NCP Expels leaders: తిరుగుబాటు నేతలపై ఎన్‌సీపీ బహిష్కరణ వేటు
ABN, First Publish Date - 2023-07-03T18:20:46+05:30
పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన నేతలపై నేషనల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ క్రమశిక్షణా చర్యలకు దిగారు. ముగ్గురు నేతలను పార్టీ నుంచి తొలగించారు.
ముంబై: పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన నేతలపై నేషనల్ కాంగ్రెస్ పార్టీ (NCP) చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar) క్రమశిక్షణా చర్యలకు దిగారు. ముగ్గురు నేతలను పార్టీ నుంచి తొలగించారు. తిరుగుబాటుకు నేతృత్వం వహించిన అజిత్ పవార్ (Ajit pawar) ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఈ ముగ్గురు నేతలు హాజరైనందుకు వారిపై చర్యలు తీసుకున్నారు. పార్టీ బహిష్కరణ వేటుపడిన వారిలో ముంబై డివిజన్ ఎన్‌సీపీ చీఫ్ నరేంద్ర రాథోడ్, అకోలా సిటీ జిల్లా చీఫ్ విజయ్ దేశ్‌ముఖ్, రాష్ట్ర మంత్రి శివజీరావ్ గరజే ఉన్నారు. కాగా, రహస్యంగా ఫిరాయింపులకు వ్యూహరచన చేసిన పార్టీ ఎంపీలు ప్రఫుల్ పటేల్, సునీల్ టట్కరేలపై అనర్హత వేటు వేయాలని పార్టీ లోక్‌సభ ఎంపీ సుప్రియా సులే పార్టీ అధిష్ఠానాన్ని కోరారు.
''పార్టీ రాజ్యాంగాన్ని ఇద్దరు ఎన్‌సీపీ ఎంపీలు ప్రఫుల్ పటేల్, సునీల్ టట్కరే ఉల్లఘించిన విషయాన్ని మీ ముందుకు అత్యవసరంగా తీసుకువస్తున్నాను. వీరు 9 మంది ఎన్‌సీపీ ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారానికి మార్గం సుగమం చేస్తూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారు. పార్టీ అధ్యక్షుడికి తెలియకుండా అత్యంత రహస్యంగా ఈ ఫిరాయింపుల వ్యవహారం జరిగింది. ఇందుకు గాను వీరిపై అనర్హత వేటు వేయాల్సి ఉంటుంది. తద్వారా ఎన్‌సీపీ ఆశయాలు, సిద్ధాంతాలను ఇంకెంతమాత్రం ఈ ఎంపీలు ముందుకు తీసుకువెళ్లలేరనే స్పష్టమైన సందేశం ఇచ్చినట్టు అవుతుంది'' అని పార్టీ చీఫ్ శరద్ పవార్‌కు రాసిన ఒక లేఖలో సుప్రియా సూలే పేర్కొన్నారు.
ప్రఫుల్ పటేల్ ఫోటో తొలగింపు
కాగా, ఢిల్లీలోని నేషనలిస్ట్ స్టూటెంట్ కాంగ్రెస్ కార్యాలయం నుంచి ఎన్‌సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రఫుల్ పటేల్ ఫోటో ఫ్రేమ్‌ను సోమవారంనాడు తొలగించారు. ఎన్‌సీపీని వీడివెళ్లిన ప్రఫుల్ పటేల్, ఇతర నాయకులు ఇంకెంతమాత్రం ఎన్‌సీపీ కుటుంబసభ్యులు కానందున వారి ఫోటోలను తొలగించినట్టు పార్టీ విద్యార్థి విభాగం జాతీయ అధ్యక్షురాలు సోనియా దూహన్ తెలిపారు. పార్టీ మొత్తం శరద్ పవార్ వెంటే ఉందని, పవార్ లేకుంటే ఎన్‌పీనే లేదని అన్నారు.
Updated Date - 2023-07-03T18:20:46+05:30 IST