Kerala : మోదీపై ఆత్మాహుతి దాడి చేస్తాం.. కేరళ బీజేపీ కార్యాలయానికి బెదిరింపు లేఖ..
ABN, First Publish Date - 2023-04-22T16:03:47+05:30
పై ఆత్మాహుతి దాడికి పాల్పడతామంటూ ఓ బెదిరింపు లేఖ రావడంతో
తిరువనంతపురం : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)పై ఆత్మాహుతి దాడికి పాల్పడతామంటూ ఓ బెదిరింపు లేఖ రావడంతో కేరళ పోలీసులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. ఆయన ఈ నెల 24, 25 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించబోతున్నారు. 24న కొచ్చిలోనూ, 25న తిరువనంతపురంలోనూ పర్యటించబోతున్న తరుణంలో ఈ బెదిరింపు లేఖ వచ్చింది.
బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన ఈ బెదిరింపు లేఖలో దానిని పంపినవారి పేరు, ఇతర వివరాలు కూడా ఉన్నాయి. ఈ నెల 24న ప్రధాని మోదీ కొచ్చి పర్యటన సమయంలో ఆయనపై ఆత్మాహుతి దాడి చేస్తామని ఈ లేఖలో ఉంది. ఈ లేఖను రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు కే సురేంద్రన్ గత వారం పోలీసులకు అప్పగించారు. ఈ సమాచారం శనివారం బయటకు పొక్కింది. నిఘా విభాగం ఏడీజీపీ నివేదిక మీడియాలో రావడంతో ఈ లేఖ గురించి బయటపడింది.
మరోవైపు ఈ లేఖను రాసిన వ్యక్తిగా ఆ లేఖలో పేర్కొన్న పేరు గల వ్యక్తిని పోలీసులు గుర్తించారు. అయితే ఆయన వద్దకు పోలీసులు వెళ్లి ప్రశ్నించినపుడు, తనకేమీ తెలియదని, తన శత్రువులెవరో తన పేరును ఉపయోగించుకుని ఈ లేఖ రాసి ఉంటారని చెప్పారు. తనను తప్పుడు పద్ధతుల్లో ఇరికించడం కోసమే ఈ బెదిరింపు లేఖను రాసి ఉంటారని చెప్పారు.
అయినప్పటికీ భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా ఈ విషయంపై ఆరా తీస్తున్నాయి. అదనపు పోలీసు డైరెక్టర్ జనరల్ కార్యాలయం నుంచి సెక్యూరిటీ ప్రోటోకాల్స్‌కు సంబంధించిన సమాచారం మీడియాకు లీక్ అయింది. బయటకు పొక్కిన ఈ పత్రంలో చాలా తీవ్రమైన భద్రతాపరమైన ముప్పుల గురించి పేర్కొన్నారు. నిషిద్ధ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) నుంచి కూడా ముప్పు ఉన్నట్లు దీనిలో తెలిపారు.
విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ఎం మురళీధరన్ శనివారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, ఈ లేఖకు సంబంధించిన సమాచారం బయటకు పొక్కడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రతా ఉల్లంఘన ఆందోళనకరమన్నారు. కేరళ పోలీసుల వైఫల్యానికి ఇది నిదర్శనమని చెప్పారు. మోదీ పర్యటన కేరళ అభివృద్ధికి మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుందని మురళీధరన్ చెప్పారు. మోదీ పర్యటన నుంచి రాష్ట్ర ప్రజలు ఎంతో ఆశిస్తున్నారని చెప్పారు. మోదీ రోడ్‌షో నిర్వహిస్తారని, ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి, ఆయనకు స్వాగతం పలుకుతారని చెప్పారు. ‘యువం’ సమావేశం కేరళలో రాజకీయ మార్పులకు నాంది అవుతుందని తెలిపారు. పార్టీలకు అతీతంగా రాష్ట్రం అభివృద్ధి చెందాలనుకునే యువత ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు.
మోదీ ఈ నెల 24న కొచ్చిలో పర్యటిస్తారు. ఆ మర్నాడు తిరువనంతపురంలో పర్యటిస్తారు. కేరళలో మొదటి వందే భారత్ (Vande Bharat Express) రైలును ప్రారంభిస్తారు.
ఇవి కూడా చదవండి :
Mamata Banerjee : ప్రాణ త్యాగానికైనా సిద్ధం.. ఈద్ సందర్భంగా మమత బెనర్జీ..
Eid prayers : ముస్లిం సోదరులకు మోదీ ఈద్ శుభాకాంక్షలు
Updated Date - 2023-04-22T16:13:39+05:30 IST