Gopal mandal: ఖర్గేనా ఫర్గేనా.. ఆయన ఎవరికి తెలుసు..?.. కస్సుమన్న జేడీయూ నేత
ABN, Publish Date - Dec 22 , 2023 | 07:47 PM
ఇండియా బ్లాక్ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ను ప్రధాని అభ్యర్థిగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రతిపాదించడంపై జేడీయూ గుర్రమంటోంది. తాజాగా జేడీయూ ఎమ్మెల్యే గోపాల్ మండల్ నిప్పులు చెరిగారు. ''అసలు ఖర్గే ఎవరు? ఆయన గురించి ఎవరికీ తెలియదు? బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పీఎం అభ్యర్థి కావాలి'' ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్నారు.
భగల్‌పూర్: ఇండియా (I.N.D.I.A.) బ్లాక్ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge)ను ప్రధాని అభ్యర్థిగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రతిపాదించడంపై జేడీయూ(JDU) గుర్రమంటోంది. మల్లికార్జున్ ఖర్గే ఆ ప్రతిపాదనను సున్నితంగా తోసిపుచ్చినప్పటికీ జేడీయూ నేతలు తమ మనసులోని మాటను బహిరంగంగా చెప్పడానికి వెనుకాడటం లేదు. తాజాగా జేడీయూ ఎమ్మెల్యే గోపాల్ మండల్ (Gopal Mandal) నిప్పులు చెరిగారు. ''అసలు ఖర్గే ఎవరు? ఆయన గురించి ఎవరికీ తెలియదు? బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పీఎం అభ్యర్థి కావాలి'' ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్నారు.
''ఖర్గే-ఫర్గే ఎవరో జనాలకు తెలియదు. నాకు కూడా ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడనే విషయం తెలియదు. ఏ ఒక్కరికీ ఆయన ఎవరో తెలియదు. జనాలకు అయితే అస్సలు తెలియదు. జనాలకు తెలిసింది నితీష్ కుమార్ మాత్రమే. ఆయనే ప్రధాని కావాలి. ఆయన గురించి యావద్దేశానికి తెలుసు'' అని మండల్ అన్నారు. ఇండియా బ్లాక్ ఏర్పాటుకు ప్రధాన కారకుడు నితీష్ అని చెప్పారు. నీతీష్ వల్లే ఇండియా కూటమి ఏర్పాటు సాధ్యమైందని, కూటమికి 'ఇండియా' అనే పేరు పెట్టడంలో కూడా కన్వీనర్‌గా ఆయన కీలక పాత్ర పోషించారనీ, ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చి అందర్నీ వరుసగా కలుస్తూ వచ్చారని, వారంతా నితీష్ కుమార్‌నే ప్రధానిగా ఎన్నుకోవాలని సూచించారు.
కాంగ్రెస్‌ను జనం నమ్మడం లేదు..
కాంగ్రెస్ పార్టీని జనం నమ్మడం లేదని కూడా మండల్ విమర్శించారు. కాంగ్రెస్ విశ్వసించదగిన పార్టీకాదని, ఆ పార్టీ హయాంలో ద్రవ్యోల్బం, ధరల పెరుగుదలతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యారని అన్నారు. కాంగ్రెస్ పాలసీల వల్లే బీజేపీ అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు బీజేపీ సైతం ద్రవ్యోల్బణానికి మరో మెట్టు ఎక్కించదని ఆరోపించారు. ఆ కారణంగానే పాత ముఖాలకు బదులు కొత్త ముఖాలను ఎన్నుకోవాల్సి ఉంటుందని సూచించారు.
Updated Date - Dec 22 , 2023 | 07:49 PM