Tamil Nadu : రంగంలోకి అమిత్ షా.. తమిళనాడు గవర్నర్ మరో సంచలన నిర్ణయం
ABN, First Publish Date - 2023-06-30T11:18:53+05:30
తమిళనాడు ప్రభుత్వంతో వివాదం ముదురుతున్న సమయంలో ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి (Governor RN Ravi) మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. నేరారోపణలు ఎదుర్కొంటున్న మంత్రి సెంథిల్ బాలాజీని పదవి నుంచి తొలగిస్తూ తాను జారీ చేసిన ఆదేశాలను తాత్కాలికంగా నిలిపేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా జోక్యంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
చెన్నై : తమిళనాడు ప్రభుత్వంతో వివాదం ముదురుతున్న సమయంలో ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి (Governor RN Ravi) మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. నేరారోపణలు ఎదుర్కొంటున్న మంత్రి సెంథిల్ బాలాజీని పదవి నుంచి తొలగిస్తూ తాను జారీ చేసిన ఆదేశాలను తాత్కాలికంగా నిలిపేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా జోక్యంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఉద్యోగాలు ఇప్పంచేందుకు డబ్బు వసూలు చేసిన కుంభకోణానికి సంబంధించిన కేసు దర్యాప్తులో భాగంగా సెంథిల్ బాలాజీ అరెస్టయిన సంగతి తెలిసిందే. ఆయన నిర్వహిస్తున్న మంత్రిత్వ శాఖలను ఇతరులకు బదిలీ చేయాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చేసిన సిఫారసును గవర్నర్ రవి ఆమోదించారు. సెంథిల్ బాలాజీని శాఖలు లేని మంత్రిగా కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఆయనను మంత్రి పదవి నుంచి తొలగిస్తున్నట్లు గురువారం రాత్రి గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. గవర్నర్ ఈ విషయాన్ని ముఖ్యమంత్రికి రాసిన లేఖలో తెలిపారు.
స్టాలిన్ ఆగ్రహం
సెంథిల్‌బాలాజీని మంత్రి వర్గం నుంచి డిస్మిస్ చేస్తూ గవర్నర్ జారీ చేసిన ఉత్తర్వుపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (Chief Minister MK Stalin) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రుల నియామకాలు, తొలగింపులు ముఖ్యమంత్రి సిఫారసుల మేరకే జరగాలని రాజ్యాంగ దర్మాసనం స్పష్టం చేసిందని, గవర్నర్ దురుద్దేశపూరితంగా వ్యవహరించారని, దీనిని చట్ట ప్రకారం ఎదుర్కొంటామని తెలిపారు. సెంథిల్ బాలాజీని మంత్రివర్గం నుంచి గవర్నర్ తొలగించడం చట్ట వ్యతిరేకమంటూ డీఎంకే మిత్ర పక్షాల నాయకులు మండిపడ్డారు. అయితే అన్నాడీఎంకే సీనియర్ నాయకుడు డి.జయకుమార్ గవర్నర్ చర్యను సమర్థించారు.
సెంథిల్ బాలాజీని డిస్మిస్ చేయడానికి కారణం
సెంథిల్ బాలాజీని మంత్రివర్గం నుంచి డిస్మిస్ చేయడానికి గల కారణాలను గవర్నర్ రవి తన ఉత్తర్వులో తెలిపారు. మంత్రి సెంథిల్ బాలాజీ ఉద్యోగాల పేరిట మోసాలకు పాల్పడ్డారని, పలు అవినీతి కేసుల్లో చిక్కుకున్నారని, మంత్రి పదవిని దుర్వినియోగం చేసి తనపై జరుగుతున్న విచారణను పక్కదోవ పట్టించేందుకు అవకాశాలున్నాయని తెలిపారు. ఆయన ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీ విచారణను ఎదుర్కొంటున్నారని, అంతేకాకుండా రాష్ట్ర పోలీసులు కూడా ఆయనపై కొన్ని కేసులను నమోదు చేశారని, ఆయన మంత్రి పదవిలో కొనసాగితే ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా పక్కదోవపట్టిస్తారని, ఈ అంశాలను పరిగణనలోకి తీసుకునే మంత్రివర్గం నుంచి డిస్మిస్ చేస్తూ ఉత్తర్వు జారీ చేసినట్లు తెలిపారు.
అమిత్ షా జోక్యంతో..
సెంథిల్ బాలాజీని మంత్రి పదవి నుంచి డిస్మిస్ చేస్తూ తాను ఇచ్చిన ఆదేశాలను గవర్నర్ రవి దాదాపు 5 గంటల్లోనే నిలిపేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) జోక్యంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి స్టాలిన్‌కు గవర్నర్ రాసిన రెండో లేఖలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఈ వివాదాస్పద నిర్ణయంపై న్యాయ సలహా కోరడం శ్రేయస్కరమని అమిత్ షా చెప్పినట్లు తెలిపారు. అటార్నీ జనరల్‌ను సలహా కోరడం మంచిదని చెప్పినట్లు వివరించారు. ఈ నేపథ్యంలో తాను అటార్నీ జనరల్‌ను సంప్రదిస్తానని, తాను తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు సెంథిల్ బాలాజీని డిస్మిస్ చేస్తూ అంతకుముందు ఇచ్చిన ఆదేశాలను నిలిపివేస్తున్నట్లు తెలిపారు.
క్యాష్ ఫర్ జాబ్స్ స్కామ్
సెంథిల్ బాలాజీ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఉద్యోగార్థుల నుంచి డబ్బు వసూలు చేసినట్లు ఆరోపిస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఆయనను అరెస్ట్ చేసింది. చెన్నై కోర్టు ఆయన జ్యుడిషియల్ కస్టడీని జూలై 12 వరకు పొడిగించింది. కస్టడీలో ఉండగానే ఆయనకు బైపాస్ సర్జరీ జరిగింది. సెంథిల్ ఏఐఏడీఎంకే ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన కాలంలో ఈ కుంభకోణం జరిగినట్లు కేసు నమోదైంది.
ఇవి కూడా చదవండి :
Make in India : మోదీపై పుతిన్ ప్రశంసల జల్లు
Updated Date - 2023-06-30T11:18:53+05:30 IST