Sri Satya Vedula: అందుకే... ఆ ఆనందబాష్పాలు!

ABN , First Publish Date - 2023-07-18T23:14:52+05:30 IST

అమెరికాలో ఉంటారు శ్రీ సత్య వేదుల . పేరు కంటే.. ‘దుబిడి దబిడే ఆణిముత్యం’గా సోషల్‌ మీడియాలో పాపులర్‌. ఇన్‌స్టా, యూట్యూబ్‌లో వీడియోలు చేస్తూ తెగ నవ్విస్తుంటారీమె. టాలీవుడ్‌ సెలబ్రిటీల ప్రశంసలు సైతం అందుకుంటోన్న శ్రీ సత్య వేదుల.. తన కెరీర్‌తో పాటు జీవిత విశేషాలనూ ‘నవ్య’తో పంచుకున్నారిలా..

Sri Satya Vedula: అందుకే... ఆ ఆనందబాష్పాలు!

అమెరికాలో ఉంటారు శ్రీ సత్య వేదుల . పేరు కంటే.. ‘దుబిడి దబిడే ఆణిముత్యం’గా సోషల్‌ మీడియాలో పాపులర్‌. ఇన్‌స్టా, యూట్యూబ్‌లో వీడియోలు చేస్తూ తెగ నవ్విస్తుంటారీమె. టాలీవుడ్‌ సెలబ్రిటీల ప్రశంసలు సైతం అందుకుంటోన్న శ్రీ సత్య వేదుల.. తన కెరీర్‌తో పాటు జీవిత విశేషాలనూ ‘నవ్య’తో పంచుకున్నారిలా..

‘‘మొన్నీ మధ్య అమెరికానుంచి మా ఊరు కాకినాడకు వచ్చాం. ఇంట్లో ఉండగా ఓ మెసేజ్‌ వచ్చింది. ‘విమానంలో బ్రహ్మానందంగారున్నారు. నీ గురించి చెప్పా. నువ్వు తక్షణమే.. రాజమండ్రి ఎయిర్‌పోర్టు వచ్చేయ్‌..’ అంటూ హైదరాబాద్‌లో విమానం టేకాఫ్‌ అయ్యే సమయంలో మెసేజ్‌ పంపారు మా వారు మురళీధర్‌. కనీసం రెడీ అవ్వకుండానే.. కారులో అప్పటికప్పుడు రాజమండ్రి ఎయిర్‌పోర్టుకు వెళ్లిపోయా. ఐదు నిముషాల తర్వాత విమానం ల్యాండయ్యింది. బ్రహ్మానందంగారు వస్తూంటే జనాలు గుమికూడారు. ఆ బిజీలో నన్ను పలకరించగానే ఎమోషనయ్యా. పాదాభివందనం చేశా. ఏడ్చేశా. ఆనందబాష్పాలవి. మమ్మల్ని కారులో ఎక్కించుకుని హోటల్‌కు తీసుకెళ్లారు. నా వీడియోలను చూసి మెచ్చుకున్నారు. ఏం చేస్తుంటారు? అని ఆరా తీశారు. ఫ్యామిలీతో ఫొటోలు దిగారు, కాసేపు మాట్లాడారు. మర్చిపోలేని క్షణాలవి! ఆ తర్వాత రోజు ఫోన్‌ చేసి ‘బిజీగా ఉండటం వల్ల.. మీ కుటుంబంతో సరిగా మాట్లాడలేకపోయా. భోజనం కూడా చేయలేకపోయా. మళ్లీ ఒకసారి కలుస్తానమ్మా’ అన్నారు. నాకేమీ మాటలు రాలేదు. ఇది కలా? నిజమా? అనిపించింది. ఎందుకంటే.. ఆయనే నా వీడియోలకు స్ఫూర్తి.

కంటెంట్‌ క్రియేటర్‌గా జనాలను నవ్వించాలన్నదే మెయిన్‌ టార్గెట్‌.ఇటీవలే ఓ పోటీకోసం థ్రిల్లర్‌ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా. అందులో సీరియ్‌సగా నటించటానికి హోమ్‌ వర్క్‌ చేశా. మూడో బహుమతి దక్కింది. కొందరు అమెరికాలోని దినచర్యను వీడియోలు చేయమంటారు. అలా చేయటం కుదరదు. హాస్యానికే నా ఓటు. ఇంట్లో ఖాళీగా, డల్‌గా ఉంటే మాత్రం.. ‘ఏదోటి వీడియో చేయి’ అంటారు మా వారు. నన్ను చూసి గర్వంగా ఫీలవుతారాయన.

IMG_6514.jpg

అలా ‘ఆణిముత్యం’..

చిన్నప్పటి నుంచి దర్శకుడు జంధ్యాలగారి చిత్రాలంటే ఆరాధన. అందులో బ్రహ్మానందంగారంటే మహా ఇష్టం. ఆయన ఎక్స్‌ప్రెషెన్స్‌, డైలాగ్స్‌కు వీరాభిమానిని. బాడీలాంగ్వేజ్‌ చూస్తే సరి నవ్వొస్తుంది. ఇకపోతే అసలే మేం గోదారోళ్లం. మాకు ఎకసెక్కాలు, హాస్యం ఎక్కువండీ. మా కాకినాడలో.. చిన్నప్పటి నుంచే పంచింగ్‌గా మాట్లాడటం, ఎవరినీ నొప్పించకుండా కామెడీ చేయటం అలవాటు. టిక్‌టాక్‌, డబ్‌మ్యాష్‌లు రాజ్యమేలుతున్న రోజులవి. సరిగ్గా 2017 సమయంలో అనుకుంటా. ఇంట్లో ఖాళీగా ఉండటం ఎందుకని.. బ్రహ్మానందంగారి స్ఫూర్తితో నవ్వించే వీడియోలు చేయాలనుకున్నా. లైకులు, కామెంట్ల కోసం కాకుండా.. ఏదో సరదాగా బ్రహ్మానందంగారు, శ్రీలక్ష్మిగారి పాత్రలను ఇమిటేట్‌ చేశా. ఇంట్లో వాళ్లు ‘భలే’ అన్నారు. యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేస్తే జనాలకు తెగ నచ్చింది. వైరల్‌ అయ్యింది. ‘దుబిడి దబిడే’ పేరుతో ఇన్‌స్టాలో వీడియోలు చేయటం ప్రారంభించా. ‘ఆణిముత్యం’ అనే లోగో వేశాను. ఎందుకంటే.. రవితేజ ‘పవర్‌’ చిత్రంలో బ్రహ్మానందంగారి పాత్ర పేరు ‘ఆణిముత్యం’. కొన్ని సరదా వీడియోలను నాదైన శైలిలో కామెంట్‌ చేయటం, సినిమా ట్రైలర్స్‌తో పాటు రివ్యూలు చేసేదాన్ని. గోదారి అబ్బాయితో కలసి బిల్డప్‌ బామ్మగా కొన్ని వీడియోలు చేశా. ఒక రోజు నా ఇన్‌స్టా పేజీని హీరో సాయిధరమ్‌ తేజ్‌ ఫాలో అయ్యారు. ఒక హీరో ఫాలో అవుతున్నారని సంతోషపడ్డాను. నా వీడియోలను మెచ్చుకున్నారాయన. ఆ తర్వాత దర్శకుడు, నటుడు అవసరాల శ్రీనివాస్‌, దర్శకుడు క్రిష్‌గారి నుంచి ప్రశంసలు లభించాయి. మంచులక్ష్మితో లైవ్‌లో ఓ స్కిట్‌ చేశా. గత సీజన్‌ ‘బిగ్‌బాస్‌’ షో గురించి వీడియోలు చేశా. మొత్తానికి అలా ‘ఆణిముత్యం’ పేరు నా కెరీర్‌కు కలిసొచ్చింది.

2.jpg

ఆ సహకారం మరువలేనిది..

మేమిద్దరం అక్కచెల్లెళ్లం. నేనే చిన్నదాన్ని. కాకినాడలో ఆదిత్య ఇన్‌స్టిట్యూట్స్‌లో చదివా. ఆదిత్య జూనియర్‌ కాలేజీలో గెస్ట్‌ లెక్చరర్‌గా దర్శకులు సుకుమార్‌ వచ్చేవారు. బిటెక్‌ చదివాక కొనాళ్లు ఢిల్లీలో పని చేశా. ఆ తర్వాత హైదరాబాద్‌లో ఉద్యోగం చేశా. పెళ్లయ్యాక 2013లో అమెరికా వచ్చేశాం. కాలిఫోర్నియో దగ్గర ఉండే సాన్‌ జో ప్రాంతంలో ఉంటున్నామిప్పుడు. మా వారు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తారు. నేను డిజిటల్‌ మార్కెటింగ్‌ చేస్తా. వెబ్‌సైట్స్‌ డిజైనింగ్‌ వర్క్స్‌ చేస్తా. నాకో కూతురు. తను ఐదో తరగతి చదువుతోంది. మా ఇంట్లో ఓ కుక్క ఉంటుంది. దాని పేరు కోకో. అది వీడియోలు చేసేప్పుడు సరైన సమయంలో వచ్చి కూర్చుంటుంది. దానికి ఫ్యాన్సు ఉన్నారండోయ్‌! మాకు అరగంట దూరంలో మా అక్క ఉంటుంది. నేను వీడియోలు చేస్తానంటే మా వారితో పాటు మా నాన్న, మా అక్క సహకారం మర్చిపోలేనిది. మా అక్కగారి వాళ్ల అత్తయ్యగారి వయసు డెబ్భయ్‌ ఏళ్లకు పైగా ఉన్నాయి. ఆమె కూడా నా కంటెంట్‌కు సలహాలిస్తారు. ‘బిగ్‌బా్‌స’ లోకి వెళ్లమంటారామె. ఇలా ఇంటిల్లిపాది, బంధువులు కూడా మనల్ని ఎంకరేజ్‌ చేస్తారనమాట.

3.jpg

అదే నా కల!

ఇంట్లో వాళ్ల సహకారం ఉన్నా.. ఈ వీడియోలు చేయటం.. జనాలను ఎంటర్‌టైన్‌ చేయటం మామూలు విషయం కాదు. పైగా సెలబ్రిటీలు కూడా ఫాలో అవుతుంటే మరింత బాధ్యత. కొంచెం ఒత్తిడి కూడా. ఎందుకంటే.. ఫ్రీలాన్స్‌ ఉద్యోగం చేస్తున్నా. పైగా అమెరికాలో ఎవరి పని వాళ్లు చేసుకోవాల్సిందే. ఇక నా కూతురు స్కూల్‌, ట్యూషన్‌ లాంటి బాధ్యతలూ చూసుకోవాలి. మా అమ్మ లేరు కాబట్టి మా ఇద్దరి అక్కచెల్లెళ్ల దగ్గరే నాన్నగారు ఉంటారు. కెరీర్‌లో హ్యాపీ. ఎవరికైనా పర్సనల్‌ స్పేస్‌ కూడా కావాలి. ఏదో ఉబుసుపోక వీడియోలు చేశా.. ఇలా పాపులరయ్యా. కాన్సెప్టులు రాసుకోవటం ఒక ఎత్తయితే.. వాటిని ప్రెజెంట్‌ చేయటం.. పాత్రలకు తగినట్లు రెడీ కావటం సవాల్‌. పైగా ఎవ్వరినీ నొప్పించకూడదు. హాస్యం కాస్త వికటిస్తే.. అదివ అపహాస్యమే అవుతుంది కాబట్టి.. ఆ గీత దాటకూడదు. ఎడిటింగ్‌, థంబ్‌నెయిల్స్‌.. ఇలా అన్నీ నేనే చేసుకుంటా. దీంతో సమయమే దొరకదు.

అర్ధరాత్రిపూటా షూట్‌ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కంటెంట్‌ క్రియేటర్‌గా ప్రతిరోజూ నాకో సవాలే. అయితే మంచి ప్రశంసలు వచ్చినపుడు ఆ కష్టాలు మర్చిపోతాను. మొన్న హైదరాబాద్‌కు వచ్చినపుడు దర్శకుడు, నటుడు అవసరాల శ్రీనివాస్‌ వాళ్ల ఇంటికి ఆహ్వానించారు. నాకోసం మంచి పాత్ర రాస్తానన్నారు. కాకినాడలో, హైదరాబాద్‌లో మీట్‌ అండ్‌ గ్రీట్‌ ప్రోగ్రామ్స్‌ చేశా. కంటెంట్‌ క్రియేటర్స్‌కు ఇంత ఆదరణ ఉందా! అని తెలిసిందప్పుడే.. పని చేస్తే గుర్తిస్తారెవరైనా. కొత్త కంటెంట్‌ క్రియేటర్స్‌కు ఒకటే చెబుతున్నా. మీ బలాలను కనుక్కోండి. వాటిమీదనే పని చేయండి. ప్రత్యేకంగా ఉండండి. నన్ను ‘జూనియర్‌ బ్రహ్మానందం.. జూనియర్‌ శ్రీలక్ష్మి’ అని కొందరు అభిమానులు పిలుస్తారు. శ్రీలక్ష్మిగారు చేసిన సున్నితమైన హాస్యంలాంటి పాత్రలు నాకు దక్కితే కచ్చితంగా సినిమాల్లో నటిస్తా. అలాంటి పాత్రల్లో నటించి మెప్పించాలన్నదే నా కల.’’

-రాళ్లపల్లి రాజావలి

ABN ఛానల్ ఫాలో అవ్వండి

Updated Date - 2023-07-18T23:22:54+05:30 IST