Terrorist Pannun : అమిత్ షా, జైశంకర్‌లకు ఖలిస్థానీ ఉగ్రవాది పన్నున్ బెదిరింపులు
ABN, First Publish Date - 2023-07-21T14:10:58+05:30
అమెరికాలో ఉంటున్న ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నున్ భారత దేశానికి చెందిన అత్యున్నత స్థాయి నేతలను బెదిరిస్తున్నాడు. మరో ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ కెనడాలోని వాంకోవర్‌లో జూన్‌లో ప్రత్యర్థి వర్గాల దాడిలో చనిపోగా, అందుకు భారతీయ నేతలే కారణమని ఆరోపిస్తున్నాడు.
న్యూఢిల్లీ : అమెరికాలో ఉంటున్న ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నున్ భారత దేశానికి చెందిన అత్యున్నత స్థాయి నేతలను బెదిరిస్తున్నాడు. మరో ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ కెనడాలోని వాంకోవర్‌లో జూన్‌లో ప్రత్యర్థి వర్గాల దాడిలో చనిపోగా, అందుకు భారతీయ నేతలే కారణమని ఆరోపిస్తున్నాడు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Home Minister Amit Shah), విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ (Subrahmanian Jaishankar), కెనడాలోని ఇండియన్ హై కమిషనర్ సంజయ్ కుమార్ వర్మల అమెరికా పర్యటన సమాచారాన్ని అందించేవారికి భారీ నజరానాను ప్రకటించాడు.
కెనడాలోని వాంకోవర్‌లో ఖలిస్థానీ ఉగ్రవాదుల మధ్య శత్రుత్వం ఉంది. నిజ్జర్ ప్రత్యర్థి వర్గం దాడిలో జూన్ నెలలో మరణించాడు. అయినప్పటికీ గురుపత్వంత్ సింగ్ పన్నున్ భారత ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పిస్తున్నాడు. ఆయనకు అమెరికా, కెనడా పాస్‌పోర్టులు ఉన్నాయి. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ప్రకారం ఆయనపై భారత దేశంలో కేసులు నమోదయ్యాయి. ఈ కేసులను ఎన్ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) దర్యాప్తు చేస్తోంది.
నిజ్జర్ హత్యకు భారత ప్రభుత్వమే కారణమని ఆరోపిస్తూ, అమిత్ షా, ఎస్ జైశంకర్, సంజయ్ కుమార్ వర్మల అమెరికా పర్యటనకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేయాలని పన్నున్ పిలుపునిచ్చాడు. ఈ సమాచారాన్ని తెలిపినవారికి 1,25,000 డాలర్లు బహుమతిగా ఇస్తానని ప్రకటించాడు. వీరిపై అంతర్జాతీయ చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటానని, జవాబుదారీ చేస్తానని తెలిపాడు. ఈ నేతలు విదేశాల్లో పర్యటించినపుడు పికెటింగ్ చేయాలని పిలుపునిచ్చాడు.
పన్నున్ సిక్స్ ఫర్ జస్టిస్ (Sikhs for Justice-SFJ) అనే సంస్థను నడుపుతున్నాడు. కెనడాలోని ఒట్టావా, టొరంటో, వాంకోవర్‌లలో ఉన్న భారత దేశ దౌత్య కార్యాలయాలను ఆగస్టు 15న ముట్టడించాలని ఆ దేశంలో ఉన్న సిక్కు రాడికల్స్‌కు పిలుపునిచ్చాడు. వాంకోవర్‌లో సెప్టెంబరు 10న సిక్ రిఫరెండం నిర్వహిస్తామని ప్రకటించాడు.
పన్నున్ బెదిరింపులపై కెనడాలోని భారతీయ దౌత్యవేత్తలు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే కౌంటర్ టెర్రరిజంపై అమెరికా, భారత్ సహకరించుకుంటున్నప్పటికీ, పన్నున్ విషయంలో అమెరికా ఉదాసీనంగా వ్యవహరిస్తోంది.
ఇదిలావుండగా, ఎస్ జైశంకర్ ఇటీవల మాట్లాడుతూ, కెనడాలోని జస్టిన్ ట్రుడు ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. ఆ దేశంలోని సిక్కు ఉగ్రవాదులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడంలో విఫలమవుతోందన్నారు. అదేవిధంగా పన్నున్‌పై అమెరికా ప్రభుత్వ ఉదాసీన వైఖరి మాటల్లో చెప్పనలవి కానంత బిగ్గరగా స్పష్టమవుతోందన్నారు.
మరోవైపు పన్నున్ అమెరికా సీఐఏ లేదా ఎఫ్‌బీఐ ఏజెంట్‌గా పని చేస్తుండటం వల్ల ఆయనపై అమెరికా న్యాయ శాఖ ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం లేదని తమకు తెలుస్తోందని భారత నిఘా అధికారులు అమెరికా నిఘా అధికారులకు తెలిపారు. అనేక దశాబ్దాలుగా అమెరికా, కెనడా, బ్రిటన్, జర్మనీ సిక్కు రాడికల్స్‌కు ఆశ్రయమిస్తున్నాయి. భారత దేశంపై దాడి చేయడానికి, తమ దేశాల్లో నిధులను సేకరించడానికి సిక్కు రాడికల్స్‌కు అవకాశం ఇస్తున్నాయి.
ఇవి కూడా చదవండి :
CJI : రైలు ప్రయాణంలో అసౌకర్యంపై హైకోర్టు జడ్జి ఫిర్యాదు.. హుందాగా ప్రవర్తించాలంటూ సీజేఐ లేఖ..
Manipur video : మహిళలను నగ్నంగా ఊరేగించడానికి కారణం వదంతులే : మణిపూర్ పోలీసులు
Updated Date - 2023-07-21T14:10:58+05:30 IST