Maharashtra: శివాజీ పార్క్ గ్రౌండ్‌లో దసరా ర్యాలీపై వెనక్కి తగ్గిన షిండే శివసేన
ABN, First Publish Date - 2023-10-10T20:59:26+05:30
ఈసారి దసరా ర్యాలీని ముంబై చారిత్రక శివాజీ పార్క్ గ్రౌండ్‌లో నిర్వహించాలనుకున్న ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని శివసేన వర్గం ఎట్టకేలకు వెనక్కి తగ్గింది. ర్యాలీ కోసం బ్రిహాన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి కోరుతూ సమర్పించిన దరఖాస్తును వెనక్కి తీసుకోవాలని నిర్ణయించుకుంది.
ముంబై: ఈసారి దసరా ర్యాలీని (Dussehra rally) ముంబై చారిత్రక శివాజీ పార్క్ గ్రౌండ్‌లో నిర్వహించాలనుకున్న ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) సారథ్యంలోని శివసేన వర్గం ఎట్టకేలకు వెనక్కి తగ్గింది. ర్యాలీ కోసం బ్రిహాన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) అనుమతి కోరుతూ సమర్పించిన దరఖాస్తును వెనక్కి తీసుకోవాలని నిర్ణయించుకుంది. 'శాంతిపూర్వక చర్య'లో భాగంగానే షిండే వర్గం ఈ నిర్ణయం తీసుకున్నట్టు శివసేన ఎమ్మెల్యే సదా సర్వాకంర్ ఒక ట్వీట్‌లో తెలిపారు.
శివాజీ పార్క్ గ్రౌండ్‌లో దసరా వేడుకలను శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాకరే గతంలో ప్రారంభించారు. ఏటా ఇక్కడే దసరా ర్యాలీ జరపడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, ఈసారి అటు ఉద్ధవ్ థాకరే శివసేన వర్గంతో ఇటు షిండే శివసేన వర్గం సైతం శివాజీ పార్క్ గ్రౌండ్ వేదికగా దసరా వేడుకల కోసం బీఎంసీకి దరఖస్తు చేసుకున్నాయి. ఆగస్టు 1న సర్వాంకర్ దరఖాస్తు సమర్పించగా, శివసేన యూబీటీ సెంట్రల్ కార్యాలయం ఆగస్టు 7న దరఖాస్తు సమర్పించింది. ఈ నేపథ్యంలో తమ దరఖాస్తును వెనక్కి తీసుకోవాలని షిండే నిర్ణయం తీసుకున్నట్టు ఎమ్మల్యే సర్వాంకర్ తెలిపారు. హిందువులు ఎంతో ఉత్సాహంగా జరుపుకొనే దసరా పండుగలో ఎలాంటి విభేదాలకు తావీయరాదని షిండే భావించారని, వేరొక చోట తమ దసరా ర్యాలీ ఉంటుందని ఆయన చెప్పారు.
గత ఏడాది ఏంజరిగిందంటే..?
గత ఏడాది సైతం దసరా వేడుకలను శివాజీ పార్క్ గ్రౌండ్‌లో నిర్వహించేందుకు అనుమతి కోరుతూ షిండే, థాకరే వర్గాలు వేర్వేరుగా దరఖాస్తు చేసుకున్నాయి. శాంతిభద్రతల పేరుతో రెండు వర్గాలకూ బీఎంసీ అనుమతి నిరాకరించింది. అయితే, ఆ తర్వాత శివాజీ పార్క్ గ్రౌండ్స్‌లో ర్యాలీ నిర్వహించుకునేందుకు థాకరే సారథ్యంలోని శివసేనకు ముంబై హైకోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో థాకరే వర్గం తాము కోరుకున్న చోటే దసరా వేడుకలు నిర్వహించుకోగా, షిండే వర్గం బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ లోని ఎంఎంఆర్‌డీఏ గ్రౌండ్స్‌లో సెలబ్రేషన్స్ నిర్వహించింది. 2012లో బాల్ థాకరే మరణించడంతో శివాజీ పార్క్‌లో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ప్రాంతాన్ని శివసేన కార్యకర్తలు 'శివ-తీర్ధ' గ్రౌండ్‌గా పిలుస్తారు.
Updated Date - 2023-10-10T21:00:36+05:30 IST