Draupadi Murmu : ప్రపంచ వేదికపై ఆత్మవిశ్వాసంతో భారత్ : ద్రౌపది ముర్ము
ABN, First Publish Date - 2023-01-25T20:25:38+05:30
ఒకప్పుడు పేదరికం, నిరక్షరాస్యత నిండిన దేశంగా పేరు పడిన భారత దేశం ఇప్పుడు ప్రపంచ వేదికపై ఆత్మవిశ్వాసం నిండిన దేశంగా
న్యూఢిల్లీ : ఒకప్పుడు పేదరికం, నిరక్షరాస్యత నిండిన దేశంగా పేరు పడిన భారత దేశం ఇప్పుడు ప్రపంచ వేదికపై ఆత్మవిశ్వాసం నిండిన దేశంగా పరివర్తన చెందిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) చెప్పారు. 74వ గణతంత్ర (Republic) దినోత్సవాల సందర్భంగా ఆమె జాతిని ఉద్దేశించి బుధవారం ప్రసంగించారు.
నిరక్షరాస్యత, పేదరికం తాండవించే స్థాయి నుంచి ప్రపంచ వేదికపై ఆత్మవిశ్వాసం తొణికిసలాడే దేశంగా భారత్ పరివర్తన చెందడం వెనుక రాజ్యాంగ నిర్మాతల సమష్టి మేధాశక్తి ఉందని తెలిపారు. వారి మేధాశక్తి మార్గదర్శనం లేకపోతే ఈ ప్రగతి సాధ్యమయ్యేది కాదన్నారు. రాజ్యాంగం ప్రారంభ ముసాయిదాను తయారు చేసిన బీఎన్ రావును, ఆయనకు సహాయపడిన ఇతర నిపుణులు, అధికారులను మనం ఈ సందర్భంగా స్మరించుకోవాలని చెప్పారు. రాజ్యాంగ సభలో అన్ని ప్రాంతాలకు, అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం లభించిందని, 15 మంది మహిళలు కూడా భాగస్వాములయ్యారని పేర్కొన్నారు. ఇది మనందరికీ గర్వకారణమని చెప్పారు.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు భారత దేశం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందన్నారు. రాజ్యాంగానికి తుది రూపం ఇవ్వడంలో ఆయన కీలక భూమిక పోషించారని చెప్పారు.
ఆర్థిక వ్యవస్థ బలోపేతం
మన దేశం గత ఏడాది ప్రపంచంలో ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందిందని చెప్పారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అస్థిరత్వంతో కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఈ ఘనతను మన దేశం సాధించిందని చెప్పారు. సమర్థ నాయకత్వం, సమగ్ర పోరాటం వల్ల ఆర్థిక మాంద్యం నుంచి మన దేశం త్వరగా కోలుకుందని, అభివృద్ధి ప్రస్థానాన్ని కొనసాగించిందని తెలిపారు.
ఎన్నో ఉన్నా అన్నీ మనల్ని ఏకం చేసేవే!
మనమంతా ఒకటేనని, మనమంతా భారతీయులమని రాష్ట్రపతి చెప్పారు. అనేక జాతులు, అనేక భాషలు ఉన్నప్పటికీ, అవి మనల్ని విడదీయలేదని, మనల్ని ఏకం చేశాయని చెప్పారు. అందుకే మనం ప్రజాస్వామిక గణతంత్ర దేశంగా విజయం సాధించామని చెప్పారు. ఇదే భారత దేశ సహజ స్వభావం, సారం అని తెలిపారు.
సైన్స్ అండ్ టెక్నాలజీలో అభివృద్ధి
మన దేశం సైన్స్ అండ్ టెక్నాలజీలో సాధించిన అభివృద్ధి మనకు గర్వకారణమని తెలిపారు. స్పేస్ టెక్నాలజీ రంగంలో ముందంజలో ఉన్న అతి కొద్ది దేశాల్లో మన దేశం ఒకటి అని చెప్పారు.
