస్టే పేలోడ్‌ను అహ్మదాబాద్‌లోని ఫిజికల్ రిసెర్చ్ లేబొరేటరీ (పీఆర్‌ఎల్) సహకారంతో ఇస్రో విక్రమ్‌సారాభాయ్ స్పేస్ సెంటర్‌కు చెందిన స్పేస్ ఫిజిక్స్ లేబొరేటరీ (ఎస్పీఎల్) నేతృత్వంలోని బృందం అభివృద్ధి చేసిందని తెలిపింది. చంద్రుని దక్షిణ ధ్రువానికి భవిష్యత్తులో మానవులకు ఆతిథ్యమిచ్చే సామర్థ్యం ఉన్నందున తమ ప్రయోగానికి కేంద్ర బిందువుగా ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నామని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ అన్నారు. చంద్రయాన్-3.. జాబిల్లి నేల ఉష్ణోగ్రత, దాని వైవిధ్యానికి సంబంధించిన స్పష్టమైన సమాచారాన్ని చేరవేస్తుందని, అలాగే ఆ మట్టిలో ఏం ఉందో శాస్త్రవేత్తలు కూడా తెలుసుకుంటారని చెప్పారు.
భారత్‌కు ఆ సత్తా ఉంది: సోమనాథ్
మరిన్ని గ్రహాంతర మిషన్లను చేపట్టే సామర్థ్యం తమకు ఉందని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ అన్నారు. అంతరిక్ష రంగ విస్తరణ ద్వారా దేశ సమగ్ర పురోగతికి తోడ్పడటం తమ లక్ష్యమని పేర్కొన్నారు. ‘చంద్రుడితోపాటు అంగారకుడు, శుక్ర గ్రహాలపైకి వెళ్లి పరిశోధన చేసే సత్తా భారత్‌కు ఉంది. కానీ, దానికోసం మన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. అలాగే మరిన్ని పెట్టుబడులు కూడా కావాలి’ అని పేర్కొన్నారు. దేశ అంతరిక్ష రంగంపై ప్రధాని మోదీకి సుదీర్ఘ దార్శనికత ఉందని, దాన్ని అమలు చేసేందుకు ఇస్రో సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. చంద్రయాన్-3 మిషన్ విజయం తర్వాత సోమనాథ్ తొలిసారిగా కేరళకు చేరుకున్నారు. ఈ సందర్భంగా తిరువనంతపురం విమానాశ్రయం వద్ద విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్ ఒక్కటే కాదు.. ఈ మిషన్‌లోని అన్ని అంశాలూ 100ు విజయవంతమయ్యాయని అన్నారు. ఈ విజయం పట్ల యావత్ దేశం గర్విస్తోందన్నారు.
భద్రకాళి ఆలయంలో సోమనాథ్ పూజలు
ఇస్రో చైర్మన్ సోమనాథ్ తిరువనంతపురంలోని పౌర్ణమికావు-భద్రకాళి ఆలయాన్ని ఆదివారం దర్శించుకున్నారు. చంద్రయాన్-3 విజయాన్ని పురస్కరించుకుని ఆయన పూజలు నిర్వహించారు. ఆలయ సందర్శన గురించి ఆయనను ప్రశ్నించగా.. ‘నేను అన్వేషకుడిని. చంద్రుడిని అన్వేషిస్తాను. సైన్స్, ఆధ్యాత్మికత.. రెండింటినీ అన్వేషించడం నా జీవిత ప్రయాణంలో భాగం. మన శరీరం వెలుపల ఉన్నదాని కోసం నేను సైన్స్‌ను ఫాలో అవుతాను. అంతర్గత విషయాల కోసం దైవాన్ని అనుసరిస్తాను’ అని చెప్పారు.