Rahul Gandhi disqualification: మండిపడిన మమత.. రాహుల్ నివాసానికి చేరుకున్న సోనియా
ABN, First Publish Date - 2023-03-24T15:37:02+05:30
యూపిఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ(UPA chairperson Sonia Gandhi) తన తనయుడు రాహుల్ గాంధీ ఢిల్లీ నివాసానికి చేరుకున్నారు.
న్యూఢిల్లీ: మోదీ ఇంటి పేరు(Modi surname) కలవారందరూ దొంగలే అంటూ వ్యాఖ్యానించి రెండేళ్ల జైలుశిక్ష పొందిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ (Congress MP Rahul Gandhi)పై అనర్హత(disqualification) వేటు పడటంపై కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు ఇతర పార్టీల నాయకులు మండిపడుతున్నారు.
సత్యం మాట్లాడేవారి గొంతు నొక్కేందుకు బీజేపీ(BJP) యత్నిస్తోందని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge Leader of the Opposition in Rajya Sabha) ఆరోపించారు. అయినా తాము సత్యమే మాట్లాడతామన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు అవసరమైతే జైలుకు వెళ్తామని ఖర్గే చెప్పారు.
అదానీపై ప్రశ్నించినందుకే రాహుల్‌పై వేటేశారని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ కేసీ వేణుగోపాల్(Congress MP KC Venugopal) ఆరోపించారు.
దేశంలో కక్ష సాధింపు రాజకీయాలు కొనసాగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అధిర్ రంజన్ చౌధరి(Adhir Ranjan Chowdhury, Congress MP) ఆరోపించారు. భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ పాపులారిటీ పెరగడం వల్లే ఆయనపై వేటేశారని చెప్పారు.
రాహుల్ లోక్‌సభ సభ్యత్వాన్ని లోక్‌సభ సెక్రటేరియట్ సెక్రటరీ జనరల్ రద్దు(Disqualification of Rahul Gandhi as Lok Sabha MP) చేసిన ఘటనను రాహుల్‌పై మోదీ దాడిగా ప్రియాంకా గాంధీ(Priyanka Gandhi Vadra) అభివర్ణించారు. వారసత్వ రాజకీయాలతో తన కుటుంబాన్ని ముడిపెడుతూ విమర్శిస్తుంటారని, నిజానికి తమ కుటుంబ రక్తంతో భారత ప్రజాస్వామ్యాన్ని తీర్చిదిద్దామని ప్రియాంక చెప్పారు.
పార్లమెంట్ నుంచి తొలగించగలరు కానీ కోట్లాది మంది ప్రజల హృదయాలనుంచి రాహుల్‌ను తొలగించలేరని కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ (Karnataka Congress president DK Shivakumar)చెప్పారు.
రాహుల్‌పై వేటు రాజకీయ ప్రేరితమని, తొందరపాటు చర్య అని కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ(Congress leader Abhishek Manu Singhvi) అభిప్రాయపడ్డారు. రాహుల్ గొంతు నొక్కడానికి ప్రభుత్వం కొత్త దార్లు వెతుకుతోందని ఆయన ఆరోపించారు.
ద్రవ్యోల్బణం, నిరుద్యోగం అంశాల నుంచి ప్రజలను పక్కదోవ పట్టించేందుకే రాహుల్‌పై వేటేశారని(Disqualification of Rahul Gandhi as Lok Sabha MP) సమాజ్‌వాదీ పార్టీ అధినేత(SP Chief) అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav)చెప్పారు.
ప్రతిపక్ష నేతలను బీజేపీ టార్గెట్ చేసిందని తృణమూల్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ(West Bengal CM Mamata Banerjee) ఆరోపించారు. ప్రసంగాలను బట్టి కూడా అనర్హత వేటు వేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని దిగజార్చారని మమత మండిపడ్డారు.
