Padma Awards 2023: మీ హయాంలో నాకు పద్మ అవార్డ్ రాదనుకున్నా... మోదీకి చెప్పిన షా రషీద్ అహ్మద్ ఖదారీ
ABN, First Publish Date - 2023-04-05T21:37:23+05:30
మోదీ ప్రభుత్వం వచ్చాక తనకిక పద్మ అవార్డు రానే రాదనుకున్నానని ఆయన చెప్పారు. అయితే మోదీ తన అంచనాలు తప్పని నిరూపించారని షా రషీద్ అహ్మద్ ఖదారీ చెప్పారు.
న్యూఢిల్లీ: రాష్టప్రతిభవన్లో(Rashtrapati Bhavan) పద్మ పురస్కారాల ప్రదానోత్సవ వేళ (Padma Awards 2023) ఊహించని ఘటన జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Droupadi Murmu) చేతుల మీదుగా పద్మశ్రీ (Padma Shri) అవార్డ్ అందుకున్న షా రషీద్ అహ్మద్ ఖదారీ(Shah Rasheed Ahmed Quadari) తన మనసులోని మాటను నేరుగా ప్రధానమంత్రి నరేంద్రమోదీతో (PM Modi) పంచుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తనకు పద్మశ్రీ రాలేదని, మోదీ ప్రభుత్వం వచ్చాక తనకిక పద్మ అవార్డు రానే రాదనుకున్నానని ఆయన చెప్పారు. అయితే మోదీ తన అంచనాలు తప్పని నిరూపించారని షా రషీద్ అహ్మద్ ఖదారీ చెప్పారు. తనకు పద్మ అవార్డు బహూకరించినందుకు ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. పద్మ అవార్డులు అందుకున్నవారిని ప్రధాని మోదీ అభినందిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. షా రషీద్ అహ్మద్ ఖదారీ మాట్లాడుతున్నంత సేపూ ఓపికగా విన్న ప్రధాని తర్వాత నవ్వుతూ ఆయన్ను అభినందించి వెళ్లారు. బిద్రీ ఆర్ట్‌లో(Bidri art) అనేక కొత్త డిజైన్లు సృష్టించినందుకు షా రషీద్ అహ్మద్ ఖదారీకి పద్మశ్రీ దక్కింది.
అంతకుముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ అవార్డులు బహూకరించారు. సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయంసింగ్ యాదవ్‌కు మరణానంతరం ప్రకటించిన పద్మవిభూషణ్ అవార్డును ఆయన తనయుడు అఖిలేష్ యాదవ్ అందుకున్నారు. ఆధ్యాత్మిక రంగంలో సేవలకుగాను చిన్నజీయర్ స్వామికి పద్మభూషణ్ అవార్డు బహూకరించారు. సామాజిక సేవలో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి పద్మ భూషణ్ అవార్డును అందుకున్నారు. సైన్స్ ఇంజినీరింగ్ విభాగంలో మిల్లెట్ మ్యాన్ ఖాదర్వలీ, కళారంగంలో సేవలకు గాను సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి, విజ్ఞానరంగంలో ప్రొఫెసర్ నాగప్ప గణేష్, విజ్ఞానరంగంలో అబ్బారెడ్డి రాజేశ్వర్రెడ్డి, కళారంగంలో రవీనా టాండన్ పద్మశ్రీ అవార్డులు అందుకున్నారు.
పద్మ అవార్డులు అందుకున్న వారందరికీ కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) విందు ఏర్పాటు చేశారు. అవార్డులు అందుకున్నవారితోనూ, వారి కుటుంబసభ్యులతోనూ షా ముచ్చటించారు.
Updated Date - 2023-04-05T21:57:53+05:30 IST