ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Manipur Violence : మణిపూర్ హింసాకాండ వెనుక అసలు వాస్తవాలు

ABN, First Publish Date - 2023-05-05T12:28:58+05:30

మణిపూర్ గిరిజనులు ఉగ్ర రూపం దాల్చారు. శాంతియుత ప్రదర్శన తర్వాత భయానక విధ్వంసం జరిగింది. ఇంఫాల్ లోయ నుంచి దాదాపు 7,500

Manipur
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : మణిపూర్ గిరిజనులు ఉగ్ర రూపం దాల్చారు. శాంతియుత ప్రదర్శన తర్వాత భయానక విధ్వంసం జరిగింది. ఇంఫాల్ లోయ నుంచి దాదాపు 7,500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించవలసి వచ్చింది. భారత సైన్యం, అస్సాం రైఫిల్స్ సిబ్బంది హుటాహుటిన రంగంలోకి దిగవలసి వచ్చింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్‌తో మాట్లాడారు. అకస్మాత్తుగా ఇటువంటి పరిస్థితులు ఏర్పడటం వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటి?

మణిపూర్ రాష్ట్ర జనాభాలో 53 శాతం మంది ఉన్న మెయిటీలు తమకు షెడ్యూల్డు తెగల హోదాను కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిని గిరిజనులు వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు ఎస్టీ హోదా కోసం మెయిటీలు చేస్తున్న డిమాండ్‌పై నాలుగు వారాల్లోగా కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయాలని మణిపూర్ హైకోర్టు గత నెలలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ఆల్ ట్రైబల్ స్టూడెంట్ యూనియన్ మణిపూర్ (ATSUM) పిలుపు మేరకు బుధవారం గిరిజన సంఘీభావ కవాతును నిర్వహించారు. ఈ కవాతు చురాచాంద్‌పూర్ జిల్లాలోని టోర్బుంగ్ ఏరియాలో జరిగింది. ఈ కార్యక్రమంలో నాగాలు, జోమీలు, కుకీలు పాల్గొన్నారు. రాష్ట్ర జనాభాలో ఈ తెగలకు చెందినవారు దాదాపు 40 శాతం మంది ఉంటారు.

స్థానికుల కథనం ప్రకారం, చురాచాంద్‌పూర్ జిల్లాలో బుధవారం జరిగిన గిరిజన కవాతులో సాయుధులు రెచ్చిపోయారు. మెయిటీ తెగవారిపై దాడులు చేశారు. దీంతో ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. అనంతరం లోయలోని జిల్లాలన్నిటికీ హింసాకాండ విస్తరించింది. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా హింస జరిగింది. టోర్బుంగ్‌లో మూడు గంటలకు పైగా విధ్వంసకాండ జరిగింది. అనేక ఇళ్లు, దుకాణాలను ధ్వంసం చేశారు. ఫారెస్ట్ బీట్ కార్యాలయాలను కూడా తగులబెట్టారు. కొందరు తీవ్రంగా గాయపడ్డారు. కంగ్వాయ్ టోర్బుంగ్ ఏరియాలో రాళ్ల దాడులు జరిగాయి. అదేవిధంగా ఆంగ్లో-కుకీ యుద్ధ స్మారకం వద్ద కూడా విధ్వంసం జరిగింది. ఇంఫాల్ లోయలో కొన్ని ప్రార్థనా స్థలాలను కూడా ధ్వంసం చేశారు.

ఈ నేపథ్యంలో ఇంఫాల్ వెస్ట్, కక్చింగ్, తౌబల్, జిరిబమ్, బిష్ణుపూర్, చురాచాంద్‌పూర్, కాంగ్‌పోక్పి, తెంగ్నోపల్ ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. ఇంఫాల్ లోయలో కుకీ గిరిజనుల ఇళ్లలో దోపిడీలు జరిగాయి. దీంతో వారు ఇళ్లు వదిలిపెట్టి పారిపోయారు.

అధిక జనాభాకు తక్కువ భూమి

రాష్ట్ర జనాభాలో 53 శాతం ఉన్న మెయిటీలు రాష్ట్రంలో కేవలం 10 శాతం భూమిలో మాత్రమే ఉన్నారు. అయితే రాష్ట్ర శాసన సభలో వీరు మూడింట రెండొంతుల మంది ఉన్నారు. రాష్ట్ర జనాభాలో 40 శాతం మంది ఉన్న గిరిజనులు రాష్ట్రంలోని 90 శాతం భూమిలో ఉన్నారు. ఇదిలావుండగా, మయన్మార్, బంగ్లాదేశ్‌ల నుంచి పెద్ద ఎత్తున చట్టవిరుద్ధంగా ఇక్కడికి వస్తున్నారని, వారు ఎస్టీ హోదాను కోరుతున్నారని మెయిటీలు ఆరోపిస్తున్నారు.

గిరిజనుల భయం

కుకీ ఇన్పి మణిపూర్ నేత జంఘావోలున్ హవోకిప్ మీడియాతో మాట్లాడుతూ, మెయిటీలు బాగా అభివృద్ధి చెందారని, వారిని ఎస్టీ జాబితాలో కలిపితే, భారత రాజ్యాంగం తమకు కల్పించిన హక్కులను, ఉద్యోగావకాశాలను కోల్పోతామని ఎస్టీలు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. అందుకే మెయిటీలను ఎస్టీ జాబితాలో కలపాలనే డిమాండ్‌ను గిరిజనులు వ్యతిరేకిస్తున్నారని చెప్పారు.

