ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Afghanistan : మహిళల చేత మహిళలకే... తాలిబన్ల వినూత్న వ్యూహం...

ABN, First Publish Date - 2023-01-09T16:54:47+05:30

సమాజంలో మహిళలు, పురుషులు వేర్వేరుగా జీవించేలా చేయడానికి తాలిబన్లు ప్రయత్నిస్తున్నారు.

Afghanistan Taliban Govt
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాబూల్ : సమాజంలో మహిళలు, పురుషులు వేర్వేరుగా జీవించేలా చేయడానికి తాలిబన్లు ప్రయత్నిస్తున్నారు. షరియా చట్టానికి అనుగుణంగా దేశంలో పరిపాలన సాగాలని, సమాజం నిర్మాణమవాలని కోరుకుంటున్నారు. మహిళల బాగోగులను చూసేందుకు మహిళలనే నియమించాలని, స్త్రీ విద్య, ఉపాధి అవకాశాలను పెద్ద ఎత్తున పెంచాలని నిర్ణయించారు. ఈ లక్ష్యం సాకారమవడం కోసం మహిళా వైద్యులు, నర్సులకు ప్రభుత్వం శిక్షణ ఇవ్వబోతోంది.

ఆఫ్ఘనిస్థాన్ ప్రజారోగ్య శాఖ తాత్కాలిక ఉప మంత్రి మహమ్మద్ హసన్ ఘియాసీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, అత్యున్నత స్థాయి నుంచి తమ మంత్రిత్వ శాఖకు కొన్ని ఆదేశాలు వచ్చాయన్నారు. షరియా చట్టానికి అనుగుణంగా విధానాలను రూపొందించాలని ఆ ఆదేశాలు పేర్కొన్నట్లు తెలిపారు. మహిళలకు మహిళా వైద్యులు, నర్సులే చికిత్స చేయాలని, పురుష రోగులకు పురుష వైద్యులు, నర్సులే చికిత్స చేయాలని తాము ప్రతిపాదించామన్నారు. ఈ ప్రతిపాదనలను తాలిబన్ సుప్రీం లీడర్ హైబతుల్లా అఖుండ్‌జాదా (Taliban’s supreme leader Haibatullah Akhundzada)కు పంపించామని చెప్పారు. ఈ నిబంధనలు ఇప్పటికే కొన్ని ఆసుపత్రుల్లో అమలవుతున్నాయన్నారు. అయితే అర్హులైన మహిళా వైద్యులు అందుబాటులో లేనిపక్షంలో మహిళా రోగికి పురుష వైద్యుడు చికిత్స చేయవచ్చునని చెప్పారు.

ఇదిలావుండగా, ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్ ఆరోగ్య వ్యవస్థ ఒడుదొడుకుల్లో ఉంది. ఓవైపు ఆర్థిక సంక్షోభం, ఆకలి బాధ పెరిగాయి. మరోవైపు రోగులు పెరిగినప్పటికీ, అర్హులైన వైద్య నిపుణులు లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. స్త్రీ వైద్య నిపుణులు మాత్రమే కాకుండా పురుష వైద్య నిపుణుల కొరత కూడా ఉంది.

