Premalatha: ప్రేమలత సంచలన వ్యాఖ్యలు.. ఆ రెండు పార్టీలూ ప్రజలకు చేసిందేమీ లేదు
ABN, First Publish Date - 2023-07-25T08:56:46+05:30
లోక్‌సభ ఎన్నికల్లో వంతుల వారీగా భారీ సీట్లు గెలుచుకుంటున్న అన్నాడీఎంకే, డీఎంకే(AIADMK, DMK)లు రాష్ట్ర ప్రజలకు చేసిందేమీలేదని, కేంద్రం నుంచి
చెన్నై, (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ఎన్నికల్లో వంతుల వారీగా భారీ సీట్లు గెలుచుకుంటున్న అన్నాడీఎంకే, డీఎంకే(AIADMK, DMK)లు రాష్ట్ర ప్రజలకు చేసిందేమీలేదని, కేంద్రం నుంచి దీర్ఘకాలిక పథకాలను కూడా రాష్ట్రానికి తెప్పించలేకపోయాయని డీఎండీకే కోశాధికారి ప్రేమలత(Premalatha) ఎద్దేవా చేశారు. స్థానిక కోయంబేడులో పార్టీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఉదయం జిల్లాశాఖ కార్యదర్శులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీ సభ్యత్వాల్ని ముమ్మరం చేయడానికి దిశానిర్దేశం చేశారు. సమావేశానంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ... డీఎండీకే ఏ కూటమిలోనూ లేకపోవడం వల్లే ఇటీవల ఢిల్లీలో జరిగిన ఎన్డీయే సమావేశానికి తమను ఆహ్వానించలేదని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో ఏ కూటమిలో చేరాలనే విషయమై పార్టీ అధ్యక్షుడు విజయకాంత్ అధికారికంగా ప్రకటిస్తారని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకే గెలుస్తూ వస్తున్నా రాష్ట్ర సంక్షేమం కోసం చేసిందేమీ లేదన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగినా డీఎంకే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, సామాన్య, మధ్యతరగతి కుటుంబీకులు ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. శాసనసభ ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత డీఎంకే వేర్వేరు వైఖరులను ప్రదర్శిస్తోందన్నారు. అధికారంలోకి వచ్చాక ఎన్నికల సందర్భంగా ప్రకటించిన హామీలను నెరవేర్చకుండా ఒకటి రెండు పథకాలతో సరిపెడుతోందని విమర్శించారు.
కెప్టెన్‌తో పోలికా?
డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ రాజకీయాల్లోకి రాకమునుపు విద్యార్థులకు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశారని, అదే రీతిలో నటుడు విజయ్ కూడా ప్రస్తుతం విద్యార్థులకు సహాయ కార్యక్రమాలు చేపడుతుండటం ప్రశంశనీయమన్నారు. అదే సమయంలో విజయ్‌ని విజయకాంత్‌తో పోల్చడం సరికాదన్నారు. అలా పోల్చితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. విజయ్ రాజకీయాల్లోకి వస్తారా రారా అనే విషయంపై ఆయనే బదులివ్వాలన్నారు.
తీర్మానాలు...
ఈ సమావేశంలో విజయకాంత్ జన్మదినమైన ఆగస్టు 25న పేదరిక నిర్మూలనదినంగా పేదలకు విరివిగాసహాయాలు పంపిణీ చేయాలని తీర్మానం చేశారు. అదే విధంగా సెప్టెంబర్ 14న పార్టీ వ్యవస్థాప దినోత్సవాన్ని భారీస్థాయిలో జరపాలని జిల్లా శాఖలకు దిశానిర్దేశం చేశారు. మణిపూర్ హింసాకాండను నిరోధించడంలో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం సహా కేంద్రం విఫలమయ్యాయని ఆరోపిస్తూ, ఆ రాష్ట్రంలో శాంతిస్థాపనకు తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతూ మరొక తీర్మానం చేశారు. కర్ణాటకనుండి 26.32టీఎంసీల జలాలను పొందటానికిడీఎంకే ప్రభుత్వం పటిష్థ చర్యలు తీసుకోవాలని మరో తీర్మానం ప్రతిపాదించి ఆమోదించారు. తిరుచ్చిజిల్లాతురైయూరు,కరూరు,వేలూరు ప్రాంతాల్లో ఖనిజ సంపద దోపిడీ నిరోధానికి చర్యలు తీసుకోవాలని మరో తీర్మానం చేశారు. గృహిణులకు రూ.1000పథకాన్ని నిరుపేద బియ్యం కార్డుదారులందరికీ అమలు చేయాలని కూడా తీర్మానం చేశారు.
Updated Date - 2023-07-25T08:56:46+05:30 IST