‘ఆత్మనిర్భర్’కు గొప్ప స్పందన
అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో భారత దేశ ఆర్థిక వ్యవస్థ ఒకటని చెప్పారు. ప్రభుత్వం సకాలంలో, చురుగ్గా, క్రియాశీలంగా పని చేస్తుండటం వల్లే ఇది సాధ్యమైందని తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ (స్వయంసమృద్ధ భారత దేశం) పథకానికి గొప్ప స్పందన వస్తోందని తెలిపారు. రంగాలవారీగా ప్రత్యేక ప్రోత్సాహక పథకాలు ఉన్నాయన్నారు.
అవి ఇక నినాదాలు కాదు
మహిళా సాధికారత, స్త్రీ, పురుష సమానత్వం అనేవి ఇక ఎంత మాత్రం నినాదాలు కాదని, ఈ ఆదర్శాలను వాస్తవ రూపంలోకి తీసుకురావడంలో గత కొన్ని సంవత్సరాల్లో మనం గొప్ప ప్రగతి సాధించామని చెప్పారు. రేపటి భారత దేశాన్ని తీర్చిదిద్దడంలో మహిళలు గొప్ప కృషి చేస్తారనడంలో తనకు ఎటువంటి సందేహం లేదన్నారు.
జీ20 ప్రెసిడెన్సీ భారత్‌కు గొప్ప అవకాశం
ప్రజాస్వామ్యాన్ని, బహుముఖీనత (multilateralism)ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు జీ20 ప్రెసిడెన్సీ మంచి అవకాశమని చెప్పారు. మెరుగైన ప్రపంచం, మెరుగైన భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు ఇది సరైన వేదిక అని తెలిపారు. భారత దేశ నాయకత్వంలో జీ20 మరింత ధర్మబద్ధమైన, సుస్థిర ప్రపంచ నిర్మాణానికి కృషిని పెంచగలుగుతుందని చెప్పారు. ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను చర్చించేందుకు, పరిష్కారాలను కనుగొనేందుకు ఇది ఆదర్శ వేదిక అని చెప్పారు. ప్రపంచ జనాభాలో మూడింట రెండొంతుల మంది ఉన్న దేశాలు జీ20లో ఉన్నాయన్నారు. ప్రపంచ జీడీపీలో 85 శాతం జీడీపీ ఈ దేశాల్లోనే ఉందన్నారు. ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్ళ గురించి చర్చించి, పరిష్కారాలను కనుగొనేందుకు ఇది సరైన వేదిక అని చెప్పారు. గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ ఛేంజ్ చాలా ముఖ్యమైన సమస్యలని తెలిపారు.
ఉమ్మడి బలం
రైతులు, కార్మికులు, ఇంజినీర్లు, సైంటిస్టులు మన దేశానికి గొప్ప బలమని చెప్పారు. ‘‘జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్, జై అనుసంధాన్’’ స్ఫూర్తితో మన దేశం ముందుకెళ్ళడానికి వీరందరి సమష్టి బలం దోహదపడుతుందన్నారు. వీరందరూ దేశ ప్రగతి కోసం పోషిస్తున్న పాత్రను ప్రశంసించారు. గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ ఛేంజ్ సమస్యలపై అత్యవసరంగా స్పందించాలన్నారు. ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయన్నారు. విపరీతమైన వాతావరణ మార్పులు కనిపిస్తున్నాయన్నారు.
సైనికులకు ప్రత్యేక ప్రశంసలు
సరిహద్దులను కాపాడుతూ, దేశం కోసం ఎటువంటి త్యాగానికైనా నిరంతరం సిద్ధంగా ఉంటున్న సైనికులను ప్రత్యేకంగా ప్రశంసించారు. పారామిలిటరీ దళాలు, పోలీసు దళాలను కూడా ప్రశంసించారు.
మన దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1950 జనవరి 26 నుంచి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అందుకే ప్రతి సంవత్సరం జనవరి 26న గణతంత్ర దినోత్సవాలు జరుగుతాయి.
Updated Date - 2023-01-25T20:25:43+05:30 IST