Chinese Funding : ఇండియన్ మీడియాకు చైనీస్ ఫండింగ్ ఆరోపణలు.. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలన్న కేంద్ర మంత్రి..
ABN, First Publish Date - 2023-08-08T12:07:39+05:30
ఇండియన్ మీడియా సంస్థల్లో కొన్నిటికి చైనా నుంచి నిధులు అందుతున్నాయని ‘న్యూయార్క్ టైమ్స్’ ఓ కథనాన్ని ప్రచురించడంతో అలజడి మొదలైంది. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ కథనాన్ని ప్రస్తావిస్తూ, మీడియా న్యూస్ పోర్టల్ ‘న్యూస్ క్లిక్’కు చైనా నిధులు అందడాన్ని సమర్థించినందుకు క్షమాపణ చెప్పాలని రాహుల్ గాంధీని డిమాండ్ చేశారు.
న్యూఢిల్లీ : ఇండియన్ మీడియా సంస్థల్లో కొన్నిటికి చైనా నుంచి నిధులు అందుతున్నాయని ‘న్యూయార్క్ టైమ్స్’ ఓ కథనాన్ని ప్రచురించడంతో అలజడి మొదలైంది. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ కథనాన్ని ప్రస్తావిస్తూ, మీడియా న్యూస్ పోర్టల్ ‘న్యూస్ క్లిక్’కు చైనా నిధులు అందడాన్ని సమర్థించినందుకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Congress MP Rahul Gandhi)ని డిమాండ్ చేశారు.
బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ (Anurag Thakur) మంగళవారం విలేకర్లతో మాట్లాడుతూ, ‘న్యూస్ క్లిక్’కు కాంగ్రెస్ అండదండలు ఉన్నాయన్నారు. కాంగ్రెస్ హస్తం ‘న్యూస్ క్లిక్’తో ఉందని, ‘న్యూస్ క్లిక్’పైన చైనా హస్తం ఉందని ఆరోపించారు. ‘న్యూస్ క్లిక్’కు కాంగ్రెస్ ఎందుకు మద్దతిస్తోందో చెప్పాలన్నారు. రాహుల్ గాంధీ దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజీవ్ గాంధీ ఫౌండేషన్ చైనా నుంచి నిధులను ఏ విధంగా స్వీకరించిందో, ఆ సొమ్మును ఎక్కడ ఖర్చుపెట్టారో తెలియజేయాలన్నారు.
నిధులు ఎవరు ఇచ్చారు? ‘న్యూస్ క్లిక్’కు కాంగ్రెస్ ఎందుకు మద్దతిస్తోంది? అనే అంశాలను రాహుల్ స్పష్టంగా వివరించాలని డిమాండ్ చేశారు. ఒలింపిక్స్‌కు రావాలని సోనియా గాంధీని చైనా ఆహ్వానించిన తర్వాత ఈ మొత్తం కథ ప్రారంభమైందా? చెప్పాలని కోరారు.
‘న్యూయార్క్ టైమ్స్’ కథనం
‘న్యూయార్క్ టైమ్స్’ పరిశోధనాత్మక కథనం ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా అనేక మీడియా సంస్థలకు చైనా ప్రభుత్వం నిధులు సమకూర్చుతోంది. చైనా ప్రభుత్వ వాదనను భారత దేశంలో ‘న్యూస్ క్లిక్’ వ్యాపింపజేస్తోంది. చైనా ప్రభుత్వంతో ‘న్యూస్ క్లిక్’ పోర్టల్‌కు సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు వచ్చాయి. అమెరికన్ మిలియనీర్ నెవిల్లె సింఘమ్ అంతర్జాతీయ మీడియా ఫండింగ్ కార్యకలాపాల్లో భాగస్వామి. ఆయన ‘న్యూస్ క్లిక్’కు నిధులు ఇచ్చారు.
‘న్యూస్ క్లిక్’ అంతర్జాతీయ ప్రమాదకర ప్రచార మీడియా సంస్థ అని భారత దేశం చాలా కాలం నుంచి ప్రపంచానికి చెప్తోందని అనురాగ్ ఠాకూర్ సోమవారం చెప్పారు. కాంగ్రెస్, చైనా, న్యూస్ క్లిక్ భారత దేశ వ్యతిరేక బొడ్డు తాడుతో అనుసంధానమై ఉన్నాయని దుయ్యబట్టారు. రాహుల్ గాంధీ బూటకపు ప్రేమ దుకాణంలో చైనా వస్తువులు స్పష్టంగా కనిపిస్తున్నాయని మండిపడ్డారు. చైనా పట్ల ప్రేమ కనిపిస్తోందని, విదేశీ గడ్డపై నుంచి భారత దేశ వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. విదేశీ వార్తా సంస్థల ద్వారా కూడా భారత దేశ వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వీరికి ఓ ఎజెండా ఉందని, వీరు భారత దేశానికి వ్యతిరేకంగా, భారత దేశాన్ని ముక్కలు చేయాలనే ప్రచారం చేస్తున్నారన్నారు.
‘న్యూస్ క్లిక్’ స్పందన
ఈ ఆరోపణలపై ‘న్యూస్ క్లిక్’ స్పందిస్తూ, తాము మీడియా విచారణలో పాలుపంచుకోబోమని చెప్పింది. ఈ అంశంపై భారత దేశంలోని కోర్టులు విచారణ జరుపుతున్నాయని తెలిపింది.
ఇవి కూడా చదవండి :
Delhi Service Bill : ఎంపీల సంతకాల ఫోర్జరీ ఆరోపణలు.. కఠిన చర్యలు తీసుకుంటామన్న కేంద్ర మంత్రి..
Updated Date - 2023-08-08T12:07:39+05:30 IST