Delhi excise case : మనీశ్ సిసోడియా బెయిలు దరఖాస్తు.. సీబీఐ, ఈడీలకు సుప్రీంకోర్టు నోటీసులు..
ABN, First Publish Date - 2023-07-14T13:12:37+05:30
ఢిల్లీ రాష్ట్ర మద్యం కుంభకోణం కేసులో నిందితుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా బెయిలు దరఖాస్తుపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. దీనిపై స్పందించాలని కేంద్ర దర్యాప్తు సంస్థ , ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED)లకు నోటీసులు జారీ చేసింది.
న్యూఢిల్లీ : ఢిల్లీ రాష్ట్ర మద్యం కుంభకోణం కేసు (Delhi excise case)లో నిందితుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా (Manish Sisodia) బెయిలు దరఖాస్తుపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. దీనిపై స్పందించాలని కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED)లకు నోటీసులు జారీ చేసింది. ఆయన సతీమణి అనారోగ్యంతో బాధపడుతుండటంతో, ఆమెను చూసేందుకు అత్యవసరంగా తాత్కాలిక బెయిలు మంజూరు చేయాలని దాఖలైన పిటిషన్‌పై జూలై 28న విచారణ జరిపేందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది.
మనీశ్ సిసోడియా ఫిబ్రవరి 26 నుంచి కస్టడీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తున్న కేసుల్లో తనకు బెయిలు మంజూరు చేయాలని సిసోడియా రెండు పిటిషన్లను సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. ఢిల్లీ హైకోర్టు తనకు బెయిలు నిరాకరించడాన్ని సవాలు చేస్తూ ఈ పిటిషన్లను దాఖలు చేశారు.
అవినీతి నిరోధక చట్టం ప్రకారం ఆయనపై సీబీఐ దర్యాప్తు చేస్తుండగా, మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. సిసోడియాపై వచ్చిన ఆరోపణలను ధ్రువీకరించేందుకు తగిన ఆధారాలేవీ లేవని ఆయన తరపు వాదనలు వినిపించిన సీనియర్ అడ్వకేట్ డాక్టర్ అభిషేక్ మను సింఘ్వి సుప్రీంకోర్టుకు చెప్పారు. అనారోగ్యంతో బాధపడుతున్న భార్యను చూసేందుకు సిసోడియాకు అవకాశం కల్పించాలని, తాత్కాలిక బెయిలు మంజూరు చేయాలని కోరారు. తాత్కాలిక బెయిలు కోసం చేసిన దరఖాస్తును ఆగస్టు 21న విచారిస్తామని సుప్రీంకోర్టు చెప్పింది. అయితే అంతకన్నా ముందే విచారణ జరపాలని సింఘ్వి కోరిన మీదట జూలై 28న విచారణ జరుపుతామని అత్యున్నత న్యాయస్థానం చెప్పింది.
ఢిల్లీలో మద్యం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని, మద్యం వ్యాపారంలో సంస్కరణలు తేవాలని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 2021లో ఓ విధానాన్ని రూపొందించింది. దీని రూపకల్పన, అమలులో అవకతవకలు, అవినీతి జరిగినట్లు ఆరోపణలు రావడంతో దీని అమలును రాష్ట్ర ప్రభుత్వం నిలిపేసింది. అయితే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించారు. ప్రభుత్వ ఖజానాకు గండికొడుతూ ప్రైవేటు వ్యక్తులకు లాభం కలిగేలా ఈ విధానం ఉందని వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయాలని కోరారు. సీబీఐ, ఈడీ దర్యాప్తులో మనీశ్ సిసోడియా సహా దాదాపు 15 మందిని నిందితులుగా గుర్తించింది. హోల్‌సేల్ మద్యం వ్యాపారులకు లబ్ధి చేకూరే విధంగా కుట్రపన్నారని, ఈ కుట్రను విజయ్ నాయర్ సమన్వయపరిచారని, ఆయన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియాల తరపున పని చేశారని ఈడీ ఆరోపించింది. మనీశ్ సిసోడియాను సీబీఐ ఫిబ్రవరి 26న, ఈడీ మార్చి 9న అరెస్టు చేశాయి.
ఇవి కూడా చదవండి :
Kosovo Parliament : కొసావో పార్లమెంటులో కొట్లాట.. పిడిగుద్దులతో తలపడిన ఆడ, మగ సభ్యులు..
Updated Date - 2023-07-14T13:12:37+05:30 IST