Supreme Court : హిండెన్‌బర్గ్ నివేదిక... మరో సంచలనం...
ABN, First Publish Date - 2023-02-09T12:13:15+05:30
అదానీ గ్రూప్ (Adani Group)పై షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ (Hindenburg Research) కుట్రకు పాల్పడిందని, దీనివల్ల భారత దేశ ప్రతిష్ఠ
న్యూఢిల్లీ : అదానీ గ్రూప్ (Adani Group)పై షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ (Hindenburg Research) కుట్రకు పాల్పడిందని, దీనివల్ల భారత దేశ ప్రతిష్ఠ దెబ్బతిందని, ఈ కుట్రపై న్యాయస్థానం పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలు (PILs)పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరపబోతోంది. న్యాయవాదులు ఎంఎల్ శర్మ, విశాల్ తివారీ ఈ పిల్స్‌ను దాఖలు చేశారు. అదానీ స్టాక్స్‌ను హిండెన్‌బర్గ్ షార్ట్ సెల్ చేసిందని, దీనివల్ల పెట్టుబడిదారులకు భారీ నష్టం వాటిల్లిందని వీరు ఆరోపించారు.
తివారీ పిటిషన్‌లో, అమెరికాలో ఉన్న హిండెన్‌బర్గ్ విడుదల చేసిన నివేదిక వల్ల దేశ ప్రతిష్ఠ దెబ్బతిందని ఆరోపించారు. దీనివల్ల ఆర్థిక వ్యవస్థ ప్రభావితమవుతోందన్నారు. శర్మ దాఖలు చేసిన పిటిషన్‌లో, ఈ నివేదికపై మీడియా చేసిన రాద్ధాంతం కారణంగా మార్కెట్లపై ప్రతికూల ప్రభావం పడిందన్నారు. హిండెన్‌బర్గ్ వ్యవస్థాపకుడు నాథన్ ఆండర్సన్ తన ఆరోపణలకు ఆధారాలను ఇండియన్ రెగ్యులేటర్స్ - సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI)కి చూపించలేకపోయారని తెలిపారు.
అదానీ గ్రూప్ కంపెనీలు తీవ్రమైన అకౌంటింగ్ మోసాలకు, స్టాక్ మేనిప్యులేషన్‌కు పాల్పడుతున్నాయని హిండెన్‌బర్గ్ నివేదిక ఆరోపించింది. దీంతో మన దేశంలో వివాదాలు తలెత్తాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi), గౌతమ్ అదానీ మధ్య సత్సంబంధాలు ఉన్నాయని కాంగ్రెస్, డీఎంకే, ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన వర్గం, సీపీఐ ఆరోపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై పార్లమెంటులో చర్చ జరగాలని, సంయుక్త పార్లమెంటరీ సంఘం చేత లేదా సుప్రీంకోర్టు పర్యవేక్షణలోని బృందం చేత దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తున్నాయి.
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మంగళవారం పార్లమెంటులో ఈ అంశంపై మాట్లాడిన సంగతి తెలిసిందే. ఈ ప్రసంగంలోని కొన్ని భాగాలను రికార్డుల నుంచి తొలగించారు.
Updated Date - 2023-02-09T12:24:11+05:30 IST