Election Commission: ఒక్క ఓటుకు రూ.5వేలు వెల కడుతున్న ఈరోజుల్లో ఈ పెద్దాయన ఎందుకు గుర్తొస్తున్నారంటే..
ABN, First Publish Date - 2023-03-03T11:46:04+05:30
ఆయన ఎన్నికల ప్రక్రియలో అనేక సంస్కరణలు అమలు చేశారు. అప్పటి వరకు ఉన్న వ్యవస్థలనే వాడుకుంటూ, అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించారు. ఆయన చేసిన ప్రక్షాళనను తట్టుకోలేని రాజకీయ నేతలు ఆయనను తీవ్రంగా వ్యతిరేకించి,...
న్యూఢిల్లీ : ప్రతిపక్షంలో ఉన్నపుడు అన్ని వ్యవస్థలు రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యముతంగా పని చేయాలని కోరుకునే నేతలు అందలం ఎక్కిన తర్వాత ఆ వ్యవస్థలన్నిటినీ చిందరవందర చేసి, కర్ర ఉన్నవాడిదే పెత్తనం అని నిరూపిస్తారు. కానీ, అధికారంలో ఉన్నప్పుడు మాత్రం నియమ నిబంధనలని ధిక్కరించి మంత్రులు సైతం ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తూ, సామ, దాన, భేద, దండోపాయాలతో అధికారాన్ని కైవసం చేసుకుంటున్నపుడు ‘స్వాతంత్ర్యం నా జన్మ హక్కు’ అని పోరాడినది దీనికోసమేనా? అని నివ్వెరపోయే పరిస్థితి నెలకొంది.
ఇలాంటి పరిస్థితుల్లో కొందరు తమ వేదనను అత్యున్నత న్యాయస్థానం (Supreme Court) ముందు ఉంచగా... ‘‘అధికారం ఉన్నవారి ఎదుట ధైర్యంగా నిలబడలేని బలహీనులను ఎన్నికల కమిషనర్లు (Election Commissioners)గా నియమించకూడదని సర్వోన్నత న్యాయస్థానం కూడా దీటుగా స్పందించింది. తమను నియమించిన వారికి రుణపడి ఉండాలని భావించే వ్యక్తులకు ఎన్నికల ప్రక్రియలో చోటివ్వకూడదని, విపత్కర సమయాల్లో సైతం.. అధికారంలో ఉన్నవారికి దాస్యం చేయకుండా, బలహీనులను కాపాడటానికి ముందుకు వచ్చేలా ఎన్నికల కమిషనర్లు ఉండాలి’’ అని స్పష్టం చేసింది. ప్రధాని, లోక్‌సభలో విపక్ష నేత, సీజేఐతో కూడిన త్రిసభ్య కమిటీ సిఫారసు మేరకే కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈసీ), ఎన్నికల కమిషనర్లను రాష్ట్రపతి (President of India) నియమించాలని తీర్పు చెప్పింది.
ప్రజాస్వామ్యానికి ఊపిరి వంటి ఎన్నికల ప్రక్రియ సజావుగా జరగాలంటే ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. అలా చేసి చూపిన ఘనుడు టీఎన్ శేషన్ (TN Seshan). ఆయన ఎన్నికల ప్రక్రియలో అనేక సంస్కరణలు అమలు చేశారు. అప్పటి వరకు ఉన్న వ్యవస్థలనే వాడుకుంటూ, అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించారు. ఆయన చేసిన ప్రక్షాళనను తట్టుకోలేని రాజకీయ నేతలు ఆయనను తీవ్రంగా వ్యతిరేకించి, తమ అధికార బలాన్ని ఉపయోగించి ఎన్నికల కమిషన్ రూపు రేఖలనే మార్చేశారు.
