Rajastan : సమయం ఆరు నెలలే ఉంది.. అవినీతిపై చర్యలు తీసుకోండి.. : సచిన్ పైలట్
ABN, First Publish Date - 2023-05-15T11:17:43+05:30
రాజస్థాన్ కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ (Sachin Pilot) నిర్వహిస్తున్న జన సంఘర్ష్ యాత్ర సోమవారం ముగిసింది. మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత
న్యూఢిల్లీ : రాజస్థాన్ కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ (Sachin Pilot) నిర్వహిస్తున్న జన సంఘర్ష్ యాత్ర సోమవారం ముగిసింది. మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత వసుంధర రాజే సింథియా (Vasundhara Raje Scindia)పై వచ్చిన అవినీతి ఆరోపణలపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తూ పైలట్ ఈ ఐదు రోజుల యాత్రను నిర్వహించారు. ఈ యాత్ర ముగింపు సందర్భంగా ఆయన కమల నెహ్రూ నగర్‌లో బహిరంగ సభలో మాట్లాడతారు.
సచిన్ పైలట్ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, తాను ఎవరికీ వ్యతిరేకం కాదని, కేవలం అవినీతిపైన మాత్రమే తన పోరాటమని చెప్పారు. తాను ఎవరినీ దూషించలేదన్నారు. తాను ఎవరిపైనా ఆరోపణలు చేయడం లేదన్నారు. శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్నాయని, ఇక ఆరు నెలల సమయం మాత్రమే ఉందని, అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తనకు వ్యక్తిగతంగా ఎవరితోనూ ఘర్షణ లేదన్నారు.
వసుంధర రాజే సింథియా నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంలో అవినీతి జరిగిందని, దీనిపై అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ జరిపించాలని సచిన్ పైలట్ కోరుతున్నారు. ఇదే డిమాండ్‌తో ఆయన జన సంఘర్ష్ యాత్ర చేశారు. అజ్మీర్ నుంచి జైపూర్ వరకు 125 కిలోమీటర్ల మేరకు ఆయన పాదయాత్ర చేశారు. ఈ యాత్ర గురువారం ప్రారంభమైంది. ఈ యాత్రను అంగీకరించేది లేదని, ఇది సరైన సమయం కాదని కాంగ్రెస్ అధిష్ఠానం చెప్తోంది. ఈ ఏడాది చివర్లో జరిగే శాసన సభ ఎన్నికల్లో గెలిచి, మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్న సమయంలో కాంగ్రెస్ అధిష్ఠానంపై ఈ యాత్ర ఒత్తిడిని పెంచుతోంది.
2020లో సచిన్ పైలట్ నేతృత్వంలో కొందరు ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో సచిన్ పైలట్‌ను రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. ఈ ఎమ్మెల్యేలు బీజేపీ నుంచి డబ్బులు తీసుకున్నారని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఇటీవల ఆరోపించారు. వసుంధర రాజే సింథియాపై అవినీతి ఆరోపణలు నిరాధారమని చెప్పారు. పైలట్ చేస్తున్న యాత్ర వల్ల ఒరిగేదేమీ ఉండదని, పైగా కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాలకు నష్టం జరుగుతుందని అన్నారు.
కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి నేతను ఎంపిక చేసిన తర్వాత రాజస్థాన్‌పై కాంగ్రెస్ పెద్దలు దృష్టి సారించబోతున్నట్లు తెలుస్తోంది. రాజస్థాన్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి సుఖ్‌జిందర్ సింగ్ రణధవా వంటి నేతలు సచిన్ పైలట్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటున్నారు. మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత కమల్‌నాథ్ వంటివారు ఇది ఎన్నికల సంవత్సరం కాబట్టి ఆచితూచి వ్యవహరించాలని చెప్తున్నారు.
ఇవి కూడా చదవండి :
India and America : అమెరికాతో భారత్ వ్యూహాత్మక చర్చలు వచ్చే నెలలో
Church Pastor: కడుపు మాడ్చుకొని చనిపోతే జీసస్‌ను కలుస్తారు!
Updated Date - 2023-05-15T11:17:43+05:30 IST