Shind VS Uddah: గుర్తు వివాదం పరిష్కారమైనా తెరపైకి కొత్త వివాదం?
ABN, First Publish Date - 2023-02-19T16:29:31+05:30
ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని శివసేనను అసలుసిసలైన శివసేనగా కేంద్ర ఎన్నికల సంఘ ప్రకటించి, విల్లు-బాణం గుర్తును రెండ్రోజుల క్రితం షిండే వర్గానికి కేటాయించింది. ఆ వెంటనే..
ముంబై: ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని శివసేనను అసలుసిసలైన శివసేనగా కేంద్ర ఎన్నికల సంఘ (ఈసీఐ) ప్రకటించి, విల్లు-బాణం గుర్తును రెండ్రోజుల క్రితం షిండే వర్గానికి కేటాయించింది. ఆ వెంటనే ముంబై దాదర్‌లోని శివసేన ప్రధాన కార్యాలయానికి తాము స్వాధీనం చేసుకోవడం లేదని షిండే వర్గం సైతం ప్రకటించింది. దీంతో ఇంతవరకూ ఉప్పూనిప్పూగా ఉంటున్న షిండే-ఉద్ధవ్ వర్గాల మధ్య వివాదానికి తెరపడినట్టేనా? ఇప్పటికిప్పుడు ఆ అవకాశాలు లేవనే సంకేతాలు తాజాగా వెలువడుతున్నాయి. శివసేన రెండు వర్గాల మధ్య 'సేన శాఖల' (పార్టీ విభాగాలు) వ్యవహారం కొత్తగా తెరపైకి వచ్చింది.
షిండే వర్గాన్ని నిజమైన శివసేనగా ఎన్నికల కమిషన్ శుక్రవారం ప్రకటించిన కొద్ది సేపటికే మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా డపోలి ప్రాంతంలో 'సేన శాఖ' అంశంపై షిండే, ఉద్ధవ్ మద్దతుదారుల మధ్య గొడవ తలెత్తింది. డపోలీలోని సేన కార్యాలయం స్వాధీనం చేసుకునేందుకు షిండే మద్దతుదారులు ప్రయత్నించడంతో పోలీసులు జోక్యం చేసుకున్నట్టు తెలుస్తోంది.
కాగా, సేన శాఖల నెట్‌వర్క్ ఇప్పటికీ తమతోనే ఉందని, అవి ఎక్కడికీ వెళ్లవని ఉద్ధవ్ వర్గం నేతలు చెబుతున్నారు. అయితే, షిండే వర్గీయులు దశలవారిగా ఆ బ్రాంచ్‌లను తమ అధీనంలోకి తీసుకునే వీలుందని విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది. సేన శాఖలు ముంబైలో 200కు పైనే ఉండగా, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో 500 వరకూ ఉన్నాయి. వీటిలో ఎక్కువ శాఖలు స్థానిక నేతలకు చెందినవే. ఇందువల్ల ఆయా శాఖలను తమ అధీనంలోకి తీసుకోవడం షిండే, ఉద్ధవ్ వర్గాలకు కీలకమవుతుంది. డపోలీలోని సేన శాఖ విషయంలో ఇరు వర్గాల మధ్య వివాదం తలెత్తడం ఇందులో భాగమేనని అంటున్నారు. ఇరువర్గాలు సేన శాఖల విషయంలో ప్రతిష్టకు పోతే సమస్య ముదిరే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Updated Date - 2023-02-19T16:29:32+05:30 IST