Odisha train tragedy: మమత, లాలూ హయాంలో రైలు ప్రమాదాల చిట్టా తీసిన బీజేపీ
ABN, First Publish Date - 2023-06-04T17:29:09+05:30
ఒడిసా రైలు ప్రమాదానికి బాధ్యత వహిస్తూ కేంద్ర రైల్వే మంత్రి రాజీనామా చేయాలంటూ విపక్షాలు డిమాండ్ చేసిన నేపథ్యంలో బీజేపీ గట్టి కౌంటర్ ఇచ్చింది. మమతా బెనర్జీ, లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ రైల్వే మంత్రులుగా ఉన్నప్పుడు జరిగిన ప్రమాదాలు, మృతుల సంఖ్యతో కూడిన చిట్టాను బయటకు తెచ్చింది.
న్యూఢిల్లీ: ఒడిసా రైలు ప్రమాదానికి (Odisha train tragedy) బాధ్యత వహిస్తూ కేంద్ర రైల్వే మంత్రి రాజీనామా చేయాలంటూ విపక్షాలు డిమాండ్ చేసిన నేపథ్యంలో బీజేపీ (BJP) గట్టి కౌంటర్ ఇచ్చింది. మమతా బెనర్జీ (Mamata Banerjee), లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav), నితీష్ కుమార్ (Nitish Kumar) రైల్వే మంత్రులుగా ఉన్నప్పుడు జరిగిన ప్రమాదాలు, మృతుల సంఖ్యతో కూడిన చిట్టాను బయటకు తెచ్చింది.
బీజేపీ ప్రభుత్వంలోని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, మమతా బెనర్జీ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు 54 రైలు ప్రమాదాలు జరిగాయి. పట్టాలు తప్పిన ఘటనలు 838 చోటుచేసుకున్నాయి. 1,451 మంది ఈ ఘటనల్లో మృతి చెందారు. నితీష్ కుమార్ హయాంలో రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు రైళ్లు ఢీకొన్న ఘటనలు 79, పట్టాలు తప్పిన ఘటనలు 1000 వరకూ జరిగాయి. ఈ ఘటనల్లో 1,527 మంది మృతి చెందారు. లాలూ ప్రసాద్ యాదవ్ కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు రైలు ప్రమాద ఘటనలు 51 చోటు చేసుకోగా, పట్టాలు తప్పిన ఘటనలు 550 చోటుచేసుకున్నాయి. 1,159 మంది మృతి చెందారు.
ఒడిశాలో బాలాసోర్‌లో గత శుక్రవారంనాడు జరిగిన రైలు ప్రమాద స్థలిని సందర్శించిన పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై ప్రశ్నలు కురిపించారు. యాంటీ-కొయిలీజన్ సిస్టమ్‌ను ఆ రూట్‌లో ఏర్పాటు చేసి ఉంటే ప్రమాదాన్ని నిలువరించ గలిగేవారమని అన్నారు. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ కేంద్రంపై విమర్శలు గుప్పిస్తూ, రైల్వేలను కేంద్రం ధ్వంసం చేసిందని, ఒడిశా దుర్ఘటనకు కారణాలను తెలుసుకునేందుకు అత్యున్నత స్థాయి దర్యాప్తు తప్పనిసరని వ్యాఖ్యానించారు. కాగా, మమతా బెనర్జీ గతంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేలో చేరడంతో 1999లో అటల్ బిహారీ వాజ్‌పేయి క్యాబినెట్‌లో ఆమెకు రైల్వే శాఖ కేటాయించారు. 2009లో యూపీఏ-2లో రైల్వే మంత్రిగా బెనర్జీ పనిచేశారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో రైల్వే మంత్రిగా పనిచేయగా, 2004లో యూపీఏ హయాంలో లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా పనిచేశారు.
Updated Date - 2023-06-04T18:05:55+05:30 IST