ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

No-confidence motion : మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం.. 12 గంటలకు లోక్‌సభ స్పీకర్ పరిశీలన..

ABN, First Publish Date - 2023-07-26T12:01:00+05:30

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విశ్వాసం లేదంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానం నోటీసులను లోక్‌సభలో సమర్పించాయి. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్, బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావు ఈ నోటీసులను ఇచ్చారు. వీటిని బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు లోక్ సభ సభాపతి ఓం బిర్లా పరిశీలిస్తారు.

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విశ్వాసం లేదంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానం నోటీసులను లోక్‌సభలో సమర్పించాయి. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్, బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావు ఈ నోటీసులను ఇచ్చారు. వీటిని బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు లోక్ సభ సభాపతి ఓం బిర్లా పరిశీలిస్తారు. అయితే ఈ తీర్మానాలకు మద్దతిచ్చే ఎంపీల సంఖ్య దాదాపు 140 వరకు ఉంది, అధికార పక్షానికి 332 మంది ఎంపీల మద్దతు కనిపిస్తోంది, ఈ రెండు పక్షాలకు చెందనివారు సుమారు 60 మంది ఉన్నారు. దీంతో ఈ తీర్మానాల వల్ల ప్రభుత్వానికి నష్టం జరగకపోవచ్చు.

వైకాపా వ్యతిరేకత

వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, అంతా సజావుగా జరుగుతున్నపుడు అవిశ్వాస తీర్మానం అవసరం ఏమిటని ప్రశ్నించారు. ఈ తీర్మానాన్ని తాము వ్యతిరేకిస్తామని తెలిపారు.

సంఖ్యాబలం ముఖ్యం కాదు : ఆర్జేడీ

ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా మాట్లాడుతూ, ప్రజాస్వామ్యం అంటే కేవలం సంఖ్యాబలం మాత్రమే కాదన్నారు. తాము ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానాలకు అనుకూలమైన సంఖ్యాబలం తమకు లేదని తమకు తెలుసునని చెప్పారు. మణిపూర్ తగులబడుతోందని, ప్రధాన మంత్రి మోదీ మాట్లాడాలని దేశం ఎదురు చూస్తోందన్నారు. అవిశ్వాస తీర్మానం నెపంతో ఆయన మాట్లాడేలా చేయవచ్చునన్నారు. మోదీ చేత మాట్లాడించడమే గొప్ప విజయమని చెప్పారు.

మోదీ మాట్లాడాలి : నామా

బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావు మాట్లాడుతూ, తమ పార్టీ తరపున తాము అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించామని చెప్పారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ప్రతిపక్ష పార్టీల నేతలంతా మణిపూర్ సమస్యపై చర్చించాలని పట్టుబడుతున్నారని చెప్పారు. దీనిపై మోదీ మాట్లాడితే దేశ ప్రజలు ప్రశాంతంగా ఉంటారన్నారు. అందుకే తాము ప్రయత్నిస్తున్నామని, మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించామని చెప్పారు.


ఇది చాలా విచిత్రం : ఆర్ఎస్‌పీ

ఆర్ఎస్‌పీ ఎంపీ ఎన్‌కే ప్రేమచంద్రన్ మాట్లాడుతూ, ఇది సంఖ్యాబలానికి సంబంధించిన ప్రశ్న కాదన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటుకు హాజరై, దీనిని ఎదుర్కొనడం ఆయనకుగల రాజ్యాంగబద్ధ కర్తవ్యమని చెప్పారు. ప్రధాని సభకు హాజరయ్యేలా చేయడం కోసం అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టవలసి తప్పనిసరి పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇది చాలా విచిత్రంగా ఉందని, ఇటువంటి పరిస్థితిని మన దేశం ఎన్నడూ చూడలేదని అన్నారు.

మోదీ ఎందుకు రావడం లేదు?

శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది మాట్లాడుతూ, మణిపూర్ విషయంలో ఒకరు బాధ్యతను విస్మరిస్తున్నారని, మరొకరు బాధ్యతను భుజాలకెత్తుకోవడం లేదని, ప్రధాన మంత్రి పార్లమెంటుకు ఎందుకు రావడం లేదని ప్రజలు ఆశ్చర్యపోతున్నారన్నారు. ఆయనను పార్లమెంటుకు తీసుకురావడం కోసం అవిశ్వాస తీర్మానాన్ని ఉపయోగించవలసి వచ్చిందంటే, తాము దేశానికి ఎంతో సేవ చేస్తున్నామని చెప్పారు.


అన్నిటికీ సిద్ధం : కేంద్ర మంత్రులు

పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ మాట్లాడుతూ, అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టనివ్వండి, ప్రభుత్వం ఏ పరిస్థితికైనా సిద్దంగా ఉంది అని చెప్పారు. మణిపూర్ సమస్యపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాకమునుపు ప్రతిపక్షాలు చర్చకు పట్టుబట్టాయని, చర్చకు ప్రభుత్వం అంగీకరించేసరికి, వారు నిబంధనల సమస్యను లేవనెత్తారని దుయ్యబట్టారు. నిబంధనలపై కూడా తాము అంగీకారానికి వచ్చామని, ఆ తర్వాత వారు ప్రధాన మంత్రి రావాలని, చర్చను ప్రారంభించాలని కొత్త అంశాన్ని లేవనెత్తారని మండిపడ్డారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ మాట్లాడుతూ, బీజేపీ, ప్రధాని మోదీ పట్ల ప్రజలకు విశ్వాసం ఉందన్నారు. గతంలో కూడా ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని తీసుకొచ్చాయని, వారికి ప్రజలు గుణపాఠం చెప్పారని తెలిపారు.

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇచ్చిన ట్వీట్‌లో, ప్రతిపక్ష కూటమి ఇండియా (I.N.D.I.A) నేతలు తాము గతంలో చేసిన పనులను ప్రజల మనసుల నుంచి చెరిపేయలేరని చెప్పారు. పేరు మార్చుకోవడం ద్వారా తమ గతాన్ని వదిలించుకోవాలనుకుంటున్నారని దుయ్యబట్టారు. ప్రతిపక్షాల ప్రచారాన్ని ప్రజలు అర్థం చేసుకుంటారని, ఆ కూటమికి వ్యతిరేకంగా ఓట్లు వేస్తారని అన్నారు.

10 రోజుల్లోగా చర్చ

26 పార్టీల కూటమి ఇండియా (I.N.D.I.A) తరపున కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ బుధవారం ఉదయం 9.20 గంటలకు మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్ కార్యాలయంలో సమర్పించారు. అదేవిధంగా బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావు కూడా అవిశ్వాస తీర్మానాన్ని సమర్పించారు. ఏ రోజైనా ఉదయం 10 గంటల లోపు అవిశ్వాస తీర్మానాన్ని సమర్పిస్తే, దానిని అదే రోజు చేపట్టవలసి ఉంటుంది. లోక్ సభ సభాపతి ఓం బిర్లా ఈ తీర్మానాలను బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు పరిశీలిస్తారు. ఈ తీర్మానాలకు కనీసం 50 మంది ఎంపీల మద్దతు ఉందో, లేదో పరిశీలిస్తారు. నిబంధనలకు అనుగుణంగా మద్దతు ఉంటే, దీనిపై చర్చకు తేదీని, సమయాన్ని కేటాయిస్తారు. సాధారణంగా 10 రోజులలోపునే చర్చ జరిగేలా తేదీని ఖరారు చేస్తారు. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా అత్యధిక ఎంపీలు ఓటు వేస్తే, ప్రభుత్వం రాజీనామా చేయవలసి ఉంటుంది.


ఇవి కూడా చదవండి :

Infosys Foundation : సుధా మూర్తి ఆహారపు అలవాట్లపై దుమారం

Weather : ఉత్తరాంధ్ర, తెలంగాణ, అస్సాం, ఒడిశా, కొంకణ్, మలబార్ తీరాలకు భారీ వర్ష సూచన

Updated Date - 2023-07-26T12:10:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising