Odisha train accident : ఒడిశా రైలు ప్రమాదంపై మోదీకి కాంగ్రెస్ సూటి ప్రశ్నలు

ABN, First Publish Date - 2023-06-04T09:47:40+05:30

ఒడిశాలో మూడు రైళ్లు ప్రమాదానికి గురైన నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కాంగ్రెస్ నేత రణదీప్ సింగ్ సుర్జీవాలా సూటి ప్రశ్నలు సంధించారు.

Odisha train accident : ఒడిశా రైలు ప్రమాదంపై మోదీకి కాంగ్రెస్ సూటి ప్రశ్నలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ఒడిశాలో మూడు రైళ్లు ప్రమాదానికి గురైన నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)కి కాంగ్రెస్ నేత రణదీప్ సింగ్ సుర్జీవాలా (Randeep Singh Surjewala) సూటి ప్రశ్నలు సంధించారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw)ను తక్షణమే ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఓ పత్రికలో ప్రచురితమైన కథనాన్ని ప్రస్తావిస్తూ, సిగ్నలింగ్ సిస్టమ్ వైఫల్యంపై ముఖ్యమైన హెచ్చరికను అశ్విని వైష్ణవ్ ఎందుకు నిర్లక్ష్యం చేశారని నిలదీశారు.

సిస్టమ్‌లో తీవ్రమైన లోపాల గురించి ఫిబ్రవరిలో రైల్వే బోర్డు అధికారులు హెచ్చరించినట్లు సుర్జీవాలా ప్రస్తావించిన వార్తా కథనం తెలిపింది. ఇంటర్‌లాకింగ్ ఫెయిల్యూర్ గురించి ఫిబ్రవరిలో ఆందోళన లేవనెత్తినట్లు, తక్షణమే చర్యలు చేపట్టాలని కోరినట్లు తెలిపింది. సిగ్నల్ మెయింటెనెన్స్ సిస్టమ్‌ను పర్యవేక్షించకపోతే, తక్షణమే సరిదిద్దకపోతే, తీవ్రమైన ప్రమాదాలకు దారితీయవచ్చునని హెచ్చరించారని సుర్జీవాలా ఇచ్చిన ట్వీట్‌లో తెలిపారు. రైల్వే మంత్రి, రైల్వే మంత్రిత్వ శాఖ ఈ హెచ్చరికలను ఎందుకు పట్టించుకోలేదు? ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారు? అని ప్రశ్నించారు. ఇటీవల కొన్ని గూడ్స్ రైళ్లు పట్టాలు తప్పడాన్ని ప్రస్తావించారు. ఇటువంటి సంఘటనలు రైల్వే భద్రత కొరవడటం గురించి తెలియజేసి, తగిన స్థాయిలో అప్రమత్తంగా ఉండాలనే స్పృహను ఎందుకు కలిగించలేదని ప్రశ్నించారు. తగిన చర్యలు తీసుకునే విధంగా రైల్వే మంత్రిత్వ శాఖపై ఈ సంఘటనలు ఎందుకు ప్రభావం చూపలేదని నిలదీశారు.

రైల్వే భద్రతపై దృష్టి సారించకుండా, మార్కెటింగ్ చేయడంపైనా, ప్రధాన మంత్రిని మచ్చిక చేసుకోవడంపైనా రైల్వే మంత్రి దృష్టిపెట్టడం సరైనదేనా? అని నిలదీశారు. వందే భారత్ రైళ్లను ప్రధాన మంత్రి చేత ప్రారంభింపజేయడంపైనా, రైల్వే స్టేషన్లను ముస్తాబు చేసి, వాటి చిత్రాలను ట్వీట్ చేయడంపైనా; ప్రయాణికుల భద్రతకు తగిన చర్యలు తీసుకోకుండా ఆదాయాన్ని పెంచుకోవడంపైనా రైల్వే మంత్రి ప్రధాన దృష్టి కేంద్రీకరించారా? అని ప్రశ్నించారు. ఒడిశా రైలు ప్రమాదం జరగడానికి కొద్ది గంటల ముందు రైల్వే భద్రతపై నిర్వహించిన మేధోమథనం సమావేశానికి రైల్వే మంత్రి హాజరుకాకపోవడానికి కారణం ఇదేనా? అని ప్రశ్నించారు. వందే భారత్ రైళ్లను ప్రారంభించడంపై ఆయన దృష్టి సారించారని, ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రాధాన్యం ఇచ్చారని దుయ్యబట్టారు.

రైల్వే మంత్రికి అదనంగా ఐటీ, టెలికాం శాఖలను కూడా అప్పగించి, ఆయనపై పెను భారం మోపారని, రైల్వే మంత్రిత్వ శాఖను వెనుకకు నెట్టారని, భద్రతను పణంగా పెట్టారని మండిపడ్డారు.

రైల్వేలలో చాలా ఉద్యోగాలు ఖాళీగా ఉండటాన్ని ప్రస్తావిస్తూ, సిబ్బంది లేకపోతే సమర్థవంతంగా రైల్వే శాఖను ఎలా నిర్వహించగలుగుతారని, కార్యకలాపాలు సురక్షితంగా ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు.

ట్రైన్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్ (రైళ్లు డీకొనడాన్ని నివారించే వ్యవస్థ - TCAS) లేదా కవచ్ ఈ ప్రమాదం జరిగిన మార్గంలో లేదని గుర్తు చేశారు. రైల్వే జోన్లన్నిటిలోనూ ఈ వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేయడం లేదని ప్రశ్నించారు.

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం జరిగిన మూడు రైళ్ల ప్రమాదంలో 288 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 1,100 మంది గాయపడ్డారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, అశ్విని వైష్ణవ్ తదితరులు ప్రమాద స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. మృతుల కుటుంబాలకు, గాయపడినవారికి ఆర్థిక సాయం ప్రకటించారు.

ఇవి కూడా చదవండి :

Katakam Sudarshan: మావోయిస్ట్ అగ్రనేత కటకం సుదర్శన్ మృతి

Trains cancelled: ఒడిశా ప్రమాదం ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు

Updated Date - 2023-06-04T09:47:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising