Rahul Gandhi: అసలు రాహుల్ గాంధీ కేసు ఏంటి? ఆయన చేసిన తప్పేంటి? ఈ కేసు ఎలా సాగింది?
ABN, First Publish Date - 2023-08-04T19:28:39+05:30
అది 2019 ఏప్రిల్ నెల. కర్ణాటకలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న రోజులవి. ప్రధాన పార్టీలన్నీ హోరాహోరీగా తమ క్యాంపెయిన్స్ నిర్వహిస్తున్నాయి. ఓటర్లను ఆకర్షించడం కోసం హామీలిస్తూనే, ప్రతిపక్షాలపై విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నాయి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ కూడా రంగంలోకి దిగారు.
అది 2019 ఏప్రిల్ నెల. కర్ణాటకలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న రోజులవి. ప్రధాన పార్టీలన్నీ హోరాహోరీగా తమ క్యాంపెయిన్స్ నిర్వహిస్తున్నాయి. ఓటర్లను ఆకర్షించడం కోసం హామీలిస్తూనే, ప్రతిపక్షాలపై విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నాయి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ కూడా రంగంలోకి దిగారు. ఫుల్ జోష్‌తో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బీజేపీని, మోదీని లక్ష్యం చేసుకొని.. తూపాకీ తూటాల్లా విమర్శలు ఎక్కుపెట్టారు. ఈ క్రమంలోనే ఏప్రిల్ 13వ తేదీన రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కోలార్ సభలో మాట్లాడుతూ.. ‘‘నీరవ్ మోదీ, లలిత్ మోదీ.. ఇలా దొంగలందరికీ ఒకే ఇంటి పేరు (మోదీ) ఎందుకు ఉంటోంది?’’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలే ఆయన మెడకు చుట్టుకున్నాయి. ‘మోదీ’ పేరున్న వారు తీవ్ర ఆగ్రహావేశాలకు గురయ్యారు. నిజానికి.. రాహుల్ టార్గెట్ చేసింది కేవలం నీరవ్ మోదీ, లలిత్ మోదీ, ప్రధాని మోదీలనే అయినా.. మోదీ పేరున్న వాళ్లు హర్ట్ అయ్యారు.
ఈ క్రమంలోనే.. ఏప్రిల్ 15వ తేదీన రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై సూరత్ ఎమ్మెల్యే, బీజేపీ నేత పూర్ణేశ్ మోదీ క్రిమినల్ పరువునష్టం దావా వేశారు. ఈ కేసుని సూరత్ మెట్రోపాలిటన్ కోర్టు విచారించింది. ఈ కేసు విచారణలో భాగంగా రాహుల్ గాంధీ జులై 7వ తేదీన కోర్టుకు హాజరయ్యారు. అనంతరం వాయిదాల పర్వం కొనసాగగా.. 2023 మార్చి 23వ తేదీన న్యాయస్థానం రాహుల్‌ని దోషిగా తేల్చింది. రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. దీంతో.. మార్చి 24న రాహుల్ లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడింది. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. రాహుల్ సభ్యత్వంపై వేటు వెనుక కుట్ర ఉందంటూ ఆరోపణలతో విజృంభించారు. ఓవైపు కాంగ్రెస్ నిరసన సాగుతుండగానే.. మరోవైపు ఏప్రిల్ 2వ తేదీన సూరత్ మెట్రోపాలిటన్ కోర్టు ఇచ్చిన తీర్పును రాహుల్ సవాల్ చేస్తూ, ఈ తీర్పుపై స్టే విధించాలని సూరత్ సెషన్స్ కోర్టును ఆశ్రయించారు.
ఏప్రిల్ 20వ తేదీన రాహుల్ అభ్యర్థనను పరిశీలించిన సూరత్ సెషన్స్ కోర్టు.. ఆయనకు బెయిల్ అయితే మంజూరు చేసింది కానీ, తీర్పుపై స్టే విధించేందుకు నిరాకరించింది. ఈ తీర్పుని సవాల్ చేస్తూ రాహుల్ ఏప్రిల్ 25న గుజరాత్ హైకోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. జులై 7న రాహుల్‌కి అక్కడ కూడా చుక్కెదురైంది. దీంతో.. రాహుల్ జులై 15న గుజరాత్ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జులై 1న గుజరాత్ మాజీమంత్రి పూర్ణేశ్ మోదీతోపాటు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. చివరకు ఆగస్టు 4వ తేదీన రాహుల్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. రాహుల్‌కి విధించిన రెండేళ్ల జైలు శిక్షపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం తీర్పుతో.. రాహుల్ గాంధీకి ఇప్పుడు మళ్లీ లోక్‌సభలో అడుగుపెట్టేందుకు అవకాశం దక్కినట్లయ్యింది. ఇలా.. ఈ విధంగా రాహుల్ కేసు కొనసాగింది.
Updated Date - 2023-08-04T19:30:06+05:30 IST