Bharat Jodo Yatra : ప్రజలకు రాహుల్ గాంధీ హెచ్చరిక
ABN, First Publish Date - 2023-01-13T20:37:27+05:30
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) భారత పౌరులను శుక్రవారం హెచ్చరించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) భారత పౌరులను శుక్రవారం హెచ్చరించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) నేతృత్వంలోని ప్రభుత్వ హయాంలో దేశంలో ఆర్థిక సంక్షోభం పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. నిరుద్యోగం, భరింప శక్యం కానంతటి స్థాయిలో ధరల పెరుగుదల, వ్యవసాయ రంగంలో ఒడుదొడుకులు, దేశ సంపదను కార్పొరేట్ దిగ్గజాలు కబ్జా చేయడం వల్ల ఆర్థిక సంక్షోభం వాతావరణం కనిపిస్తోందన్నారు.
భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో రాహుల్ గాంధీ దేశ ప్రజలకు ఓ లేఖ రాశారు. ఈ లేఖలో, ‘‘స్పష్టమైన ఆర్థిక సంక్షోభం ప్రత్యక్షంగా కనిపిస్తోంది - యువతలో నిరుద్యోగం, భరించలేనంత స్థాయిలో ధరల పెరుగుదల, వ్యవసాయ రంగంలో తీవ్రమైన ఒడుదొడుకులు, దేశ సంపదను కార్పొరేట్ దిగ్గజాలు పూర్తిగా కొల్లగొట్టడం కనిపిస్తోంది. ఉపాధి కోల్పోతామనే భయం ప్రజల్లో ఉంది. వారి ఆదాయాలు మరింత తగ్గిపోతున్నాయి. మెరుగైన భవిష్యత్తు కోసం వారు కంటున్న కలలు కల్లలవుతున్నాయి. దేశవ్యాప్తంగా నిరాశావాదం తాండవిస్తోంది’’ అని పేర్కొన్నారు. దేశంలోని బహుళత్వం, వైవిద్ధ్యాలపై దాడి జరుగుతోందని హెచ్చరించారు. మత, జాతి, ప్రాంతీయ విభేదాలు సృష్టించి, దేశాన్ని విడదీసేందుకు విభజన శక్తులు ప్రయత్నిస్తున్నాయన్నారు. ఈ విభజన శక్తులు కేవలం వేళ్లపై లెక్కించగలిగినంత మంది ఉన్నారన్నారు. ప్రజలు అభద్రతా భావం, భయాందోళనలో ఉన్నపుడు మాత్రమే ఇతరుల పట్ల విద్వేష బీజాలను నాటగలమని వారికి తెలుసునన్నారు. ఈ దుష్ట ఎజెండాకు దాని పరిమితులు దానికి ఉన్నాయని, ఇక ఎంతో కాలం ఇది సాగదని భారత్ జోడో యాత్ర తర్వాత తాను గట్టిగా నమ్ముతున్నానని చెప్పారు. ఈ దుష్టశక్తులపై వీథుల నుంచి పార్లమెంటు వరకు పోరాడటానికి తాను సిద్ధమని చెప్పారు.
కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వస్తే, రైతులు పండించే పంటలకు సరైన ధరను చెల్లిస్తామన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. దేశ సంపదను న్యాయంగా పంపిణీ చేస్తామన్నారు. రూపాయి విలువను బలోపేతం చేస్తామని చెప్పారు. డీజిల్‌ను చౌక ధరకు అందజేస్తామని తెలిపారు.
జనవరి 26 నుంచి ప్రారంభించే హాత్ సే హాత్ జోడో అభియాన్ (Haath Se Haath Jodo Abhiyan) ద్వారా ఐకమత్యం, సోదరభావం సందేశాన్ని వ్యాపింపజేస్తామని తెలిపారు. ప్రతి భారతీయుడు తన కలలను నెరవేర్చుకోవడానికి సమాన అవకాశాలుగల సువర్ణ భారత దేశ నిర్మాణం కోసం చేయీ చేయీ కలపాలని పిలుపునిచ్చారు. ఈ లేఖను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ శుక్రవారం విలేకర్ల సమావేశంలో విడుదల చేశారు.
‘హాత్ సే హాత్ జోడో’ యాత్ర జనవరి 26 నుంచి ప్రారంభమవుతుంది. దీనిలో భాగంగా ప్రతి గ్రామంలోనూ కాంగ్రెస్ జెండాను ఎగురవేసి, నేతలు ఇంటింటికీ వెళ్ళి ప్రజలతో మాట్లాడతారు.
Updated Date - 2023-01-13T20:37:33+05:30 IST