తాలిబన్ల తీరులో వైరుద్ధ్యాలు

తాలిబన్ ప్రభుత్వం బాలికలు, మహిళల విద్యపై కఠినమైన ఆంక్షలను అమలు చేస్తోంది. అదే సమయంలో పురుషాధిక్యతగల వైద్య విద్యా రంగంలోకి మహిళలను పెద్ద ఎత్తున తీసుకొస్తామంటోంది. ఇది పరస్పర విరుద్ధంగా కనిపిస్తోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి బాలికలను ప్రాథమికోన్నత పాఠశాలలకు దూరం చేసింది. అనేక వృత్తుల నుంచి మహిళలను తొలగించింది. విశ్వవిద్యాలయాల్లో ఇంజినీరింగ్, జర్నలిజం, ఆర్థిక శాస్త్రం వంటి సబ్జెక్టుల్లో చేరేందుకు మహిళలకు అవకాశం లేకుండా చేసింది. ఈ పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో వైద్య రంగంలో శిక్షణ పొందే మహిళల సంఖ్య చాలా తక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది. మహిళలు వైద్యులుగా అర్హత సాధించినప్పటికీ, ప్రయాణించేటపుడు పురుషుడు తోడుగా ఉండాలనే నిబంధన వీరు ప్రాక్టీస్ చేయడం కోసం వెళ్లేటపుడు వీరికి ఇబ్బందికరంగా మారవచ్చు.

ఈ సెమిస్టర్లో...

ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ కమిటీ వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రస్తుతం నర్సింగ్, రేడియాలజీ, ఇతర విభాగాల్లో ఈ సెమిస్టర్‌లో 46 శాతం మహిళలు ఉన్నారు. 2020నాటితో పోల్చితే ఈ సెమిస్టర్లో మహిళల సంఖ్య కాస్త పెరిగింది.

విదేశీ సహాయం...

ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రసూతి మరణాల రేటు ప్రపంచంలో అత్యధికంగా ఉంది. పోషకాహార లోపం వల్ల నెలలు నిండకుండానే ప్రసవం జరిగి, పిల్లలు పుడుతున్నారు. కొందరు గర్భిణులు గర్భధారణ సంబంధిత సమస్యలతో బాధపడటం కూడా దీనికి మరొక కారణం. దేశంలోని ఆరోగ్య వ్యవస్థ అత్యధికంగా విదేశీ సహాయంపైనే ఆధారపడుతోంది. తాలిబన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి బిలియన్ల డాలర్ల విదేశీ సహాయం అందడం లేదు, దీంతో ఈ రంగం కుప్పకూలిపోయే స్థితికి చేరుకుంటోంది. ఈ దశలో రెడ్ క్రాస్, ఐక్య రాజ్య సమితి ముందుకొచ్చి గత ఏడాది వేలాది మంది ఆరోగ్య కార్యకర్తలకు జీతాలు చెల్లించాయి. అయినప్పటికీ, కొన్ని ఆసుపత్రులు మూతపడ్డాయి. పెద్ద సంఖ్యలో డాక్టర్లు దేశం విడిచి వెళ్ళిపోయారు. యుద్ధం ముగిసిన తర్వాత రోగుల సంఖ్య పెరుగుతోంది.

సమీప భవిష్యత్తులో...

మహిళలకు, పురుషులకు వేర్వేరుగా సమాన స్థాయిలో ఆరోగ్య వ్యవస్థలను సృష్టించాలని తాలిబన్లు లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, సమీప భవిష్యత్తులో ఇది ఆచరణ సాధ్యం కాదని నిపుణులు చెప్తున్నారు.

ముందే చెప్పిన డబ్ల్యూహెచ్ఓ

చాలా దేశాల్లో మాదిరిగానే ఆఫ్ఘనిస్థాన్‌లో కూడా తల్లీబిడ్డలకు ఆరోగ్య, వైద్య సేవలను అందించేవారిలో మహిళలే ఎక్కువగా ఉన్నారు. ఇతర మెడికల్ స్పెషలిస్టుల్లో మహిళలు చాలా తక్కువగా ఉన్నారు. దీనివల్ల జరుగుతున్న నష్టాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరు సంవత్సరాల క్రితం వివరించింది.

ఆ విధానాలే ఆటంకాలు

మహిళలకు వైద్య విద్యావకాశాలను విస్తరిస్తామని తాలిబన్లు చెప్తున్నప్పటికీ, ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడానికి, వాటిని పొందడానికి ఇతర విధానాలు వారికి ఆటంకంగా నిలుస్తున్నాయి.

Updated Date - 2023-01-09T17:45:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising