Chandra Bose : ఆస్కార్ సాధించిన ‘నాటు నాటు’ పాట రచయిత చంద్రబోస్ పంచుకున్న విశేషాలివీ

ABN , First Publish Date - 2023-04-02T00:36:58+05:30 IST

తెలుగు పాటని ఆస్కార్‌ వేదికపై నిలబెట్టి చరిత్ర సృష్టించారు కీరవాణి.. చంద్రబోస్‌! ‘అండ్‌ ద అవార్డ్‌ గోస్‌ టూ.. నాటు నాటు’ అన్న ఆ క్షణం.. డాల్బీ ధియేటర్‌లో అడుగులు వేసుకొంటూ, వేదికని సమీపిస్తున్నప్పుడు

Chandra Bose : ఆస్కార్ సాధించిన ‘నాటు నాటు’ పాట రచయిత చంద్రబోస్ పంచుకున్న విశేషాలివీ

తెలుగు పాటని ఆస్కార్‌ వేదికపై నిలబెట్టి చరిత్ర సృష్టించారు కీరవాణి.. చంద్రబోస్‌! ‘అండ్‌ ద అవార్డ్‌ గోస్‌ టూ.. నాటు నాటు’ అన్న ఆ క్షణం.. డాల్బీ ధియేటర్‌లో అడుగులు వేసుకొంటూ, వేదికని సమీపిస్తున్నప్పుడు అవార్డు అందుకొంటున్నప్పుడు ఆయన ఆలోచనలు ఏ రీతిన సాగాయి? అసలు చంద్రబోస్‌ మానసిక పరిస్థితి ఏమిటి? ఇంతకీ అకాడమీ ఆతిథ్యం ఎలా ఉంటుంది? లాంటి విషయాలను.. ఆస్కార్‌ విజేత చంద్రబోస్‌ని అడిగి సవివరంగా తెలుసుకొనే ప్రయత్నం చేసింది ‘నవ్య’.

  1. కలలో కూడా కలగనని కల ఇది. ఊహలో కూడా రాని ఆలోచన. ఆస్కార్‌ అవార్డ్‌ అనేది అబద్దం లాంటి నిజం. స్వప్నంలాంటి సత్యం, ఊహలాంటి వాస్తవం. కల్పనలాంటి యథార్థం. జాతీయ అవార్డ్‌ పొందాలనేది నా జీవిత లక్ష్యం. అలా ప్రతి సంవత్సరం జాతీయ పురస్కారం కోసం ఎదురు చూడడం, నాకు రాకపోయేసరికి బాధ పడడం, అవార్డ్‌కు ఎన్నికైన పాటతో నా పాటను పోల్చుకుని ‘అది బాగుందా.. ఇది బాగుందా’ అని లెక్కలు వేసుకోవడం, రెండు రోజులు కుంగిపోవడం, తర్వాత తేరుకుని బయటకు రావడం.. అంత కంటే మంచి పాటలు రాద్దామని కృషి చేయడం.. ఇలా ఐదారేళ్లుగా జరుగుతోంది. చివరకు భగవంతుడు నా కృషిని గుర్తించి మూడు నెలల వ్యవధిలో నాలుగు అంతర్జాతీయ అవార్డులు వచ్చేలా చేశాడు. నా జన్మ చరితార్థమైన సంఘటన ఇది.

  2. ఏదన్నా గొప్ప వేడుకలో పాల్గొనే ముందు రోజున సాధారణంగా నాకు రాత్రి నిద్ర పట్టదు. దాని గురించి ఆలోచిస్తూ మెదడంతా ఉత్తేజితమవుతుంది. తక్కువ సమయమే పడుకుంటాను. ఎందుకో ఏమో తెలీదు కానీ ఆస్కార్‌ వేడుక జరిగే ముందు రోజు అంటే మార్చి 11న మాత్రం హాయిగా నిద్రపోయాను. ఐదారేళ్లుగా గోల్డెన్‌ గ్లోబ్‌, క్రిటిక్స్‌ ఛాయిస్‌ అవార్డులు ఎవరికి వచ్చాయో వాళ్లకే ఆస్కార్‌ అవార్డులు రావడం ఒక ఆనవాయితీగా మారింది. ఆ రెండు అవార్డులు మా పాటకు రావడంతో ఆస్కార్‌ వస్తుందనే నమ్మకం ఎక్కడో ఉంది. భారతీయ చిత్రంలోని ఓ పాట ఆస్కార్‌కు నామినేట్‌ అవడం అదే మొదటిసారి. అదే చాలనుకున్నాం. కానీ గోల్డెన్‌ గ్లోబ్‌, క్రిటిక్స్‌ ఛాయిస్‌ అవార్డులు రావడంతో మరికొంత నమ్మకం కలిగింది. ఆ నమ్మకం, ధైర్యం ఉండడం వల్ల హాయిగా నిద్రపోగలిగాను.

  3. సుచిత్రకు వీసా సమస్య ఎదురవడంతో ఆమె రాలేకపోయింది. అయితే మా అబ్బాయి నంద వనమాలి అక్కడే చదువుకుంటున్నాడు. వాడు నాకు తోడుగా వచ్చాడు. మఽధ్యాహ్నం ఒంటి గంటకు కారు వచ్చింది. ఆ కారులో కీరవాణిగారి దగ్గరకు వెళ్లాను. మేమిద్దరం, కీరవాణిగారు, వల్లిగారు మూడున్నర కల్లా సన్‌సెట్‌బుల్‌ స్ట్రీట్‌కు చేరుకున్నాం. అక్కడినుంచి రెడ్‌ కార్పెట్‌ మొదలవుతుంది. దాని మీద నలభై నిముషాలు మెల్లిగా నడుచుకుంటూ వెళ్లి డాల్బీ థియేటర్‌లో కూర్చున్నాం. సరిగ్గా సాయంత్రం ఐదు గంటలకు వేడుక మొదలైంది. అవార్డులు ప్రకటిస్తున్నారు, విజేతలు వేదిక మీదకు వస్తున్నారు. ఎనిమిది గంటల ప్రాంతంలో ఒరిజనల్‌ సాంగ్‌ నామినేషన్స్‌ పొందిన పాటల పేర్లు చదువుతూ ఫైనల్‌గా ‘నాటునాటు’ పాట సెలెక్ట్‌ అయిందని ప్రకటించారు. ఆ చివరి పది క్షణాలు బాగా ఉత్కంఠకు లోనయ్యాను.

  4. మాట్లాడుకోవడానికి మాటలు ఉంటే కదా. ఒకరి చెయ్యి ఒకరం గట్గిగా అదిమి పట్టుకుని కూర్చున్నాం. ఆ తర్వాత ఆ మధుర క్షణం రానే వచ్చింది. మా పేర్లు ప్రకటించగానే సీట్‌లోంచి పైకి లేచాం. నా సీటు నంబర్‌ జె 17. కీరవాణిగారిది 18. నా సీటు దగ్గర నుంచి వేదిక చేరుకోవడానికి పదిహేను సెకన్లు పడుతుంది. ఆ పదిహేను సెకన్లు కళ్లు, కాళ్లు మాత్రమే పనిచేశాయి. కళ్లు ూస్తున్నాయి, కాళ్లు నడుస్తున్నాయి. నిర్వకల్ప సమాధి స్థితి అని పుస్తకాల్లో చదువుతుంటామే ఆ సమయంలో అలా ఉంది మా పరిస్థితి. వేదిక మీదకు వెళ్లిన తర్వాత ఆస్కార్‌ అవార్డ్‌ చేతిలో పెట్టగానే వాస్తవంలోకి వచ్చాం. భారతీయ సాహిత్య గౌరవాన్ని, కీర్తిని, పతాకాన్ని చేతుల్లో పట్టుకున్న అనుభూతి కలిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో భాషలు, పాటలు ఉన్నా మన భాషకు, మన పాటకు అవార్డ్‌ రావడం అన్నది మాటల్లో వర్ణించలేని మధురానుభూతి.

  5. రోజూ నాకు మెయిల్స్‌ వచ్చేవి. నా సీటు నంబర్‌, ఏ వరుసలో ఉంటుంది, అడ్మిట్‌ పాస్‌, కారు పాస్‌, కొవిడ్‌ టెస్ట్‌ చేయించుకోవడానికి క్యూ ఆర్‌ కోడ్‌ .. ఇవన్నీ అకాడెమీ పంపించింది. ఇక వేదిక మీద నా పేరు ఎలా ఉచ్చరించాలో అడిగి తెలుసుకున్నారు. ‘వేదిక మీద పేరును తప్పుగా పలకకూడదు కనుక మీ పేరుని ఎలా పలకాలో వాయిస్‌ రికార్డ్‌ చేసి పంపమ’ని చెప్పారు. ఇలా ఏర్పాటు అన్నీ పక్కాగా ఉంటాయి.

  6. లేదండి. అక్కడి వాతావరణానికి తగినట్లుగా మన డ్రస్‌ ఉంటే బాగుంటుందని సూట్‌ కుట్టించుకున్నాను. మార్చి 12న వేడుక జరిగితే ఆస్కార్‌కు నామినేట్‌ అయిన వాళ్లతో ఫిబ్రవరి 13న బేవర్లీ హిల్స్‌ హోటల్‌లో లంచ్‌ ఏర్పాటు చేసి మమ్మల్ని పిలిచారు. అక్కడ కూడా డ్రస్‌ కోడ్‌ ఏం లేదు.

  7. ఆస్కార్‌ అవార్డ్‌ అనేది ఒక గౌరవం అంతే. డబ్బు రూపంలో ఏమీ ఇవ్వరు. అవార్డు గెలుచుకున్న విజేతలకు ట్రోఫీ ఇస్తారు. నామినేషన్స్‌ సాధించి, అవార్డులు పొందలేని వారిలో కొంతమందిని మాత్రం ఎంపిక చేసి, వాళ్లకు ఓ గిఫ్ట్‌ బాక్స్‌ ఇస్తారు. ఇందులో రూ. కోటీ 30 లక్షల విలువలైన గిఫ్ట్‌ ఓచర్లు, ఫ్లెయిట్‌ టికెట్స్‌ , రూమ్‌ ఎకామిడేషన్‌ కూపన్లు ఉంటాయి. అవి అవసరం లేదని తిరిగి ఇచ్చిన వాళ్లకు ఆ నగదు మొత్తాన్ని చెల్లిస్తారు. ’

  8. విజేతలు 45 సెకన్లు మాత్రమే వేదిక మీద మాట్లాడాలని ఆస్కార్‌ నిబంధన. ఇద్దరు ఉన్నా కూడా వాళ్లలో ఒకరే మాట్లాడాలి. కానీ ఆ నిబంధను ఎవరూ పాటించలేదు. మేం మాత్రం కచ్చితంగా పాటించాం. కీరవాణిగారు మాట్లాడడానికి ప్రిపేర్‌ అయ్యారు. ఆయన నలభై నాలుగు సెకన్లలోతన ప్రసంగం ముగిస్తే, నేను ఆ చివరి ఒక్క సెకన్‌లో ‘నమస్తే’ చెప్పాను. ఈ ఒక్క సెకను చరిత్ర అయింది. ఎందుకంటే 90 ఏళ్ల ఆస్కార్‌ చరిత్రలో అలా వేదిక మీద మొదటిసారిగా వినిపించిన తెలుగు పదం ‘నమస్తే’. ఇన్నేళ్ల చరిత్రలో అక్కడ ప్రదర్శించిన తెలుగు పాటలోని మొదటి పదం ‘పొలం’. మన జీవన విధానం పొలం, మన జీవన సంస్కారం నమస్తే. నా జీవన విధానాన్ని, సంస్కారాన్ని ప్రపంచానికి చాటి చెప్పే గొప్ప సందర్భంగా దాన్ని నేను భావించాను.

  9. వేదిక మీద షీల్డ్‌ ఇస్తారు కదా. దాని మీద మా పేరు ఉండదు. ఎవరికి ఏ అవార్డ్‌ వస్తుందో ఎవరికీ తెలీదు కనుక షీల్డ్‌ మీద పేరు ఉండదు. ఆస్కార్‌ అవార్డ్స్‌ కోసం ఓటింగ్‌ నిర్వహించడం అనేది అకాడమీ పని కాదు. దానికి వేరే ఏజెన్సీ ఉంటుంది. వారు సీక్రెట్‌ బ్యాలెట్‌, ఓటింగ్‌ నిర్వహించి, విజేతల వివరాలు సీల్డ్‌ కవర్‌లో ఉంచుతారు. వేదిక మీద మేం షీల్డ్‌ అందుకోగానే వెనుక నుంచి బయటకు తీసుకెళ్లారు. మొదట ఓ రెండు నిముషాల సేపు ఓ ఇంటర్వ్యూ చేశారు. ఆ తర్వాత బోర్డు మీద మేం పేర్లు రాయాలి. నచ్చిన కొటేషన్‌ రాయాలి. కీరవాణిగారు ఇంగ్లిషులో ‘జెఏఐ జై’ అని రాస్తే, నేను తెలుగులో ‘హింద్‌’ అని రాశాను. అక్కడి నుంచి ఓ చోటుకి తీసుకెళ్లి స్నాక్స్‌ ఇచ్చారు. ఆ తర్వాత ప్రెస్‌మీట్‌ జరిగే హాలుకి తీసుకెళ్లారు. అన్ని దేశాలకు చెందిన దాదాపు నాలుగు వందల మంది జర్నలిస్టులు అక్కడ ఉన్నారు. వాళ్లు అడిగే ప్రశ్నలకు మేం సమాధానాలు చెప్పాలి. ఆ కార్యక్రమం పూర్తయి బయటకు వచ్చిన తర్వాత మా పేరుతో ఉన్న షీల్డ్‌ను అందజేశారు. ఆ తర్వాత ‘వ్యానిటీ ఫెయిర్‌’ అనే ప్రదేశంలో మాకు డిన్నర్‌ ఏర్పాటు చేశారు. అది పూర్తయి ఇంటికి తిరిగి వచ్చేసరికి రాత్రి రెండయింది. అప్పటికే దాదాపు యాభై తెలుగు కుటుంబాల వారు నా కోసం ఓపికగా ఎదురు చూస్తున్నారు. నేను వెళ్లగానే గుమ్మడి కాయతో దిష్టి తీశారు. ఆ తర్వాత వాళ్లతో మాట్లాడుతూ కాలక్షేపం చేసే సరికి తెల్లారి నాలుగయింది. కాసేపు పడుకుని ఏడు గంటలకు లేచి అట్లాంటా, న్యూజెర్సీ బోస్టన్‌లలో సన్మాన సభలో పాల్గొని ఇండియా చేరుకున్నాను.

  10. ఆ పార్టీకి చిరంజీవిగారు నన్నూ ఆహ్వనించారు. కానీ ఆ రోజు రాత్రి మణిరత్నంగారు తీస్తున్న ‘పొన్నియిన్‌ సెల్వం 2’ చిత్రం పాటల రికార్డింగ్‌ కార్యక్రమానికి సంబంధించి జూమ్‌ మీటింగ్‌ ఉంది. తెల్లారి ఆ పాట రిలీజ్‌ చేయాల్సి ఉండడంతో నేను తప్పనిసరిగా అక్కడ ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత చిరంజీవిగారిని ‘భోళాశంకర్‌’ చిత్రం షూటింగ్‌లో కలిశాను. చిరంజీవిగారిలాంటి గొప్ప నటుడు, సుదీర్ఘమైన ప్రయాణం చేసిన కళాకారుడు ఆస్కార్‌ అవార్డ్‌ షీల్డ్‌ని చేతుల్లోకి తీసుకున్నపుడు ఆయన కళ్లలో కనిపించిన వెలుగు నాకు ఆస్కార్‌తో సమానం అనిపించింది.

  11. నామినేషన్‌ పొందిన వారికి తోడుగా ఒకరిని మాత్రం లోపలకు అనుమతిస్తారు. భార్య కానీ తండ్రి కానీ, కొడుకు కానీ. అది మనం ఎంపిక చేసుకోవాలి. అలాగే కీరవాణిగారు ఆరు, నేను ఆరు టికెట్స్‌ కొనుక్కునే సదుపాయం కల్పించారు. ఈ పన్నెండు టికెట్స్‌ రాజమౌళి, ఆయన కుటుంబ సభ్యులకు ఇచ్చాం. సీట్ల వరుసను బట్టి రేట్లు ఉంటాయి. ముందు వరుస కావాలంటే ఒక రేటు, వెనుక వరుస కావాలంటే మరో రేటు ఉంటాయి. ఆ టికెట్స్‌ కొనుక్కుని వారు వచ్చారు.

  12. బెస్ట్‌ ఒరిజనల్‌ సాంగ్‌ నామినీగా ఉన్నానని పేర్కొంటూ అకాడమీ వాళ్లు ఓ సర్టిఫికెట్‌ ఇచ్చారు. తర్వాత ‘సొసైటీ ఆఫ్‌ కంపోజర్స్‌, లిరిసిస్ట్స్‌’ కూడా ఒక సర్టిఫికెట్‌, పెన్ను బహూకరించారు. అకాడమీ ఏర్పాటు చేసిన లంచ్‌కు వెళ్లినప్పుడు అందరితో గ్రూప్‌ ఫొటో తీసి, చక్కని ఫ్రేమ్‌తో దాన్ని నాకు అందించారు. మార్చి 9న ఓ పార్టీ, 11న మరో పార్టీ ఏర్పాటు చేశారు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన నటీనటులు, సాంకేతిక నిపుణులు వారి అభిప్రాయాలను వెల్లడించుకోవడమే ఈ పార్టీల లక్ష్యం.

  13. ఊర్లో మా ఇంటి పక్కనే గ్రంధాలయం ఉంది. బాల సాహిత్యం క్షుణ్ణంగా అక్కడే చదివాను. ఆ గ్రంఽథాలయం ఇప్పుడు శిధిలావస్థలో ఉంది. కొత్తగా దాన్ని నిర్మించి, దానికి ఆస్కార్‌ గ్రంథాలయం అనే పేరు పెట్టాలనుకుంటున్నాను. మా మిత్రులతో ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నాను. ఏప్రిల్‌ 2న మా ఊర్లో నాకు జరిగే సన్మానంలో దీనికి సంబంధించిన వివరాలు వెల్లడిస్తాను.

వినాయకరావు

Updated Date - 2023-04-02T10:55:47+05:30 IST