తిరునెల్లాయ్ నారాయణ అయ్యర్ శేషన్ (Tinnellai Narayana Iyer Seshan) భారత దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC)గా 1990 డిసెంబరు 12 నుంచి 1996 డిసెంబరు 11 వరకు సేవలందించారు. ఈ కాలంలో ఆయన ఎన్నికల విధానాన్ని సమూలంగా ప్రక్షాళన చేశారు. దొంగ ఓట్లను నిరోధించడం కోసం ఓటర్లకు గుర్తింపు కార్డులు జారీ చేశారు. ఈ పదవిని ఆయన చేపట్టేనాటికి ఎన్నికల ప్రవర్తన నియమావళిని రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఆయన వచ్చిన తర్వాత దీనిని సక్రమంగా అమలు చేసేలా చర్యలు తీసుకున్నారు. దీంతో రాజకీయ పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. ఎవరు ఏం చేసినా తన పదవి అంత తేలికైనది కాదని, తనను ఎవరూ ప్రభావితం చేయలేరని ఆయన బలంగా చాటి చెప్పారు. అప్పట్లో ప్రజాస్వామ్యానికి మేలు జరిగినందువల్లే ఆయనను ఇప్పటికీ సర్వోన్నత న్యాయస్థానం సైతం గుర్తు చేసుకుంటోంది.
ఎన్నికలపై నమ్మకం పునరుద్ధరణ
బ్యాలట్ పేపర్ల (Ballot Papers)ను ఉపయోగించిన రోజుల్లో రాజకీయ పార్టీలు బూత్ రిగ్గింగ్‌కు పాల్పడుతూ ఉండేవి. ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తూ ఉండేవి. అటువంటి సమయంలో టీఎన్ శేషన్ తన చర్యల ద్వారా సామాన్యుల్లో భారతీయ ఎన్నికల వ్యవస్థపై నమ్మకాన్ని పునరుద్ధరించారు. ఎన్నికల సమయంలో ఓటర్లను ఏ విధంగానూ ప్రలోభపెట్టకూడదని, బెదిరించకూడదని, వారికి మద్యం ఇవ్వకూడదని, ఎన్నికల ప్రచారానికి అధికార యంత్రాంగాన్ని వాడుకోకూడదని నిబంధనలు ఉన్నాయి. ఓటర్ల కుల, మతపరమైన మనోభావాల ఆధారంగా ఓట్లు అడగకూడదని, మతపరమైన దేవాలయాలు, ప్రార్థనా స్థలాల్లో ఎన్నికల ప్రచారం చేయకూడదని, లిఖితపూర్వకంగా ముందుగా అనుమతి తీసుకోకుండా లౌడ్‌స్పీకర్లను వాడకూడదని నిబంధనలు చెప్తున్నాయి. కానీ వాటిని ఆచరణలో పెట్టే సాహసం అంతకుముందు ఎవరూ చేయలేకపోయారు. శేషన్ సీఈసీగా పదవిని చేపట్టిన తర్వాత వీటిని అమలు చేయగలిగారు. ప్రస్తుతం ఓటుకు రూ.5,000 ఇచ్చే పార్టీ ఒకటి, రూ.6,000 ఇచ్చే పార్టీ మరొకటి మన కళ్ళ ఎదురుగా కనిపించినపుడు, గద్దెనెక్కిన తర్వాత వారు చేసే విన్యాసాలను చూస్తున్నపుడు సీఈసీ ఏం చేస్తోందనే ప్రశ్న కచ్చితంగా వస్తోంది. ఆ వెంటనే టీఎన్ శేషన్ రోజులు గుర్తుకొస్తున్నాయి.
నిబంధనలను బేఖాతరు చేస్తే...
