Fake currency case : నకిలీ కరెన్సీ కేసులో ఎన్ఐఏ సోదాలు.. దావూద్ కంపెనీకి లింకులు?..
ABN, First Publish Date - 2023-05-11T18:42:37+05:30
హై క్వాలిటీ ఇండియన్ కరెన్సీ నోట్ల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ముంబైలో దాదాపు ఆరు చోట్ల సోదాలు నిర్వహించింది.
ముంబై : హై క్వాలిటీ ఇండియన్ కరెన్సీ నోట్ల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ముంబైలో దాదాపు ఆరు చోట్ల సోదాలు నిర్వహించింది. 2021 నౌపడ కేసుగా పిలుస్తున్న ఈ కేసులో అనేక నేరపూరిత మెటీరియల్స్‌ను స్వాధీనం చేసుకుంది. పదునైన ఆయుధాలు, డిజిటల్ డివైసెస్, పత్రాలు వీటిలో ఉన్నాయి. ఈ నకిలీ కరెన్సీ రాకెట్‌తో దావూద్ ఇబ్రహీం కస్కర్ కంపెనీ (D-Company)కి ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని ఎన్ఐఏ గతంలో ఆరోపించింది. తాజా సోదాల్లో ఈ ఆరోపణలకు బలం చేకూరిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
నకిలీ 2,000 రూపాయల నోట్ల చలామణిపై 2021 నవంబరు 18న మహారాష్ట్రలోని థానే నగరంలో ఉన్న నౌపడ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో ముంబైకి చెందిన రియాజ్, నాసిర్‌లను ఎన్ఐఏ అప్పట్లో అరెస్ట్ చేసింది. వీరిద్దరూ ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ హై ప్రొఫైల్ కేసులో థానే పోలీసులు దర్యాప్తు చేసి, ఛార్జిషీట్‌ను దాఖలు చేశారు. దర్యాప్తు బాధ్యతను ఎన్ఐఏ చేపట్టి, 2023 ఫిబ్రవరి 7న మరోసారి కేసును నమోదు చేసింది. బుధవారం నిందితులు, అనుమానితులకు చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించినట్లు ఎన్ఐఏ ఓ ప్రకటనలో తెలిపింది.
ఇవి కూడా చదవండి :
Uddhav Thackeray: సుప్రీంకోర్టులో ఉద్దవ్ ఠాక్రే వర్గానికి ఊరట
Delhi : సుప్రీంకోర్టు తీర్పుపై కేజ్రీవాల్ హర్షం.. అధికారులకు హెచ్చరిక..
Updated Date - 2023-05-11T18:42:37+05:30 IST