Tamil Nadu : తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ శుక్రవారం
ABN, First Publish Date - 2023-07-20T14:05:31+05:30
మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన తమిళనాడు మంత్రి వీ సెంథిల్ బాలాజీ దాఖలు చేసిన పిటిషన్లపై శుక్రవారం విచారణ జరపనున్నట్లు సుప్రీంకోర్టు గురువారం తెలిపింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తనను అరెస్ట్ చేసి, కస్టడీలో ఉంచి దర్యాప్తు చేయడాన్ని ఆయన సవాల్ చేశారు.
న్యూఢిల్లీ : మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన తమిళనాడు మంత్రి వీ సెంథిల్ బాలాజీ దాఖలు చేసిన పిటిషన్లపై శుక్రవారం విచారణ జరపనున్నట్లు సుప్రీంకోర్టు గురువారం తెలిపింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate-ED) తనను అరెస్ట్ చేసి, కస్టడీలో ఉంచి దర్యాప్తు చేయడాన్ని ఆయన సవాల్ చేశారు. ఈడీ దర్యాప్తును మద్రాస్ హైకోర్టు సమర్థించడాన్ని సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు.
బాలాజీ తరపున సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ, ఈడీ ఏ సమయంలోనైనా బాలాజీని కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉందని, ఈ పిటిషన్లపై వెంటనే విచారణ జరపాలని కోరారు. ఈడీ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ, మద్రాస్ హైకోర్టు వెల్లడించిన కొన్ని అంశాలను వ్యతిరేకిస్తూ ఓ పిటిషన్‌ను ఈడీ దాఖలు చేసిందని చెప్పారు. దీనిని కూడా కలిపి విచారించాలని కోరారు. దీంతో ఈ పిటిషన్లపై శుక్రవారం విచారణ జరిపేందుకు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ అంగీకరించారు.
బాలాజీ అరెస్టును మద్రాస్ హైకోర్టు జూలై 14న సమర్థించింది. ఇద్దరు న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేయగా, మూడో న్యాయమూర్తి బాలాజీ అరెస్టును సమర్థించారు. బాలాజీ ఆసుపత్రిలో ఉన్న కాలాన్ని 15 రోజుల కస్టోడియల్ ఇంటరాగేషన్ నుంచి మినహాయించాలని ఈడీ చేసిన డిమాండ్ సరైనదేనని హైకోర్టు తెలిపింది.
బాలాజీ 2014లో ఏఐఏడీఎంకే ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా పని చేసినపుడు అవినీతి కుంభకోణానికి పాల్పడినట్లు కేసు నమోదైంది. ఆయన 2018లో డీఎంకేలో చేరారు. ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని ప్రభుత్వంలో ఆయన విద్యుత్తు, ఎక్సయిజ్, ప్రొహిబిషన్ పోర్టుఫోలియోలను నిర్వహించారు. జూన్ 14న ఆయనను అరెస్టు చేశారు. అరెస్టు సమయంలో ఆయన కుప్పకూలిపోయారు. అనంతరం చెన్నై ఆసుపత్రిలో జూన్ 21న గుండె శస్త్ర చికిత్స చేయించుకున్నారు. అప్పటి నుంచి ఆయన ఆసుపత్రిలోనే ఉన్నారు.
బాలాజీ అరెస్టు, కస్టోడియల్ ఇంటరాగేషన్ గురించి మద్రాస్ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులు జూలై 4న వేర్వేరు తీర్పులిచ్చారు. ఈ తీర్పుపై సుప్రీంకోర్టు స్పందిస్తూ, ఈ కేసులో సత్వర విచారణ జరిగేలా చూడాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరింది. బాలాజీ సతీమణి మేగల దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై వేరొక న్యాయమూర్తి చేత విచారణ జరిపించాలని తెలిపింది.
బాలాజీని సిటీ గవర్నమెంట్ ఆసుపత్రి నుంచి ఆయనకు నచ్చిన ప్రైవేటు ఆసుపత్రికి మార్చేందుకు అనుమతిస్తూ హైకోర్టు జూన్ 15న ఇచ్చిన తీర్పును ఈడీ సవాల్ చేసింది. బాలాజీ సతీమణి హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో హైకోర్టు ఈ తీర్పు చెప్పింది.
బాలాజీకి చికిత్స చేస్తున్న వైద్యుల అనుమతి పొందిన తర్వాత ఆయనను ఆసుపత్రిలో ప్రశ్నించడాన్ని కట్టడి చేస్తూ జూన్ 16న చెన్నై సెషన్స్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను కూడా ఈడీ సవాల్ చేసింది. ఈడీ దాఖలు చేసిన ఈ రెండు పిటిషన్లపైనా సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది.
ఇవి కూడా చదవండి :
Manipur : మణిపూర్‌లో అంతర్యుద్ధం.. భారత్‌ను బీజేపీ ఏ స్థాయికి దిగజార్చింది?.. టీఎంసీ
Manipur : మణిపూర్ మహిళల నగ్న ఊరేగింపు.. చకచకా జరుగుతున్న కీలక పరిణామాలు..
Updated Date - 2023-07-20T14:05:31+05:30 IST