ఎన్నికల ప్రవర్తన నియమావళిని శేషన్ కఠినంగా అమలు చేశారు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఎన్నికల కోసం చేసే ఖర్చులను పర్యవేక్షించారు. ఏ గోడ కనిపిస్తే ఆ గోడ మీద ఎన్నికల ప్రచారానికి సంబంధించిన రాతలు రాయడాన్ని కట్టడి చేశారు. నిబంధనలను ఉల్లంఘించిన రాజకీయ నేతలపై కొరడా ఝళిపించారు. దీంతో ఆయనంటే ప్రజలకు ప్రత్యేక గౌరవం ఏర్పడింది. నిబంధనలను శేషన్ ఎంత కఠినంగా అమలు చేశారో చెప్పడానికి ఉదాహరణ ఏమిటంటే, 1994లో జరిగిన ఎన్నికల్లో అప్పటి సంక్షేమ శాఖ మంత్రి సీతారాం కేసరి, ఆహార శాఖ మంత్రి కల్పనాథ్ రాయ్ ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారు. దీనిని శేషన్ తీవ్రంగా ఖండించారు. వీరిని మంత్రి పదవుల నుంచి తొలగించాలని అప్పటి ప్రధాన మంత్రి పీవీ నరసింహారావును కోరారు. ఇది రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది. ఆయన తన అధికారాన్ని మించి వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి.
రాజకీయ పార్టీల వ్యతిరేకత
1991లో లోక్‌సభ ఎన్నికల సమయంలో శేషన్‌కు రాజకీయ పార్టీల్లో మిత్రుల కన్నా శత్రువులే ఎక్కువయ్యారు. రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) మరణానంతరం చివరి దశ ఎన్నికల పోలింగ్‌ను వాయిదా వేయడాన్ని కాంగ్రెస్ తప్పుబట్టింది. పంజాబ్ శాసన సభ ఎన్నికల (Punjab Assembly Elections)ను వాయిదా వేయడాన్ని బీజేపీ (BJP) జీర్ణించుకోలేకపోయింది. త్రిపురలో ఎన్నికల నిర్వహణకు అనుమతించడంపై సీపీఎం (CPM) ఆందోళన వ్యక్తం చేసింది. బిహార్‌లో కొన్ని నియోజకవర్గాల్లో ఎన్నికలను వాయిదా వేయడాన్ని జనతా దళ్ విమర్శించింది. కొన్ని రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరగడానికి ముందు నేషనల్ ఫ్రంట్-వామపక్షాల కూటమి శేషన్‌పై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించింది. అయితే తగిన సంఖ్యాబలం లేకపోవడంతో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టలేకపోయింది. ఈ ఉప ఎన్నికలకు తమకు నిష్పాక్షికమైన సీఈసీ కావాలని జనతా దళ్ ఎంపీ రామ్ విలాస్ పాశ్వాన్ పట్టుబట్టారు.
అప్పుడు అలా... ఇప్పుడు ఇలా...
శేషన్ దూకుడును తట్టుకోలేని అప్పటి కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌కు అదనంగా ఇద్దరు కమిషనర్లను నియమించింది. కనీసం ఇద్దరు కమిషనర్లను నియమించాలని సంయుక్త పార్లమెంటరీ సంఘం సిఫారసు చేసింది. ఇది ప్రతిపక్షాల ఏకగ్రీవ డిమాండ్ కావడం విశేషం. ముగ్గురు కమిషనర్ల విధానాన్ని అమలు చేయడాన్ని టీఎన్ శేషన్ సుప్రీంకోర్టులో సవాలు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. విధానపరమైన నిబంధనలపై ముగ్గురు కమిషనర్లు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపితేనే ఎన్నికల కమిషన్ సమావేశమయ్యేందుకు అవకాశం ఉండేలా చట్టాన్ని చేయడంతో శేషన్ ముందరి కాళ్ళకు బంధం పడింది. ఇప్పుడు అదే సుప్రీంకోర్టు అలాంటి సీఈసీ మళ్లీ రావాలంటోంది.
ఇవి కూడా చదవండి :
Supreme Court: బలహీనులు ఎన్నికల కమిషనర్లు కాకూడదు
ప్రధాని పర్యటనకు ముందే... బీజేపీకి షాక్
Updated Date - 2023-03-03T16:13:17+05:30 IST