PM Narendra Modi: ప్రధాని మోదీకి ఇదే చివరి ప్రసంగం.. ఎందుకంటే వచ్చే ఏడాదిలో..
ABN, First Publish Date - 2023-08-20T15:37:02+05:30
ప్రతిపక్ష పార్టీలన్నీ ‘ఇండియా’ కూటమిగా ఏర్పడినప్పటి నుంచి.. ఆ పార్టీ నేతలు బీజేపీ ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా..
ప్రతిపక్ష పార్టీలన్నీ ‘ఇండియా’ కూటమిగా ఏర్పడినప్పటి నుంచి.. ఆ పార్టీ నేతలు బీజేపీ ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా తమదైన శైలిలో మోదీపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఇప్పుడు తాజాగా శివసేన (యుబిటి) నాయకురాలు, ఎంపీ ప్రియాంకా చతుర్వేది ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. ఎర్రకోట వద్ద మోదీ చేసిన ప్రసంగం చివరిదని, ఎందుకంటే 2024 ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమి నుంచి కొత్త ప్రధాని ఎన్నుకోబడతారని జోస్యం చెప్పారు. ‘‘77వ భారత స్వాతంత్రాన్ని పురస్కరించుకొని ఎర్రకోట వద్ద భారత ప్రధాని మోదీ ఇచ్చిన ప్రసంగం ఆయనకు చివరిది కాబోతుంది. వచ్చే ఏడాది ‘ఇండియా’ కూటమి నుంచి ఎన్నుకోబడతారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అర్థాంతరంగా విచ్ఛిన్నం చేసినందుకు గాను బీజేపీ తీవ్ర పరిణామాల్ని ఎదుర్కోక తప్పదు’’ అని ప్రియాంకా చతుర్వేది అన్నారు.
ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, రైతుల కష్టాలు, మహిళలపై అఘాయిత్యాలు విపరీతంగా పెరిగిపోయాయని ప్రియాంకా చతుర్వేది పేర్కొన్నారు. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని.. ప్రశ్నలు సైతం లేవనెత్తుతున్నారని అన్నారు. తద్వారా ప్రధాని మోదీ, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ల గుండెల్లో గుబులు పుడుతోందని ఎద్దేవా చేశారు. శత్రుత్వాన్ని చాటడమే బీజేపీ ఏకైక ఎజెండా అని, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినందుకు గాను ఆ పార్టీ అల్లర్లను మరింత సృష్టిస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. సరిగ్గా ఎన్నికల సమయంలో మత కలహాలు రెచ్చగొట్టేందుకు ఈ కాషాయ పార్టీ ప్రయత్నిస్తోందని అన్నారు. మహారాష్ట్రలో ఈ ప్రయత్నం చేశారని.. హర్యానా, మణిపూర్‌లలోనూ ఇదే జరుగుతోందని వ్యాఖ్యానించారు. ఎన్నికలు జరగనున్న ప్రాంతాల్లో అల్లర్లు జరిగేలా ప్రజలను రెచ్చగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని.. అయితే కర్ణాటకలో మాత్రం ఈ విధానం విఫలమైందని చెప్పారు.
తదుపరి ప్రధాని ఇండియా కూటమి నుంచి రావడం తథ్యమని, రాబోయే ప్రధాని భారతదేశాన్ని ప్రగతిశీల మార్గంలో ముందుకు తీసుకెళ్తారని ప్రియాంకా చతుర్వేది నమ్మకాన్ని వెలిబుచ్చారు. ఒకవేళ ప్రియాంకా గాంధీ వారణాసి నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకుంటే.. విపక్షాల కూటమి ఆమెకు మద్దతు ఇస్తుందని తెలిపారు. అంతేకాదు.. ఆమె తప్పకుండా వారణాసి నుంచి గెలుస్తారన్న ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేశారు. అయితే.. ఆ సీటుకి ఎవరూ సరిగ్గా సరిపోతారనే విషయంపై ఇండియా కూటమిలో ఇంకా చర్చలు కొనసాగుతున్నాయన్నారు. ప్రస్తుతం ఇండియా కూటమి ముందంజలో ఉందని, లోక్‌సభ ఎన్నికల్లో తమ కూటమి ‘స్వీప్’ చేయడం ఖాయమని ప్రియాంకా చతుర్వేది చెప్పుకొచ్చారు.
Updated Date - 2023-08-20T15:37:02+05:30 IST