For Onions: ఉల్లి రైతుల కన్నీళ్లు.. పాపం.. చచ్చిపోవడానికి అనుమతి అడుగుతున్నారంటే..
ABN, First Publish Date - 2023-02-25T12:17:18+05:30
ఉల్లిపాయలను సాగు చేస్తున్న రైతులు తీవ్ర కష్టాల్లో ఉన్నారు. ఉల్లిపాయలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో తాము సాగు కోసం ఖర్చు
నాసిక్ (మహారాష్ట్ర) : ఉల్లిపాయలను సాగు చేస్తున్న రైతులు తీవ్ర కష్టాల్లో ఉన్నారు. ఉల్లిపాయలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో తాము సాగు కోసం ఖర్చు చేసిన సొమ్మును సైతం రాబట్టుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆత్మహత్య చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని నాసిక్ జిల్లాలోని కొందరు రైతులు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)ని కోరారు.
సాగు చేసిన ఉల్లిపాయలను మార్కెట్‌కు తీసుకెళ్తే చాలా తక్కువ ధరకు కొంటున్నారని, తాము వీటిని పండించడం కోసం పెట్టిన పెట్టుబడి సైతం రావడం లేదని వాపోయారు. ఓ రైతు మాట్లాడుతూ తాను ఉల్లి (Onions) సాగు కోసం రూ.3.5 లక్షలు ఖర్చు చేశానని, వాటిని మార్కెట్లో అమ్మితే తనకు రూ.1 లక్ష అయినా రావడం లేదని చెప్పారు. రైతుల సమస్యలపై మోదీ ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. తమను మోదీ పట్టించుకోవడం లేదన్నారు. తమ పంటకు న్యాయమైన ధరను పొందే అర్హత, హక్కు తమకు ఉన్నాయన్నారు. గిట్టుబాటు ధర కల్పించాలని, లేదంటే ఆత్మహత్య చేసుకోవడానికి తమకు అనుమతి ఇవ్వాలని అన్నారు. తమ పిల్లలకు రూ.10 విలువ కలిగిన చాకొలెట్‌ను కొని ఇవ్వడం గురించి ఆలోచించలేకపోతున్నామన్నారు.
ఓ మహిళా రైతు మాట్లాడుతూ, తాము ఓ ఎకరా విస్తీర్ణంలో ఉల్లిపాయలను సాగు చేశామని చెప్పారు. బంగారాన్ని తాకట్టు పెట్టి ఉల్లిపాయలను పండించామని చెప్పారు. సాగు కోసం రూ.50,000 ఖర్చయిందని, పంటను మార్కెట్‌కు తీసుకెళ్తే రూ.20,000 నుంచి రూ.25,000 అయినా తిరిగి రావడం లేదని చెప్పారు. తమ కోసం కేంద్ర ప్రభుత్వం ఏదో ఒకటి చేయాలన్నారు. ఉల్లిపాయల ధరను కేంద్ర ప్రభుత్వం పెంచాలని కోరారు. తమ పిల్లల చదువుల కోసం పాఠశాలలకు రుసుములు చెల్లించలేకపోతున్నామని తెలిపారు. ఉల్లిపాయల సాగు కోసం తాము చాలా శ్రమించామని చెప్పారు. దురదృష్టవశాత్తూ తమకు సరైన ధర రావడం లేదన్నారు. ఆత్మహత్య చేసుకోవడానికి అనుమతి కావాలన్నారు.
మరో రైతు మాట్లాడుతూ, తాము మూడు, నాలుగు నెలలపాటు శ్రమించి ఉల్లిపాయలను పండించి, మార్కెట్‌కు తీసుకెళ్తే, చాలా తక్కువ ధరకు కొంటున్నారని తెలిపారు. రూ.50,000 నుంచి రూ.60,000 వరకు తాము ఖర్చుపెడితే, కనీసం రూ.10,000 లేదా రూ.11,000 అయినా తిరిగి రావడం లేదని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని, లేదంటే తాము ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి :
DRDO : సెక్స్ కోసం పాకిస్థానీ గూఢచారికి రహస్య సమాచారం ఇచ్చేసిన డీఆర్డీఓ అధికారి
Yogi Adityanath : యోగి ఆదిత్యనాథ్ భద్రతా సిబ్బందిలో ఒకరు అనూహ్య మృతి
Updated Date - 2023-02-25T12:33:09+05:30 IST