Sankranti: తెలుగు విజ్ఞాన సమితి సంక్రాంతి వేడుకల్లో ఉట్టిపడిన తెలుగుదనం

ABN , First Publish Date - 2023-01-10T11:53:52+05:30 IST

తెలుగు విజ్ఞాన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి(Sankranti) వేడుకల్లో తెలుగుదనం ఉట్టిపడింది. సమితి ఆధ్వర్యంలో సంక్రాంతి

Sankranti: తెలుగు విజ్ఞాన సమితి సంక్రాంతి వేడుకల్లో ఉట్టిపడిన తెలుగుదనం

బెంగళూరు, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): తెలుగు విజ్ఞాన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి(Sankranti) వేడుకల్లో తెలుగుదనం ఉట్టిపడింది. సమితి ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు వయ్యాలికావల్‌లోని సమితి ప్రాంగణంలో ఆదివారం కనులపండువగా జరిగాయి. గోపూజతో సంప్రదాయబద్ధంగా వేడుకలకు శ్రీకారం చుట్టారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం తెలుగు విజ్ఞాన సమితి అధ్యక్షుడు డాక్టర్‌ ఎ.రాధాకృష్ణరాజు మాట్లాడుతూ సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు మాతృభాష బలమైన పునాదిగా ఉందన్నారు. మాతృభాషను విస్మరిస్తే ఏ జాతికైనా మనుగడ లేదన్నారు. ప్రపంచవ్యాప్తంగా మానవాళి గుర్తింపునకు వారి మాతృభాషలే చక్కటి చిరునామాలుగా ఉన్నాయన్నారు. భాష లేకపోతే మనుగడే లేదని, మాతృభాషలోనే ప్రాథమిక విద్యాభ్యాసం జరిగేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని సూచించారు. ఇదే సందర్భంగా సమితి ప్రాంగణంలో తెలుగింటి ఆడపడుచులు వేసిన రంగవల్లులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ పోటీల్లో పాల్గొన్న అందరికీ సమితి తరపున నగదు పురస్కారాలను అందజేసి అభినందించారు. కొవిడ్‌ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శక సూత్రాలకు అనుగుణంగా ఈసారి వేడుకలను అత్యంత సాదాసీదాగా నిర్వహించామని సమితి ప్రధాన కార్యదర్శి ఇడమకంటి లక్ష్మరెడ్డి వెల్లడించారు. సమితి ఉపాధ్యక్షులు కె.గంగరాజు, ఆర్‌.ఆదికేశవులునాయుడు, కోశాధికారి సీఏ వరదరాజు, సంయుక్త కార్యదర్శి చంద్రమోహన్‌తో పాటు పదాధికారులు డి.గణేశ్‌శంకర్‌, ఉమాపతి నాయుడు, నరసింహమూర్తి, వెంకటేశులు, రాధా రాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-10T11:53:55+05:30 IST