Karnataka Polls: సిద్ధూపై పోటీకి దిగుతున్నదెవరంటే?
ABN, First Publish Date - 2023-03-30T19:11:56+05:30
వరుణ నుంచి సిద్ధరామయ్య బరిలోకి దిగుతానని ప్రకటించడంతో ఆయనకు చెక్ పెట్టేందుకు బీజేపీ పావులు కదుపుతోంది.
బెంగళూరు: కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో (Karnataka Assembly Polls) ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మైసూరు జిల్లాలోని వరుణ నియోజకవర్గం (Varuna constituency) నుంచి కాంగ్రెస్ తరపున తాను బరిలోకి దిగుతానని మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. వాస్తవానికి ఈ నియోజకవర్గానికి ప్రస్తుతం ఆయన కుమారుడు యతీంద్ర (Yathindra) ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వరుణ నుంచి సిద్ధరామయ్య బరిలోకి దిగుతానని ప్రకటించడంతో ఆయనకు చెక్ పెట్టేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. ఈ నియోజకవర్గం నుంచి మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్ప (BS Yediyurappa) కుమారుడు విజయేంద్రను( BY Vijayendra) బరిలోకి దించాలని కమలనాథులు యోచిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే చర్చలు కూడా జరిగాయి. అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
మరోవైపు ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) పార్టీ 115 నుంచి 127 స్థానాలతో విజయదుందుభి మోగించనుందని ఒపీనియన్ పోల్ సర్వేలు చెబుతోన్న వేళ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్(DK Shiva Kumar)కు మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) షాకిచ్చారు. డీకేకు సీఎం కావాలని ఉన్నా వంద శాతం తానే ముఖ్యమంత్రి అభ్యర్థిని అని ప్రకటించుకున్నారు. ఇవే తనకు చివరి ఎన్నికలని చెబుతూ వస్తోన్న సిద్ధరామయ్య ఎన్నికల నోటిఫికేషన్ వేళ డీకేను బిత్తరపోయేలా చేశారు. వాస్తవానికి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే డీకే శివకుమార్ సీఎం పదవి చేపట్టాలని అభిలషిస్తున్నారు. గడచిన ఐదేళ్లుగా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి అన్నీ తానై నడిపిస్తున్న డీకేకు సిద్ధూ తాజా ప్రకటన గొంతులో వెలక్కాయ పడ్డ చందంగా తయారైంది. జి. పరమేశ్వర కూడా గతంలో సీఎం కుర్చీ తనకు కావాలని ప్రకటనలు కూడా చేశారు.
కర్ణాటకలో ఐదేళ్లుగా బీజేపీ పాలన సాగింది. బస్వరాజ్ బొమ్మై పాలనలో అవినీతి పెరిగిందని ఆరోపిస్తోన్న కాంగ్రెస్ పార్టీ బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకూడదని యత్నించాల్సింది పోయి సీఎం కుర్చీ కోసం నేతలు తగవులాడుకునే పరిస్థితి ఏర్పడితే పార్టీకే నష్టమని రాజకీయ పరిశీలకులు హెచ్చరిస్తున్నారు.
ఓవైపు డబుల్ ఇంజిన్ సర్కారు నినాదంతో మరో ఛాన్స్ ఇవ్వాలని బీజేపీ దూకుడుగా ప్రచారం చేస్తోంది. డైరక్ట్‌గా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) , కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah), బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda), మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్ప (BS Yediyurappa) తదితరులు కర్ణాటకలో విస్తృతంగా పర్యటిస్తూ ఓటర్లకు నచ్చచెబుతున్నారు. జేడీఎస్ (JDS)కూడా ఎన్నికల ప్రచారం జోరుగా సాగిస్తోంది. ఇప్పటికే అనేక చోట్ల అభ్యర్థులను ప్రకటించి ప్రభుత్వ వ్యతిరేక ఓటు తమ పార్టీకి పడేలా జేడీఎస్ వ్యూహాత్మక ప్రచారం సాగిస్తోంది. ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు సంపాదించి కింగ్ మేకర్ పాత్ర పోషించాలని జేడీఎస్ అధినేత కుమారస్వామి(Kumara Swami) యోచిస్తున్నారు.
ఎంఐఎం(MIM) కూడా ముస్లిం ఓట్లు గంపగుత్తగా తమ పార్టీకే పడేలా వ్యూహాలు రచిస్తోంది. హిజాబ్ వివాదం, టిప్పు సుల్తాన్ వివాదం, ముస్లిం రిజర్వేషన్ల రద్దు తదితర అంశాలతో ముస్లింలు అభద్రతకు లోనవుతూ ఎంఐఎంకు దగ్గరౌతున్నారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఇదే జరిగితే ముస్లిం ఓట్లను ఆశిస్తోన్న కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలినట్లేనంటున్నారు. రాష్ట్రంలో చతుర్ముఖ పోటీ నెలకొన్న తరుణంలో ఓటర్లను ఆకట్టుకునే వ్యూహాలు, ప్రతివ్యూహాలు రచించాల్సింది పోయి సిద్ధరామయ్య, డీకే, పరమేశ్వర వంటి కాంగ్రెస్ పెద్దలు సీఎం కుర్చీ కోసం బహిరంగ ప్రకటనలు చేయడం మొదటికే మోసం తేవొచ్చని రాజకీయ పరిశీలకులు హెచ్చరిస్తున్నారు.
224మంది సభ్యులున్న కర్ణాటక అసెంబ్లీలో బీజేపీకి 119మంది, కాంగ్రెస్‌కు 75 మంది, జేడీఎస్‌కు 28మంది సభ్యులుండగా 2సీట్లు ఖాళీగా ఉన్నాయి.
కర్ణాటక (Karnataka)లో మే 10న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపు మే 13న జరుగుతుందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది.
Updated Date - 2023-03-30T19:12:00+05:30 IST