Sena Symbol Row: ఈసీ నిర్ణయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఉద్ధవ్ థాకరే
ABN, First Publish Date - 2023-02-20T13:58:19+05:30
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గాన్ని నిజమైన శివసేనగా గుర్తించడం, 'విల్లు-బాణం' గుర్తును ఆ వర్గానికి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ తీసుకున్న చారిత్రక నిర్ణయం..
న్యూఢిల్లీ: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గాన్ని నిజమైన శివసేనగా గుర్తించడం, 'విల్లు-బాణం' గుర్తును ఆ వర్గానికి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ తీసుకున్న చారిత్రక నిర్ణయం ఆ రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray) వర్గం సుప్రీంకోర్టును (Supreme court) సోమవారంనాడు ఆశ్రయంచింది. ఈ కేసును షెడ్యూల్ లేకుండా అత్యవసర విచారణ చేపట్టాలని థాకరే వర్గం తరఫు న్యాయవాది కోరారు. అయితే ఇందుదు సీజేఐ డీవై చంద్రచూడ్ నిరాకరించారు. సరైన పేపర్ వర్క్‌తో మంగళవారంనాడు అత్యవసర జాబితాలో ప్రవేశపెట్టాలని సూచించారు.
గత ఏడాది జూన్‌లో ఏక్‌నాథ్ షిండే వర్గం అప్పటి మహా వికాశ్ అఘాడి ప్రభుత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసింది. శివసేనలోని 55 మంది ఎమ్మెల్యేలలో 40 మందిని, 18 మంది ఎంపీల్లో 13 మందిని షిండే తన వైపు తిప్పుకున్నారు. దీంతో ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని మహా వికాస్ అఘాడి ప్రభుత్వం కుప్పకూలింది. ఆ వెంటనే బీజేపీతో షిండే పొత్తుపెట్టుకుని మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. షిండే ముఖ్యమంత్రిగా, దేవేంద్ర ఫడ్నవిస్ ఉప ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం పార్టీ గుర్తు, పేరు తమకే చెందాలంటూ ఉద్ధవ్, షిండే వర్గం ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించాయి. దాదాపు ఎనిమిది నెలల హైడ్రామాకు కేంద్ర ఎన్నికల సంఘం గత శుక్రవారం తెరదించింది. షిండేకు 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఎక్కువ మంది శివసేన ఎమ్మెల్యేల మద్దతు ఉందని, ఇది పార్టీ సాధించిన ఓట్లలో 76 శాతమని తెలిపింది. 23.5 శాతం మందే ఉద్ధవ్ వైపు ఉన్నట్టు 78 పేజల ఆదేశాల్లో ఈసీ స్పష్టం చేసింది. ఈసీ నిర్ణయంతో ఉద్ధవ్ శివసేనకు గట్టి ఎదురుదెబ్బ తగలింది. 1966లో బాలాసాహెబ్ థాకరే స్థాపించిన పార్టీపై థాకరే కుటుంబం పట్టు కోల్పోయినట్టు అయింది.
విధాన్ భవన్‌కు చేరుకున్న చీఫ్ విప్
కాగా, విధాన్‌భవన్‌లోని శివసేన లెజిస్లేటివ్ పార్టీ కార్యాలయాన్ని తమకు అప్పగించాలని కోరేందుకు శివసేన చీఫ్ విప్ (షిండే వర్గం) భరత్ గోగావాలే, ఇతర ఎమ్మెల్యేలు మంగళవారంనాడు విధాన సభకు వెళ్లారు. రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్‌ను వారు కలుసుకోనున్నారని సమాచారం.
Updated Date - 2023-02-20T13:58:21+05:30 IST