Rahul Gandhi: నాన్నా! మీరు నాతో ఉన్నారు, మీరే నా స్ఫూర్తి!: రాహుల్ భావోద్వేగ నివాళి
ABN, First Publish Date - 2023-05-21T11:36:03+05:30
న్యూఢిల్లీ: రాజీవ్ గాంధీ 32వ వర్ధంతి సందర్భంగా ఆయనకు రాహుల్ గాంధీ ఘననివాళులర్పించారు. దీనికి ముందు, రాహుల్ తన తండ్రికి భావోద్యోగంతో కూడిన ట్వీట్ చేశారు. ''పాపా, మీరు నాతోనే ఉన్నారు, మీరే స్ఫూర్తి, మీ జ్ఞాపకాలు ఎప్పటికీ మాతోనే ఉంటాయి'' అని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ 32వ వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఆయనకు ఘన నివాళులర్పిస్తున్నారు. ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవాన్ని పాటిస్తున్నారు. 1991 మే 21న శ్రీపెరుంబుదూరులో పార్టీ తరఫున ప్రచారం సాగిస్తున్న రాజీవ్ ఎల్‌టీటీఈ మహిళా సూసైడ్ బాంబర్ దాడిలో కన్నుమూశారు. రాజీవ్ వర్ధంతి సందర్భంగా ఆయన సతీమణి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలు ఆదివారం ఉదయం న్యూఢిల్లీలోని వీర్‌భూమి వద్దనున్న ఆయన సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సైతం వీరి వెంట ఉన్నారు.
దీనికి ముందు, రాహుల్ తన తండ్రికి భావోద్యోగంతో కూడిన ట్వీట్ చేశారు. ''పాపా, మీరు నాతోనే ఉన్నారు, మీరే స్ఫూర్తి, మీ జ్ఞాపకాలు ఎప్పటికీ మాతోనే ఉంటాయి'' అని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ జ్ఞాపకాలతో కూడిన ఒక వీడియోను ట్వీట్‌తో పాటు షేర్ చేశారు. రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ వాద్రా తన తండ్రిని స్మరించుకుంటూ హరివంశ్ రాయ్ బచ్చన్ రాసిన కవితను షేర్ చేశారు.
ప్రధానమంత్రి మోదీ నివాళి
మరోవైపు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం దివంగత రాజీవ్ గాంధీ వర్దంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నట్టు ట్వీట్ చేశారు.
దేశ ఆరవ ప్రధానిగా...
1944 ఆగస్టు 20న జన్మించిన రాజీవ్‌గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ పార్లమెంటరీ నియోజకవర్గానికి నాలుగుసార్లు ప్రాతినిధ్యం వహించారు. 1984 నుంచి 1989 వరకూ దేశ ఆరవ ప్రధానిగా సేవలందించారు. 1984లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హత్యానంతరం ఆయన ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 1991 మే 21న ఎల్‌టీటీఈ మహిళా సూసైడ్ బాంబర్ చేతిలో హతమయ్యారు. యమునా నది ఒడ్డున ఉన్న వీర్‌భూమిలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. ఆయన స్మారకార్ధం ఏటా మే 21వ తేదీని జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవాన్ని దేశం జరుపుకొంటుంది. 1991లో రాజీవ్‌గాంధీని భారతరత్న పురస్కారంతో దేశం గౌరవించుకుంది.
Updated Date - 2023-05-21T11:36:03+05:30 IST