Neha Khushwa : ఆ జ్ఞాపకాలు పచ్చగా...

ABN , First Publish Date - 2023-09-28T00:14:15+05:30 IST

‘‘మాది ఉత్తరప్రదేశ్‌లోని దిబియాపూర్‌. బడిలో పాఠాలతో పాటు సామాజిక అంశాలు, పౌర బాధ్యతల గురించి బోధించేవారు. పరిసరాల పరిశుభ్రత గురించి విని, క్లాస్‌లోంచి బయటకు వచ్చాక చూస్తే... వీధుల్లో పరిస్థితులు అందుకు పూర్తి విరుద్ధంగా కనిపించేవి. కానీ వాటికి పరిష్కారాలను

Neha Khushwa : ఆ జ్ఞాపకాలు పచ్చగా...

ఆత్మీయుల జ్ఞాపకాలను పదిలం చేయడంలో

పర్యావరణ స్పృహను జోడించింది నేహా ఖుష్వా.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఈ అమ్మాయి

నాటిస్తున్న స్మృతి వృక్షాలు ఎందరికో

ప్రేరణనిస్తున్నాయి. ఎనిమిదేళ్ళ కృషికి గుర్తింపుగా ఎన్నో

పురస్కారాలు అందుకున్న నేహా తన

పయనం గురించి ఏం చెబుతోందంటే...

‘‘మాది ఉత్తరప్రదేశ్‌లోని దిబియాపూర్‌. బడిలో పాఠాలతో పాటు సామాజిక అంశాలు, పౌర బాధ్యతల గురించి బోధించేవారు. పరిసరాల పరిశుభ్రత గురించి విని, క్లాస్‌లోంచి బయటకు వచ్చాక చూస్తే... వీధుల్లో పరిస్థితులు అందుకు పూర్తి విరుద్ధంగా కనిపించేవి. కానీ వాటికి పరిష్కారాలను గుర్తించే వయసు కాదు నాది. అప్పుడు నాకు పదేళ్ళు. మా బడికి వెళ్ళాలంటే శ్మశానాన్ని దాటాలి. అక్కడ అంత్యక్రియల కోసం గుట్టలు గుట్టలుగా కట్టెలు ఒక షెడ్‌లో పేర్చి ఉండేవి. ‘వాటి కోసం ఎన్నో చెట్లను నరకాలి. దాని వల్ల పర్యావరణానికి హాని కలుగుతుంది కదా?’ అనే చింత నన్ను వదిలేది కాదు. దీనికి కారణం... చెట్ల నరకివేత వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి నేను రోజూ వింటున్న పాఠాలు, వార్తాపత్రికల్లో చదువుతున్న కథనాలే. ‘మరణించిన వారి దహనం కోసం కట్టెలను ఉపయోగించినప్పుడు... వారి జ్ఞాపకార్థం చెట్టు నాటితే బాగుంటుంది కదా!’ అనిపించింది. ఈ ఆలోచనను అమ్మానాన్నలతో, టీచర్లతో పంచుకున్నాను. ‘‘మంచి ఆలోచనే కానీ, దాన్ని ఆచరణలో పెట్టాలంటే ప్రజల సహకారం కావాలి. అయినా ప్రయత్నించు’’ అన్నారు. వారి మద్దతుతోతో... ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఆవరణలో తమ పూర్వీకులకు గుర్తుగా ఒక మొక్క నాటి, దాన్ని సంరక్షింంచాలని మా ప్రాంతంలో ప్రచారం ప్రారంభించాను. మొదట్లో కొందరు నొసళ్ళు చిట్లించినా... ఆ తరువాత నా ఆలోచనను మెచ్చుకున్నారు. అలా 2015 మార్చిలో మొదటి మొక్కను మా తాతయ్య జ్ఞాపకంగా మా ఇంట్లోనే నాటి... శ్రీకారం చుట్టాం. క్రమంగా ఈ సంగతి ఆనోటా ఈనోటా ప్రాచుర్యం పొందింది. అదే ఏడాది జూలైలో... సోనీ సబ్‌ టీవీ ఛానల్‌ వాళ్ళు నన్ను, మా టీచర్‌ మనీ్‌షను ముంబయికి పిలిచి.... ఈ కార్యక్రమం మీద ఒక ఎపిసోడ్‌ చేశారు. ఆ తరువాత సోషల్‌ మీడియా, ప్రింట్‌ మీడియా, ఎలకా్ట్రనిక్‌ మీడియాల్లో మా కార్యక్రమాల గురించి ఎన్నో కథనాలు వెలువడ్డాయి.

ఆమె ప్రశంసను మరచిపోలేను...

ఇప్పటివరకూ నా నేతృత్వంలో మూడున్నరవేలకు పైగా మొక్కలను నాటాం. ప్రతి మొక్కనూ వాటి యజమానులు తమ పెద్దల గుర్తుగా ఎంతో అపురూపంగా చూసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఎనిమిదేళ్ళ కిందట నాటిన ఎన్నో చెట్లు బాగా ఎదిగాయి. పచ్చదనాన్నీ, ఫలసాయాన్నీ అందిస్తున్నాయి. చాలామంది తమవారి అంత్యక్రియలు పూర్తవగానే... మా దగ్గర మొక్కలు తీసుకొని ఇళ్ళ దగ్గర నాటుతున్నారు. వాటిలో మామిడి, జామ, నిమ్మ, దానిమ్మ, ఉసిరి, నేరేడు, నారింజ, టేకు, పనస, వేప... ఇలా అనేక రకాలు ఉన్నాయి. కొందరు పూల మొక్కలను, ఔషధ మొక్కలను కూడా నాటుతున్నారు. ప్రజల నుంచే కాదు, వివిధ సంస్థల నుంచి కూడా ఈ కార్యక్రమం నాకు ఎంతో గుర్తింపు తీసుకువచ్చింది. ‘నేషనల్‌ చిల్డ్రన్స్‌ సైన్స్‌ కాంగ్రె్‌స’లో రెండు సార్లు పాల్గొన్నాను. 2018లో జరిగిన ‘ఇంటర్నేషనల్‌ సైన్స్‌ ఫెస్టివల్‌’లో నా ప్రచారం గురించి ఒక షార్ట్‌ ఫిలిం ప్రదర్శించారు. అలాగే మా కార్యక్రమానికి ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్ట్స్‌’లో చోటు దక్కింది. నా జీవితం ఇతివృత్తంగా వచ్చిన ‘గోల్డెన్‌ బాయ్‌ ఛిమీ’ పుస్తకానికి ‘ఇండియన్‌ పేపర్‌ ఇంక్‌ అవార్డ్‌’ లభించింది. ఇక నేను వ్యక్తిగతంగా 2021లో ‘నేషనల్‌ యూత్‌ అవార్డు’, యు.పి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ‘పర్యావరణ పరిరక్షణ మిత్ర’ అవార్డు, కిందటి ఏడాది చివర్లో భారత జలశక్తి మంత్రిత్వ శాఖ నుంచి ‘వాటర్‌ హీరో అవార్డు’... ఇలా ఎన్నో పురస్కారాలు అందుకున్నాను. ‘ఉత్తరప్రదేశ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’ సంస్థ నన్ను ‘ఉమన్‌ ప్రైడ్‌’ పురస్కారంతో గౌరవించింది. కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ నన్ను ‘భారతదేశ లక్ష్మి’ అంటూ ట్విట్టర్‌లో ప్రశంసించడాన్ని ఎన్నటికీ మరచిపోలేను.. పద్ధెనిమిదేళ్ళ వయసుకే ఇంత గుర్తింపు పొందడం ఎంతో సంతోషంగా ఉంది. వివిధ ప్రాంతాల నుంచి వేలాది అమ్మాయిలు మా ప్రచారాన్ని స్ఫూర్తిగా తీసుకొని... తమ ప్రాంతాల్లో మొక్కలు నాటుతున్నామని చెబుతున్నారు. ఒక మంచి పని చేసినప్పుడు సమాజం సానుకూలంగా స్పందిస్తుందనడానికి ఇదే నిదర్శనం. దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఈ విధంగా మొక్కలు నాటేలా ప్రేరేపించాలనేది నా ఆశయం.’’

Neha-Kushwaha2.jpg

‘మరణించిన వారి దహనం కోసం కట్టెలను ఉపయోగించినప్పుడు... వారి జ్ఞాపకార్థం చెట్టు నాటితే బాగుంటుంది కదా!’ అనిపించింది. ఈ ఆలోచనను అమ్మానాన్నలతో, టీచర్లతో పంచుకున్నాను. ‘‘మంచి ఆలోచనే కానీ, దాన్ని ఆచరణలో పెట్టాలంటే ప్రజల సహకారం కావాలి. అయినా ప్రయత్నించు’’ అన్నారు.

Updated Date - 2023-09-28T00:14:54+05:30 IST

News Hub