Tripura: సీపీఎం-కాంగ్రెస్ కూటమితో పొత్తుపై తేల్చిచెప్పిన టీఎంసీ
ABN, First Publish Date - 2023-01-22T16:41:02+05:30
త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం-కాంగ్రెస్ కూటమితో పొత్తు పెట్టుకునే అవకాశాలపై మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ స్పష్టత...
అగర్తలా: త్రిపుర (Tripura) అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం-కాంగ్రెస్ కూటమితో పొత్తు పెట్టుకునే అవకాశాలపై మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ (TMC) స్పష్టత ఇచ్చింది. సీపీఎం-కాంగ్రెస్ కూటమితో ఎలాంటి ఎన్నికల అవగాహన కుదుర్చుకునేది లేదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీయూష్ కాంటి బిశ్వాస్ తెలిపారు. కమ్యూనిస్టుల హయాంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, వారు కూడా సొంత పార్టీకి (కాంగ్రెస్) ఓటు వేయరని చెప్పారు. సీపీఎం-కాంగ్రెస్ కూటమిగా ఏర్పడినా 2021లో పశ్చిమబెంగాల్‌లో ఆ కూటమికి ఎలాంటి ఫలితాలు వచ్చాయో అలాంటి ఫలితమే త్రిపురలోనూ వస్తుందన్నారు. ఆ కారణంగానే తాము కూటమిలో చేరేదిలేదని చెప్పారు.
త్రిపురలో గెలిచే అవకాశాలున్న సీట్లలో టీఎంసీ పోటీ చేస్తుందని, పొత్తుకోసం వేరే పార్టీలు ముందుకు వస్తే టీఎంసీ స్వాగతిస్తుందని బిశ్వాస్ తెలిపారు. రెండ్రోజుల ప్రచారంలో భాగంగా మమతా బెనర్జీ ఫిబ్రవరి 6న త్రిపుర వస్తారని, రోడ్‌షోలో పాల్గొంటారని చెప్పారు. పార్టీ అఖిల భారత కార్యదర్శి అభిషేక్ బెనర్జీ సైతం ఫిబ్రవరి 2న ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని తెలిపారు. నార్త్ త్రిపురలోని ధర్మనగర్, సెపహిజాలా జిల్లా బాక్సానగర్‌లో జరిగే ఎన్నికల ర్యాలీలకు హాజరవుతారని అన్నారు. కాగా, 60 మంది సభ్యుల త్రిపుర అసెంబ్లీకి ఫిబ్రవరి 16న ఎన్నికలు జరగనున్నాయి.
Updated Date - 2023-01-22T16:41:04+05:30 IST