దొంగ అన్నందుకు రాహుల్ సభ్యత్వం తొలగిస్తారా అని శివసేన ఉద్ధవ్ వర్గం అధినేత ఉద్ధవ్ థాకరే(Former Maharashtra CM Uddhav Thackeray) కన్నెర్ర చేశారు. దేశంలో దొంగలు, దోపిడిదారులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని, వారిని శిక్షించకుండా రాహుల్‌ను శిక్షిస్తారా అని ఉద్ధవ్ ప్రశ్నించారు. దీన్ని ప్రజాస్వామ్య హత్యగా ఆయన అభివర్ణించారు. నియంతృత్వానికి ఇది ఆరంభ శూచిక అని ఉద్ధవ్ అభిప్రాయపడ్డారు.
రాహుల్ లోక్‌సభ సభ్యత్వం రద్దుపై(Disqualification of Rahul Gandhi as Lok Sabha MP) ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్(Kejriwal) స్పందించారు. ప్రధాని మోదీ(PM Modi) నేతృత్వంలో దేశంలో భయానక పరిస్థితులు సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రతిపక్షాలన్నీ ఐక్యం కావాలన్నారు. కొందరిని జైలుకు పంపిస్తున్నారని, మరికొందరి సభ్యత్వం రద్దు చేస్తున్నారని కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు, యూపిఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ(UPA chairperson Sonia Gandhi) తన తనయుడు రాహుల్ గాంధీ ఢిల్లీ నివాసానికి చేరుకున్నారు. రాహుల్‌పై లోక్‌సభ సచివాలయం అనర్హత వేటు నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు.
Rahul Gandhi:రాహుల్ గాంధీపై అనర్హత వేటు
2019 ఏప్రిల్‌లో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలకుగాను కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష, రూ.15 వేల జరిమానా విధించింది. అయితే, ఆయనకు రూ.10 వేల బాండుతో బెయిల్ ఇచ్చి, పైకోర్టులో అప్పీలు చేసుకోవడానికి వీలుగా 30 రోజులపాటు శిక్షను నిలుపుదల చేస్తున్నట్టు పేర్కొంది. అప్పట్లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే, గుజరాత్ మాజీ మంత్రి పూర్ణేశ్ మోదీ క్రిమినల్ పరువు నష్టం దావా వేశారు.
కర్ణాటకలోని కోలార్‌లో 2019 ఏప్రిల్ 13న ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్‌గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలు ‘మోదీ’ అనే ఇంటిపేరు ఉన్నవారందరినీ, మోదీ ‘కమ్యూనిటీ’ని అవమానించే విధంగా ఉన్నాయని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 2021 అక్టోబరులో రాహుల్‌గాంధీ ఈ కేసు విచారణ నిమిత్తం సూరత్ కోర్టుకు హాజరై వాంగ్మూలం ఇచ్చారు. రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలను ప్రధాని మోదీని ఉద్దేశించి చేశారు కాబట్టి.. వేస్తే ప్రధానే దీనిపై కోర్టును ఆశ్రయించి ఉండాల్సిందని, పూర్ణేశ్ మోదీ కాదని రాహుల్ తరఫు న్యాయవాది వాదించారు. అలాగే.. మోదీ అనే ‘కమ్యూనిటీ’యే లేదు కాబట్టి అసలు ఈ కేసు చెల్లదని కోర్టుకు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ అవినీతిని బయటపెట్టడం తప్ప.. రాహుల్ వ్యాఖ్యల వెనుక వేరే ఎలాంటి దురుద్దేశాలూ లేవని వెల్లడించారు. కేసు విచారణ కిందటివారమే ముగియగా.. ఇరుపక్షాల తుది వాదనలూ విన్న కోర్ట్ ఆఫ్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ హెచ్‌హెచ్ వర్మ.. తీర్పును వాయిదా వేశారు. ఆ తీర్పును గురువారం ప్రకటించారు.
‘‘రాహుల్ తన వ్యాఖ్యలను ప్రధాని మోదీ, నీరవ్ మోదీ, విజయ్ మాల్యా, మేహుల్ చోక్సీ, అనిల్ అంబానీకి పరిమితం చేసుకుని ఉండాల్సింది. కానీ, ఆయన ఉద్దేశపూర్వకంగానే ‘మోదీ’ అనే ఇంటిపేరు కలిగి ఉన్న వ్యక్తులకు బాధకలిగించే వ్యాఖ్యలు చేశారు. క్రిమినల్ పరువునష్టానికి పాల్పడ్డారు’’ అని తన తీర్పులో పేర్కొన్నారు. తన వ్యాఖ్యల ప్రభావం ప్రజల్లో ఎంతగా ఉంటుందనే విషయం.. దాని ద్వారా ఏమేరకు ప్రయోజనాలు పొందగలననే విషయం కూడా ఆయనకు తెలుసని తీర్పులో వ్యాఖ్యానించారు. 2018లో రాహుల్ చేసిన ‘చౌకీదార్ చోర్‌హై’ వ్యాఖ్యల విషయంలో సుప్రీంకోర్టు చేసిన సూచనల గురించి.. అప్పట్లో రాహుల్ బేషరతు క్షమాపణలు చెప్పిన విషయాన్ని కూడా న్యాయమూర్తి ప్రస్తావించారు.
రాహుల్ వ్యాఖ్యల వల్ల.. ఫిర్యాదిదారుకు ఎలాంటి బాధ, నష్టం కలగలేదని, రాహుల్ గతంలో ఎలాంటి కేసులోనూ దోషి కాడని.. కాబట్టి తేలికపాటి శిక్ష విధించాలని రాహుల్ న్యాయవాది చేసిన వ్యాఖ్యలతో కూడా న్యాయమూర్తి ఏకీభవించలేదు. కాగా.. తీర్పు వెలువడే సమయంలో రాహుల్ గాంధీ కోర్టుహాల్‌లోనే ఉన్నారు.
నిజాలు మాట్లాడినందుకు రాహుల్ గాంధీకి శిక్ష పడిందని.. సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఆయన పైకోర్టులో అప్పీలు చేస్తారని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. కోర్టు గుజరాతీ భాషలో ఇచ్చిన 170 పేజీల తీర్పును ఆంగ్లంలోకి అనువాదం చేయాల్సి ఉందని.. దీనిపై అప్పీలుకు వెళ్లే పనిలో ఉన్నామని ఆ పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వి తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి దేశ న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని.. ఈ తీర్పుపై చట్టప్రకారమే ముందుకెళ్లి, ఊరట పొందుతామని చెప్పారు. రాహుల్‌ను దోషిగా పేర్కొన్న ఈ తీర్పును.. దుర్బలమైన, తప్పులతో కూడిన, చట్టపరంగా నిలవని తీర్పుగా ఆయన అభివర్ణించారు.
రాహుల్‌గాంధీ విషయంలో ఈ ప్రభుత్వం ఎలాంటి అనైతికమైన చర్యలకైనా పాల్పడుతుందని దుయ్యబట్టారు. కాగా.. సూరత్ కోర్టు తీర్పు నేపథ్యంలో శుక్రవారం ప్రతిపక్షాలన్నింటితో సమావేశం నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఉదయం 10 గంటలకు ఈ భేటీ నిర్వహించనున్నట్టు సమాచారం. అనంతరం 11.30 గంటలకు పార్లమెంటు నుంచి రాష్ట్రపతి భవన్ దాకా మార్చ్ చేయనున్నట్టు కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. జరుగుతున్న పరిణామాలపై రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించడానికి సమయం కోరినట్టు తెలిపింది.
రాహుల్ తాను చేసే ప్రకటనల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సుప్రీంకోర్టు గతంలోనే సూచించింది. అయినప్పటికీ ఆయన ప్రవర్తనలో మార్పు లేదు. ఆయన సిట్టింగ్ పార్లమెంటు సభ్యుడు. ఒక ఎంపీగా.. ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నప్పుడు (ఇలాంటి వ్యాఖ్యలు) తీవ్రమైన విషయం. ఎంపీల ప్రకటనలకు విస్తృత ప్రభావం ఉంటుంది. ఈ కోణంలో చూస్తే ఆయన చేసిన నేరం (పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేయడం) మరింత తీవ్రమైనది. దీనికి తక్కువ శిక్ష విధిస్తే.. ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపినట్లవుతుంది. అంతేకాదు, పరువునష్టం దావా ప్రయోజనాలు నెరవేరనట్టేనని సూరత్ కోర్ట్ అభిప్రాయపడింది.
Updated Date - 2023-03-24T16:59:36+05:30 IST