మణిపురి భాషను రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూలులో చేర్చిన విషయాన్ని మెయిటీల వ్యతిరేకులు గుర్తు చేస్తున్నారు. మెయిటీలలో కొన్ని వర్గాలకు ఇప్పటికే ఎస్సీ, ఓబీసీ హోదా ఉందని చెప్తున్నారు. లోయలోని ప్రజాప్రతినిధులు గతంలో బహిరంగంగానే మెయిటీల డిమాండ్‌కు మద్దతు పలికారు. రాష్ట్రంలోని భూమిలో అత్యధిక భాగం కొండ ప్రాంత జిల్లాల్లోనే ఉంది. ఇక్కడ గిరిజనులు ఉంటున్నారు. వీరిలో నాగాలు, కుకీలు ఉన్నారు. వీరు ప్రధానంగా క్రైస్తవ మతంలో ఉన్నారు. వివిధ చట్టాలు ఇక్కడి భూమిని ఇతరులు ఆక్రమించుకోకుండా రక్షణ కల్పిస్తున్నాయి. రాష్ట్రంలో చట్టబద్ధంగా నివసిస్తున్నవారిని ప్రభుత్వం ఖాళీ చేయిస్తోందని కుకీ నేతలు ఆరోపిస్తున్నారు. అధికరణ 371సీని రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తున్నారు. ఈ అధికరణ ప్రకారం కొండ ప్రాంతాలకు పరిపాలనాపరమైన స్వయంప్రతిపత్తి ఉందని చెప్తున్నారు. మణిపూర్ ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ మాట్లాడుతూ, రిజర్వు ఫారెస్టును ఆక్రమించుకున్నవారిని మాత్రమే ఖాళీ చేయిస్తున్నామని చెప్పారు. అభయారణ్యాలు, వన్యప్రాణుల అభయారణ్యాలను గంజాయి తోటల పెంపకం, మాదక ద్రవ్యాల వ్యాపారాలకు వాడుకుంటున్నారని, అటువంటివారిని మాత్రమే ఖాళీ చేయిస్తున్నామని చెప్పారు.

ముఖ్యమంత్రి పిలుపు

మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్ మాట్లాడుతూ, ప్రజలు ప్రశాంతంగా ఉండాలని పిలుపునిచ్చారు. చాలా విలువైన ప్రాణాలను కోల్పోయామని, ఆస్తి నష్టం కూడా జరిగిందని చెప్పారు. ఈ పరిస్థితులు రావడం దురదృష్టకరమని చెప్పారు. ఈ హింసాకాండకు కారణం సమాజంలో ఏర్పడిన అపార్థాలేనని వ్యాఖ్యానించారు. శాంతిభద్రతలను కాపాడటానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తోందన్నారు.

విద్వేష రాజకీయాలు : కాంగ్రెస్

బీజేపీ విద్వేష రాజకీయాలకు పాల్పడుతోందని కాంగ్రెస్ మండిపడింది. వివిధ జాతుల మధ్య జగడాలను సృష్టించినందువల్ల మణిపూర్ మండిపోతోందని ఆవేదన వ్యక్తం చేసింది. రాష్ట్రంలో శాంతిని పునరుద్ధరించేందుకు తక్షణం చర్యలు తీసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కోరారు.

తాజా పరిస్థితి

గిరిజనులు, మెయిటీల మధ్య ఘర్షణల నేపథ్యంలో మణిపూర్ వెళ్లే అన్ని రైళ్లను నార్త్ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే నిలిపేసింది. రాష్ట్ర ప్రభుత్వ సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. సాధారణ పరిస్థితులు ఏర్పడే వరకు రైళ్లు నడిచే అవకాశం లేదని తెలిపింది. మణిపూర్‌లో చిక్కుకున్న తమ ప్రజలను సురక్షితంగా వెనుకకు రప్పించేందుకు మేఘాలయ, నాగాలాండ్ ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. భారత సైన్యం అధికారులు మాట్లాడుతూ, మోరేహ్, కాంగ్‌పోక్పి ప్రాంతాల్లో పరిస్థితి అదుపులోకి వచ్చిందని చెప్పారు. ఇంఫాల్, చురాచాంద్‌పూర్ ప్రాంతాల్లో సాధారణ పరిస్థితుల పునరుద్ధరణ కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ‘కనిపిస్తే కాల్చివేత’కు మణిపూర్ గవర్నర్ గురువారం ఆమోదం తెలిపారు. పుకార్లు, అసత్య వార్తల ప్రచారాన్ని నిరోధించేందుకు కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఇవి కూడా చదవండి :

Tipu Sultan : కేరళలో రాడికల్ జీహాదిజమ్‌ విత్తనాలు నాటినవాడు టిప్పు సుల్తాన్

Amit Shah: అమిత్‌షా సంచలన కామెంట్స్.. ఆయన్ను చేర్చుకోవాలని ఒత్తిడి చేయం..

Updated Date - 2023-05-05T12:48:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising