Infertility : పిల్లలు లేరని బాధ పడేవారు.. ఈ 5 అలవాట్లను మార్చుకుని చూడండి..
ABN, First Publish Date - 2023-02-17T13:26:04+05:30
తల్లి అవడం కంటే మించిన వరం మహిళకు ఏముంది? కొంతమంది మహిళలు పెళ్లి అవగానే తల్లి అవుతారు. కానీ కొందరు మాత్రం చాలా స్ట్రగుల్ అవుతారు. ఇలాంటి వారు హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతారు.
Infertility : తల్లి అవడం కంటే మించిన వరం మహిళకు ఏముంది? కొంతమంది మహిళలు పెళ్లి అవగానే తల్లి అవుతారు. కానీ కొందరు మాత్రం చాలా స్ట్రగుల్ అవుతారు. ఇలాంటి వారు హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతారు. అయినా కూడా ఫలితం లేకుంటే ఐవీఎఫ్ వంటి కృత్రిమ పద్ధతులను అవలంబిస్తారు. సంతానలేమి సమస్య ప్రపంచ వ్యాప్తంగా 15 శాతం మంది జంటలను వేధిస్తోంది. నిజానికి దీనికి కారణాలు ఎన్నో ఉన్నాయి. కానీ కొంతమందిలో వారి దినచర్య కూడా సంతానలేమికి ఒక కారణం కావొచ్చు. సంతాన లేమికి భార్య లేదంటే భర్త ఇద్దరిలో ఎవరో ఒకరు కారణం కావొచ్చు. మన దైనందిన అలవాట్లు సంతానలేమికి ఎలా కారణమవుతాయో తెలుసుకుందాం.
1. స్మోకింగ్..
ధూమపానం ఆడ లేదా మగవారిలో సంతానలేమికి కారణం కావొచ్చు. ఇది మహిళల్లో మెనోపాజ్ త్వరగా రావడానికి కారణమవుతుంది. అలాగే పురుషులలో స్పెర్మ్ క్వాలిటీని తగ్గిస్తుంది. అందువల్ల స్మోకింగ్‌కు చెక్ పెట్టడం అత్యుత్తమం.
2. నిద్రలేమి..
స్లీప్ ప్యాట్రన్స్ అనేవి సాధారణంగా శరీరం సిర్కాడియన్ రిథమ్ ద్వారా ప్రభావితమవుతాయి. రాత్రి షిఫ్టులలో పనిచేసే లేదా ఆలస్యంగా మేల్కొనే మహిళల్లో ఇన్‌ఫెర్టిలిటీ, గర్భస్రావం సమస్య ఇతరుల కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. మీ ప్రొజెస్టెరాన్, ఈస్ట్రోజెన్, లెప్టిన్, ఫోలికల్-స్టిమ్యులేటింగ్ హార్మోన్‌ల స్థాయిలు, గర్భం ధరించడానికి, గర్భధారణకు అవసరమైన అన్నీ ప్రతిరోజూ 7 - 8 గంటల పాటు నిద్రపోవడం వల్ల మెరుగుపడతాయి.
3. అధికంగా కెఫైన్ తీసుకోవడం..
పరిమితికి మించి కాఫీలు తీసుకోవడం కూడా సంతానలేమికి కారణం కావొచ్చు. కాఫీలో ఉండే కెఫైన్ పురుషులలోని స్మెర్స్ ఉత్తత్తి సామర్ధ్యాన్ని దెబ్బతీస్తుంది. ఇక మహిళల్లో అయితే దీని పర్యావసానాలు మరింత దారుణంగా ఉంటాయి. ఇది గర్భస్రావం ప్రమాదాన్ని పెంచుతుంది. ఇన్‌ఫెర్టిలిటీతో బాధపడుతున్న మహిళలు కాఫీకి కాస్త దూరంగా ఉండటం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.
4. మద్యం సేవించడం..
మహిళలు ఇష్టానుసారంగా మద్యం సేవించడం వల్ల ఒకవేళ వారు గర్భవతి అయితే ఆ విషయం తెలుసుకునే లోపే పిండానికి ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. ఇక ఇన్‌ఫెర్టిలిటీ సమస్య ఉన్న మహిళలు మద్యం జోలికి వెళ్లకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. మగవారిలో సైతం అధికంగా మద్యం తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి జంటలు గర్భధారణ అవకాశాలను పెంచుకోవాలనుకుంటే మద్యపానాన్ని పరిమితం చేయవలసిందే.
5. ఫుడ్ హాబిట్స్..
వర్కింగ్ పీపుల్ ఎక్కువగా బ్రేక్‌ఫాస్ట్‌లు మానేయడం.. త్వరగా మధ్యాహ్న భోజనాలు చేయడం.. లేదంటే అసలే భోజనం మానేయడం వంటివి వారి ఆరోగ్యంతో పాటు సంతానోత్పత్తిని హరిస్తాయి. ఆహారం, సంతానోత్పత్తి మధ్య విడదీయరాని సంబంధం ఉంది. సరిపోని పోషకాహారం అనేది స్త్రీ అండోత్సర్గము సామర్థ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఇక తరచుగా ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల ఊబకాయం ఏర్పడుతుంది. ఇది గర్భం దాల్చడాన్ని కష్టతరం చేస్తుంది. క్రమం తప్పకుండా ఫాస్ట్ ఫుడ్ తినే స్త్రీలు గర్భం దాల్చడానికి ఎక్కువ సమయం తీసుకుంటారని సంతానోత్పత్తి నిపుణులు చెబుతున్నారు. కాబట్టి సంతానలేమితో బాధపడే జంటలు ఈ ఐదు విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉంటే మేలు జరుగుతుంది.
Updated Date - 2023-02-17T13:42:53+05:30 IST