Speaking For india: బీజేపీని గద్దె దింపడమే లక్ష్యం.. తమిళనాడు సీఎం వినూత్న వీడియో
ABN, First Publish Date - 2023-08-31T16:38:31+05:30
బీజేపీ సర్కారు మరోసారి అధికారంలోకి రాకుండా ఉండేందుకు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ముంబైలోని ఇండియా కూటమి సమావేశానికి వెళ్లే ముందు స్పీకింగ్ ఫర్ ఇండియా పాడ్‌కాస్ట్ వీడియోను తమిళనాడు సీఎం స్టాలిన్ విడుదల చేశారు.
దేశంలో మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ వేగంగా పావులు కదుపుతోంది. ఈ మేరకు ఓటర్లను ఆకట్టుకునేందుకు గ్యాస్ సిలిండర్ ధరను రూ.200 తగ్గిస్తున్నట్లు రెండురోజుల కిందట ప్రకటించింది. ఈ నేపథ్యంలో బీజేపీ సర్కారు మరోసారి అధికారంలోకి రాకుండా ఉండేందుకు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. స్పీకింగ్ ఫర్ ఇండియా పేరుతో పాడ్‌కాస్ట్ సిరీస్‌ను విడుదల చేయాలని నిర్ణయించారు. ఇండియా కూటమిలో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రధాన పాత్ర పోషించనుంది. ఈ నేపథ్యంలో బీజేపీని ఎదుర్కోవడంలో ప్రతిపక్ష కూటమి ఇండియాకు బలమైన మద్దతు ఇచ్చే లక్ష్యంతో స్టాలిన్ పాడ్‌కాస్ట్ సిరీస్‌ను అమలు చేయాలని భావించారు. స్పీకింగ్ ఫర్ ఇండియా ద్వారా జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తానని సీఎం స్టాలిన్ స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Donald Trump: వివేక్ రామస్వామి అందుకు తగిన వ్యక్తే.. ప్రశంసల వర్షం కురిపించిన డొనాల్డ్ ట్రంప్
ముంబైలోని ఇండియా కూటమి సమావేశానికి వెళ్లే ముందు స్పీకింగ్ ఫర్ ఇండియా పాడ్‌కాస్ట్ వీడియోను తమిళనాడు సీఎం స్టాలిన్ విడుదల చేశారు. ఈ వీడియోను ‘చెక్ 1..2..3’ అంటూ ఆయన మొదలుపెట్టారు. ఈ సిరీస్ 'ఉంగలిల్ ఒరువన్' తరహాలో ఉంటుందని తెలిపారు. ఒక నిమిషం 14 సెకన్‌ల పాటు వీడియోను విడుదల చేయగా.. అందులో దేశాన్ని బీజేపీ విధ్వంసం చేస్తుందని ఎంకే స్టాలిన్ విమర్శలు చేశారు. ప్రశ్న, దానికి సమాధానం తరహాలో ఈ వీడియో ఉంటుందని ప్రజలకు తెలియజేశారు. గత తొమ్మిదేళ్ల పాలనలో భారత్‌ను బీజేపీ తన విధానాలతో ఎలా విధ్వంసం చేసిందనే దానిపైనే తన ప్రసంగం ఉంటుందని స్టాలిన్ చెప్పారు. దేశ భవిష్యత్ బాగుండాలంటే ప్రజలు మరోసారి బీజేపీకి అవకాశం ఇవ్వరాదని సూచించారు. 2024 లోక్‌సభ ఎన్నికలు దేశంలో బీజేపీ పాలనకు ముగింపు పలుకుతాయన్నారు. ఇండియా కూటమి సమానత్వం, సౌభ్రాతృత్వం సూత్రాలను పాటిస్తుందని పేర్కొన్నారు. కాగా ఇండియా కూటమి ఆలోచనలను దేశంలోని సుదూర ప్రాంతాలకు తీసుకెళ్లడానికి స్టాలిన్ ప్రారంభించిన ఈ పాడ్‌కాస్ట్ సిరీస్ ఇంగ్లీష్‌తో ఇతర భాషలలో కూడా ఉంటుందని తెలుస్తోంది.
Updated Date - 2023-08-31T16:38:31+05:30 IST