Nitin Gadkari: కాంగ్రెస్ నేత పుస్తకావిష్కరణలో గడ్కరి.. దిగ్విజయ్‌పై ప్రశంసలు..
ABN, First Publish Date - 2023-06-30T16:17:25+05:30
మహారాష్ట్రలోని పుణెలో అరుదైన ఘట్టం చోటుచేసుకుంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సహా ఇరుపార్టీలకు చెందిన పలువురు ప్రముఖులు ఒక వేదకపై కనిపించారు. గడ్కరి తన ప్రసంగంలో దిగ్విజయ్ సింగ్‌ను ప్రశంసించడం ఆసక్తికరం.
పుణె: మహారాష్ట్రలోని పుణెలో అరుదైన ఘట్టం చోటుచేసుకుంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి (Nitin Gadkari), కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ (Digvijaya Singh) సహా ఇరుపార్టీలకు చెందిన పలువురు ప్రముఖులు ఒక వేదకపై కనిపించారు. పుణె సమీపంలోని పింప్రి చించ్‌వడ్‌లో కాంగ్రెస్ దివంగత నేత రామకృష్ణ మోరెపై విడుదల చేసిన పుస్కకావిష్కరణ కార్యక్రమంలో వీరంతా ఒకే వేదికపైకి రావడం విశేషం. గడ్కరి తన ప్రసంగంలో దిగ్విజయ్ సింగ్‌ను ప్రశంసించడం మరింత ఆసక్తికరం.
గడ్కరి తన ప్రసంగంలో ఆషాడ ఏకాదశి వార్షిక యాత్రలో పాల్గొన్న దిగ్విజయ్‌పై ప్రశంసలు కురిపించారు. దిగ్విజయ్ ప్రతిఏటా ఆషాడ ఏకాదశికి పండరీపురం దర్శించి, ప్రార్థనలు చేస్తుంటారు. దీనిపై గడ్కరి మాట్లాడుతూ.. ''నేను మీకంటే (దిగ్విజయ్ సింగ్) చిన్నవాడినైనా మీకున్నంత (నడకపరంగా) ధైర్యం నాకు లేదు. యాత్ర సమయంలో మీరు ఎంతో దూరం నడిచి వస్తుంటారు. మిమ్మల్ని అభినందిస్తున్నాను'' అని గడ్కరి నవ్వుతూ అన్నారు. ఇందుకు సింగ్ స్పందిస్తూ, గడ్కరి ప్రయత్నిస్తే ఆయనకు కూడా క్రమం తప్పకుండా యాత్రలో పాల్గొనగలుగుతారని అన్నారు.
బొగ్గు గనుల కేటాయింపుల్లో అవకతకలు జరిగాయంటూ దిగ్విజయ్ అప్పట్లో గడ్కరి పేరును ప్రస్తావించి చిక్కుల్లో పడ్డారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై 2012లో గడ్కరి పరువునష్టం కేసు వేశారు. దిగ్విజయ్ క్షమాపణ చెప్పడంతో ఆయనపై వేసిన కేసును గడ్కరి 2018లో ఉపసంహరించుకున్నారు.
కాగా, పుస్తకావిష్కరణ కార్యక్రమంలో గడ్కరి మహారాష్ట్ర రాజకీయ సంస్కృతిపై కూడా ప్రశంసలు కురిపించారు. రాష్ట్రంలో అనేక పార్టీలు, పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత సంబంధాలను కొనసాగిస్తుంటారని, ఇందుకు మహారాష్ట్ర ఒక చక్కటి ఉదాహరణ అని అన్నారు.
Updated Date - 2023-06-30T16:17:25+05:30 IST