Madhya Pradesh Election: మధ్యప్రదేశ్‌లో ఎన్నికలకు ముందు కాలి బూడిదైన 12 వేలకుపైగా ముఖ్యమైన ఫైల్స్...
ABN, First Publish Date - 2023-06-13T15:56:28+05:30
మధ్య ప్రదేశ్‌లోని భోపాల్‌లో ఉన్న సాత్పుర భవన్‌లో సోమవారం సంభవించిన భారీ అగ్ని ప్రమాదంపై రాజకీయ దుమారం రేగుతోంది. ఈ సంఘటనలో రూ.25 కోట్ల విలువైన ఫర్నిచర్ కాలిపోగా, 12 వేలకుపైగా ముఖ్యమైన ఫైళ్లు బూడిద కుప్పగా మిగిలిపోయాయి. ఇదంతా కుట్ర అని కాంగ్రెస్ ఆరోపిస్తుండగా, ముఖ్యమైన ఫైళ్లు ధ్వంసం కాలేదని రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది.
భోపాల్ : మధ్య ప్రదేశ్‌లోని భోపాల్‌లో ఉన్న సాత్పుర భవన్‌లో సోమవారం సంభవించిన భారీ అగ్ని ప్రమాదంపై రాజకీయ దుమారం రేగుతోంది. ఈ సంఘటనలో రూ.25 కోట్ల విలువైన ఫర్నిచర్ కాలిపోగా, 12 వేలకుపైగా ముఖ్యమైన ఫైళ్లు బూడిద కుప్పగా మిగిలిపోయాయి. ఇదంతా కుట్ర అని కాంగ్రెస్ ఆరోపిస్తుండగా, ముఖ్యమైన ఫైళ్లు ధ్వంసం కాలేదని రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది.
ఆరు అంతస్థులుగల సాత్పుర భవన్‌లో మధ్య ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వివిధ డిపార్ట్‌మెంట్ల కార్యాలయాలు ఉన్నాయి. మూడో అంతస్థులో ప్రారంభమైన మంటలు నాలుగు, ఐదు, ఆరు అంతస్థులకు వ్యాపించాయి. శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ ప్రమాదం జరగడంతో ప్రతిపక్షాలు విమర్శలకు పదును పెడుతున్నాయి.
ఇదిలావుండగా, సాత్పుర భవన్‌లో అగ్ని ప్రమాదం జరగడం పదేళ్లలో ఇది మూడోసారి. 2012, 2018, 2023 సంవత్సరాల్లో శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలోనే అగ్ని ప్రమాదాలు జరిగాయి. అది కూడా మూడో అంతస్థులోనే ప్రమాదం ప్రారంభమవుతోంది.
ప్రాథమిక సమాచారం ప్రకారం మూడో అంతస్థులోని గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో సోమవారం సాయంత్రం 4 గంటలకు అగ్ని ప్రమాదం సంభవించింది. సైన్యానికి చెందిన అగ్నిమాపక శకటాలు, నిపుణులు హుటాహుటిన చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. దాదాపు 12 గంటలపాటు శ్రమించిన తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి. ఏసీ పేలుడు కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు.
ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖలోని ఫిర్యాదుల విభాగానికి వచ్చిన ఫిర్యాదులు, కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఆసుపత్రులకు చెల్లించిన సొమ్ముకు సంబంధించిన పత్రాలు కాలి బూడిదయ్యాయి. ఆరోగ్య సేవల డైరెక్టరేట్, నర్సింగ్, ఫిర్యాదులు, అకౌంట్స్, కమిషన్ బ్రాంచ్, విధాన సభ ప్రశ్నలకు సంబంధించిన పత్రాలు కాలిపోయినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రెండో అంతస్థులో ఉన్న హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి ఎటువంటి నష్టం జరగలేదని తెలిపింది. ఆసుపత్రులకు మందులు, పరికరాలు, ఫర్నిచర్, టెండర్ ఫైళ్లు రెండో ఫ్లోర్‌లో ఉన్నాయని, ఇవి కూడా సురక్షితంగా ఉన్నాయని తెలిపింది.
దర్యాప్తు కమిటీ ఏర్పాటు
సాత్పుర భవన్‌లో సంభవించిన అగ్నిప్రమాదంపై దర్యాప్తు చేసేందుకు ఓ కమిటీని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఏర్పాటు చేశారు. ఏసీఎస్ హోం రాజేశ్ రజౌరా, పీఎస్ అర్బన్ నీరజ్ మండ్లోయ్, పీఎస్ పీడబ్ల్యూడీ సుఖ్‌బీర్ సింగ్ ఈ కమిటీలో ఉన్నారు.
ఇవి కూడా చదవండి :
AIADMK Vs BJP : బీజేపీతో తెగదెంపులకు ఏఐఏడీఎంకే సిద్ధం?
Govt Vs Twitter : ట్విటర్ మాజీ సీఈఓ ఆరోపణలు పూర్తిగా అబద్ధం : కేంద్ర మంత్రి
Updated Date - 2023-06-13T15:56:28+05:30 IST