Karnataka assembly polls: కర్ణాటకలో బీజేపీ గెలిచి తీరాల్సిందే... ఎందుకంటే?
ABN, First Publish Date - 2023-04-03T18:20:45+05:30
కర్ణాటకలో గెలిస్తే అదే ఊపును మరో ఆరు నెలల్లో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ...
బెంగళూరు: భారతీయ జనతా పార్టీ(BJP) ఉత్తరాది పార్టీ కాదని చెప్పేందుకు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో(Karnataka Assembly Polls) కమలనాథులు గెలిచి తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు కర్ణాటకలో గెలిస్తే అదే ఊపును మరో ఆరు నెలల్లో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ(Telangana Assembly Polls) ప్రదర్శించేందుకు అవకాశం చిక్కుతుంది. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే 2024 లోక్‌సభ ఎన్నికలు(2024 Lok Sabha Polls) కూడా సమీపిస్తుండటంతో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలంటే కర్ణాటకలో కూడా గెలిచి తీరాల్సిందే. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలో బీజేపీ ఎంపీలు 28 మంది గెలిచారు. ఒక రకంగా బీజేపీ మ్యాజిక్ నెంబర్ 272ను దాటడంలో కర్ణాటక కీలక పాత్ర పోషించినట్లైంది. మే 10న జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కనుక ఓటమి పాలైతే బీజేపీ ఉత్తరాది పార్టీ అని తేలిపోయిందంటూ కాంగ్రెస్, ఇతర పార్టీలు ప్రచారం చేస్తాయి. అంతేకాదు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ దూకుడుగా వ్యవహరించలేదు. అధికారం కోల్పోతే 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి.
మరోవైపు గెలిచి తీరాల్సిన కర్ణాటకలో బీజేపీ అన్ని అస్త్రాలనూ సిద్ధం చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi), కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah), బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda), యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ (Yogi) సహా కీలక నాయకులంతా కన్నడనాట ప్రచారం చేయనున్నారు. ఓటర్లను ప్రభావితం చేయనున్నారు. అన్నింటినీ మించి బీఎస్ యెడ్యూరప్పకు (BS Yediyurappa) ప్రచార బాధ్యతలు అప్పగించడం ద్వారా బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. కన్నడిగులకు ఇష్టమైన నేతగా యెడ్యూరప్ప ఓటర్లను బాగా ప్రభావితం చేయగలరని కమలనాథులు విశ్వసిస్తున్నారు. యెడ్యూరప్ప కుటుంబంతో బీజేపీ అధిష్టానానికి సత్సంబంధాలు కొనసాగుతున్నాయని చాటేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి భోజనం చేశారు. యెడ్యూరప్ప తనయుడు విజయేంద్రకు కోరుకున్న చోట టికెట్ ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించారు. ఎన్నికల ప్రచారంలోనూ విజయేంద్ర కీలకంగా వ్యవహరించనున్నారు. తద్వారా రాష్ట్రంలో 17 శాతానికి పైగా ఉన్న లింగాయత్‌ల ఓట్లు చేజారిపోకుండా కమలనాథులు జాగ్రత్త పడుతున్నారు. అదే సమయంలో బస్వరాజ్ బొమ్మైతో యెడ్యూరప్పకున్న విభేదాలను కూడా బీజేపీ అధిష్టానం పరిష్కరించింది. తద్వారా బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు లేకుండా జాగ్రత్త పడింది.
224 మంది సభ్యులున్న కర్ణాటక అసెంబ్లీలో ప్రస్తుతం బీజేపీకి 119, కాంగ్రెస్‌కు 75, జేడీఎస్‌కు 28 మంది ఎమ్మెల్యేలున్నారు. మే 10న జరగబోయే ఎన్నికల్లో కనీసం 150 స్థానాలు గెలవాలని కమలనాథులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం బూత్ లెవల్‌లో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గుజరాత్‌లో అనుసరించినట్లుగా పన్నా ప్రముఖ్ తదితర వ్యూహాలను అమలు చేయనున్నారు. బీజేపీ ఇటీవలే 4 శాతం రిజర్వేషన్లను ఒక్కలిగ, లింగాయత్ కులాలకు 2శాతం చొప్పున కేటాయించారు. దీంతో 2సీలోని ఒక్కలిగ(Vokkaligas) రిజర్వేషన్లు 4శాతం నుంచి 6 శాతానికి, 2డీలోని లింగాయత్(Lingayat) రిజర్వేషన్లు 5 శాతం నుంచి 7 శాతానికి పెరిగాయి. ముస్లింలు కోర్టును ఆశ్రయించినా ఇబ్బందులు రాకుండా ఉండేందుకు వారిని 10 రిజర్వేషన్ ఉన్న ఈడబ్ల్యూఎస్‌లో చేర్చారు. అలాగే ఎస్సీ రిజర్వేషన్లను 15 శాతం నుంచి 17 శాతానికి, ఎస్టీ రిజర్వేషన్‌ను 3 శాతం నుంచి 7 శాతానికి పెంచారు. మొత్తం రిజర్వేషన్లను 50 శాతం నుంచి 56 శాతానికి పెంచారు. హిజాబ్ వివాదం, టిప్పు సుల్తాన్ వివాదం, హలాల్ వివాదం, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాపై కఠిన చర్యలు తదితర అంశాలు ఎన్నికల్లో కీలకం కానున్నాయి.
కర్ణాటకలో గత కొన్ని సంవత్సరాలుగా వరుసగా ఏ ప్రభుత్వాన్నీ రెండోసారి ఎన్నుకోవడం లేదు. దీంతో బీజేపీని రెండోసారి ఎన్నుకుంటారా లేదా అనేది సస్పెన్స్ థ్రిల్లర్‌లా మారింది. అభివృద్ధికి డబుల్ ఇంజిన్ సర్కారు తప్పనిసరి అంటూ ప్రధాని మోదీ చెబుతున్న విషయాలను కన్నడిగులు ఏ మాత్రం పట్టించుకుంటారనేది మే 13న రానున్న ఫలితాలతో తేలిపోనుంది.
Updated Date - 2023-04-03T18:22:29+05:30 IST