Centre Vs Judiciary : న్యాయ వ్యవస్థ, కేంద్రం మధ్య ఘర్షణ... కిరణ్ రిజిజు స్పందన...
ABN, First Publish Date - 2023-03-25T17:10:46+05:30
కేంద్ర ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ మధ్య ఘర్షణ జరుగుతోందనే వార్తలను కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ మధ్య ఘర్షణ జరుగుతోందనే వార్తలను కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు (Union Law and Justice Minister Kiren Rijiju) తోసిపుచ్చారు. ప్రజాస్వామ్యంలో భేదాభిప్రాయాలు అనివార్యమని, వాటిని ముఖాముఖి ఘర్షణగా భావించకూడదని చెప్పారు. తమిళనాడులోని మయిలదుత్తురాయ్‌లో చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టును శనివారం ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ డీవై చంద్రచూడ్ (Justice DY Chandrachud), తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin), మద్రాస్ హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ టీ రాజా (మధురై) పాల్గొన్నారు.
కిరణ్ రిజిజు మాట్లాడుతూ, తమకు భేధాభిప్రాయాలు ఉన్నాయన్నారు. అయితే దీని భావం ముఖాముఖి ఘర్షణ అని కాదని చెప్పారు. దీనివల్ల ప్రపంచానికి తప్పుడు సందేశం వెళ్తుందన్నారు. దేశంలోని వివిధ వ్యవస్థల మధ్య సమస్య ఏదీ లేదని స్పష్టంగా చెప్పాలని అనుకుంటున్నానని చెప్పారు. పటిష్టమైన ప్రజాస్వామిక కార్యకలాపాల సంకేతాలు ఉన్నాయని, అలా ఉండటం సంక్షోభం కాదని వివరించారు.
ప్రభుత్వం-సుప్రీంకోర్టు మధ్య, చట్టసభలు-న్యాయ వ్యవస్థ మధ్య విభేదాలు ఉన్నాయని కొన్ని మీడియా కథనాలు చెప్తుండటాన్ని ప్రస్తావించారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామని అర్థం చేసుకోవాలన్నారు. చూసే తీరు, దృక్పథంలో కొంత వరకు తేడాలు ఉండవచ్చునన్నారు. అయితే పరస్పర ఘర్షణ వైఖరులు ఉండకూడదన్నారు. ఇది ముఖాముఖి సంఘర్షణ అనేది దీని భావం కాదన్నారు. ప్రపంచంలో మనది అతి పెద్ద ప్రజాస్వామిక దేశమని తెలిపారు. న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా వ్యవహరించడాన్ని కేంద్ర ప్రభుత్వం సమర్థిస్తుందన్నారు. ధర్మాసనం, న్యాయవాదుల సభ (బార్) ఒకే నాణేనికి బొమ్మ, బొరుసు అని చెప్పారు. న్యాయస్థానాల సముదాయం ముక్కలుకాని రీతిలో ఇవి కలిసికట్టుగా పని చేయాలని తెలిపారు. ఒకటి లేనిదే మరొకటి ఉండదన్నారు. కోర్టులో సరైన గౌరవ, మర్యాదలు, ప్రోత్సాహకర వాతావరణం ఉండాలన్నారు.
కేంద్ర ప్రభుత్వం గత ఏడాది తమిళనాడులోని జిల్లా, ఇతర న్యాయస్థానాలకు రూ.9,000 కోట్లు కేటాయించిందన్నారు. ఈ నిధులను ఖర్చు చేయాలని తన మంత్రిత్వ శాఖ గట్టిగా కోరుతోందన్నారు. ఈ నిధులను ఖర్చు చేస్తే మరిన్ని నిధులు కోరడానికి వీలవుతుందన్నారు.
సమీప భవిష్యత్తులో న్యాయ వ్యవస్థ పూర్తిగా కాగితం రహితంగా మారాలని ప్రభుత్వం కోరుకుంటోందన్నారు. టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ప్రతి పనినీ చేయవచ్చునన్నారు. సాక్ష్యాధారాల కోసం జడ్జిలు వాయిదాలు వేయవలసిన అవసరం లేకుండా చేయవచ్చునన్నారు. పెండింగ్ కేసుల భారం తగ్గడానికి ఓ పరిష్కారాన్ని కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి :
Rahul Gandhi : చైనా జాతీయుడికి అదానీ కంపెనీల్లో పెట్టుబడులతో లింక్..
Karnataka : భాషలతో రాజకీయాలు : మోదీ
Updated Date - 2023-03-25T17:10:46+05:30 IST