Punjab and Haryana High Court : విడాకుల పిటిషన్ పెండింగ్... భరణం ఇవ్వాలన్న భార్య... భర్తకు షాక్ ఇచ్చిన హైకోర్టు...
ABN, First Publish Date - 2023-03-30T12:57:35+05:30
భార్యను పోషించవలసిన నైతిక, చట్టపరమైన బాధ్యత భర్తకు ఉందని పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు తీర్పు చెప్పింది.
న్యూఢిల్లీ : తనను తాను పోషించుకునే శక్తి, సామర్థ్యాలు లేనటువంటి భార్యను పోషించవలసిన నైతిక, చట్టపరమైన బాధ్యత భర్తకు ఉందని పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు తీర్పు చెప్పింది. వృత్తి రీత్యా బిచ్చగాడు అయినప్పటికీ ఈ బాధ్యతను నెరవేర్చవలసిందేనని స్పష్టం చేసింది. సబార్డినేట్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఓ భర్త దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఈ తీర్పు చెప్పింది.
విడాకుల పిటిషన్ పెండింగ్‌లో ఉన్న కాలంలో భార్యకు నెలకు రూ.5,000 చెల్లించాలని భర్తను సబార్డినేట్ కోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలను ఆ భర్త హైకోర్టులో సవాల్ చేశారు. దీనిపై జస్టిస్ హెచ్ఎస్ మదాన్ హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. తనను తాను పోషించుకునే శక్తి, సామర్థ్యాలు లేనటువంటి భార్యను పోషించవలసిన నైతిక, చట్టపరమైన బాధ్యత భర్తకు ఉందని తెలిపింది. ఆ భర్త వృత్తిరీత్యా బిచ్చగాడు అయినప్పటికీ నెలవారీ పోషణ భత్యాన్ని చెల్లించవలసిందేనని చెప్పింది. ఈ పిటిషన్‌ను తోసిపుచ్చింది.
భర్త/పిటిషనర్ శారీరకంగా సమర్థవంతమైన స్థితిలో ఉన్నట్లు హైకోర్టు తెలిపింది. ఈ రోజుల్లో శారీరక శ్రమ చేసే కూలీ అయినా రోజుకు కనీసం రూ.500 సంపాదిస్తున్నారని తెలిపింది. పెరుగుతున్న ధరలను దృష్టిలో పెట్టుకుంటే, నిత్యావసర వస్తువులు చాలా ఖరీదైపోయాయని, అందువల్ల సబార్డినేట్ కోర్టు ప్రకటించిన పోషణ భత్యం అతిగా ఉందని చెప్పలేమని తెలిపింది.
ఈ కేసులో భార్య తన భర్త నుంచి విడాకులు మంజూరు చేయాలని సబార్డినేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాంతోపాటు విడాకులు మంజూరయ్యే వరకు హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 24 ప్రకారం తన భర్త నుంచి నెలకు రూ.15,000 చొప్పున, వ్యాజ్య ఖర్చుల నిమిత్తం రూ.11,000 ఇప్పించాలని కోరారు.
దీనిపై విచారణ జరిపిన సబార్డినేట్ కోర్టు ఆమెకు నెలకు రూ.5,000 చొప్పున చెల్లించాలని ఆమె భర్తను ఆదేశించింది. విడాకుల పిటిషన్ పెండింగ్‌లో ఉన్న సమయంలో ఈ పోషణ భత్యాన్ని ప్రతి నెలా చెల్లించాలని తెలిపింది. వ్యాజ్య ఖర్చుల నిమిత్తం రూ.5,500 చెల్లించాలని, ప్రతి వాయిదాకు రూ.500 చొప్పున చెల్లించాలని ఆదేశించింది.
ఇవి కూడా చదవండి :
Modi Vs Mamata : కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాట పాడిన దీదీ.. వీడియో వైరల్
Lalit Modi Vs Rahul Gandhi : రాహుల్ గాంధీకి లలిత్ మోదీ హెచ్చరిక
Updated Date - 2023-03-30T12:57:35+05:30 IST