Rajastan : గెహ్లాట్ ప్రభుత్వంపై సచిన్ పైలట్ విసుర్లు
ABN, First Publish Date - 2023-01-17T15:00:20+05:30
రాజస్థాన్ శాసన సభ ఎన్నికల సంవత్సరం కావడంతో కాంగ్రెస్ యువ, వృద్ధ నేతల మధ్య పోటీ తీవ్రమవుతోంది. సీనియర్ కాంగ్రెస్ నేత,
న్యూఢిల్లీ : రాజస్థాన్ శాసన సభ ఎన్నికల సంవత్సరం కావడంతో కాంగ్రెస్ యువ, వృద్ధ నేతల మధ్య పోటీ తీవ్రమవుతోంది. సీనియర్ కాంగ్రెస్ నేత, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot)పై గుర్రుగా ఉన్న ఆ పార్టీ యువ నేత సచిన్ పైలట్ (Sachin Pilot) తన సొంత బలాన్ని మరింత పెంచుకునేందుకు పావులు కదుపుతున్నారు. గెహ్లాట్ ప్రభుత్వ వైఫల్యాలపై బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు.
ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న సచిన్ పైలట్ రాజస్థాన్‌లోని నాగౌర్‌లో సోమవారం భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన తన సొంత పార్టీ ప్రభుత్వంపైనే వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కొన్నిసార్లు ప్రశ్న పత్రాలు లీక్ అవుతుంటాయని, కొన్నిసార్లు పరీక్షలు రద్దవుతాయని, ఇది చాలా బాధాకరం, ఆందోళనకరమని అన్నారు. విద్యార్థులు చాలా కష్టపడి చదువుకుంటారని, వారికి ఈ పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉంటాయని చెప్పారు. దీనికి కారణమవుతున్న అసలు సూత్రధారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నానని అన్నారు.
రాహుల్ గాంధీ (Rahul Gandhi) నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) వల్ల కాంగ్రెస్‌కు మేలు జరుగుతోందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సచిన్ పైలట్ ఈ వారంలోనే మరో నాలుగు సభలను నిర్వహించబోతున్నారు. వీటిలో ఒక సభను జైపూర్‌లో నిర్వహించబోతున్నారు.
ఇదిలావుండగా సచిన్ పైలట్ వ్యవహార శైలిని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ నిశితంగా గమనిస్తున్నారు. సచిన్ ఓ ద్రోహి అని గతంలో గెహ్లాట్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు సచిన్ మాటలను సోనియా, రాహుల్, ప్రియాంక కూడా గమనిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ ప్రయోజనాల కోసమే బహిరంగ సభలను నిర్వహిస్తున్నట్లు సచిన్ పైలట్ వర్గం వాదిస్తుండగా, భారత్ జోడో యాత్రపైనే మొత్తం దృష్టి కేంద్రీకరించవలసిన సమయంలో ఈ విధంగా సభలను నిర్వహించడం వల్ల రాజస్థాన్ కాంగ్రెస్‌లో అంతఃకలహాలపై మీడియా ఫోకస్ పెరుగుతుందని గెహ్లాట్ వర్గం వాదిస్తోంది.
2018లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడానికి సచిన్ పైలట్ విశేషంగా కృషి చేశారని, కానీ ముఖ్యమంత్రిగా గెహ్లాట్‌ను ఎంపిక చేశారని పైలట్ వర్గం ఆవేదన వ్యక్తం చేస్తోంది. సుమారు 20 మంది ఎమ్మెల్యేలతో పైలట్ తిరుగుబాటు బావుటాను ఎగురవేసినపుడు, వచ్చే శాసన సభ ఎన్నికలలోగా ముఖ్యమంత్రి పదవిని ఇస్తామని కాంగ్రెస్ అధిష్ఠానం పైలట్‌కు హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన సన్నిహితులు గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి అభ్యర్థిగా గెహ్లాట్‌ను ఎంపిక చేయాలని ఆ పార్టీ అధిష్ఠానం భావించినప్పటికీ, అందుకు గెహ్లాట్ ససేమిరా అన్నారు. అత్యధిక ఎమ్మెల్యేల మద్దతు ఆయనకే ఉండటంతో ఆయనను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించడం ఆ పార్టీ పెద్దలకు సాధ్యపడటం లేదు.
పైలట్, గెహ్లాట్ మధ్య రాజీ కుదిర్చేందుకు భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ కృషి చేశారని తెలుస్తోంది. కానీ వీరిద్దరి నుంచి అటువంటి సంకేతాలు రావడం లేదు.
Updated Date - 2023-01-17T15:00:24+05:30 IST