UAE: మీ వద్ద ఈ 3 వీసాలు ఉంటే చాలు.. యూఏఈలో పని చేయకుండా కూడా.. రెసిడెన్సీకి ఇట్టే అనుమతి పొందవచ్చు!
ABN, First Publish Date - 2023-09-16T09:51:37+05:30
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) లోని ప్రవాసులు ఆ దేశంలో పని చేయకపోయినా ఇల్లు కొనుగోలు చేయవచ్చు. అలాగే ఎమిరేట్స్ ఐడీ (ID) ని పొందడంతో పాటు వారి కుటుంబ సభ్యులను స్పాన్సర్ చేయవచ్చు.
దుబాయ్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) లోని ప్రవాసులు ఆ దేశంలో పని చేయకపోయినా ఇల్లు కొనుగోలు చేయవచ్చు. అలాగే ఎమిరేట్స్ ఐడీ (ID) ని పొందడంతో పాటు వారి కుటుంబ సభ్యులను స్పాన్సర్ చేయవచ్చు. దీనికోసం యూఏఈ (UAE) మూడు రకాల స్వీయ-ప్రాయోజిత నివాస వీసాల (Self-sponsored residence visas) ను అందిస్తుంది. దీనికి మీరు ఆ దేశంలో ఉద్యోగం లేదా వ్యాపారం చేయవలసిన అవసరం కూడా లేదు. మీ వద్ద ఈ మూడు వీసాలలో ఏదో ఒకటి ఉంటేచాలు, యూఏఈలో పని చేయకుండా కూడా అక్కడ నివసించడానికి మీకు అనుమతి ఉంటుంది. ఆ మూడు వీసాలు ఏంటి? వాటిని ఎలా పొందవచ్చు? అసలు వాటికి కావాల్సిన అర్హతలేంటి? తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1. రిమోట్ వర్క్ వీసా
ఈ వీసాతో మీరు యూఏఈలో నివసించవచ్చు. అలాగే రిమోట్ పద్దతిలో పని చేసుకునే వెసులుబాటు ఉంటుంది. యూఏఈ వెలుపల ఉద్యోగం చేస్తున్న వ్యక్తులు స్వీయ-ప్రాయోజిత వర్చువల్ వర్క్ వీసాపై ఇక్కడ నివసించవచ్చు. ఇక ఈ వీసా అనేది ఒక ఏడాది పాటు చెల్లుబాటు అవుతుంది. అలాగే ఈ రెసిడెన్సీ వీసా అనేది రిమోట్ వర్కర్లకు యూఏఈలో వారి కుటుంబ సభ్యులను స్పాన్సర్ చేయడానికి కూడా అనుమతిస్తుంది.
వీసా దరఖాస్తుకు కావాల్సిన అర్హతలు..
* మీరు యూఏఈ వెలుపల ఉన్న సంస్థ కోసం రిమోట్ టైప్‌లో పని చేస్తున్నారని నిరూపించే ధృవపత్రం
* నెలవారీ ఆదాయం రూ.2.90లక్షలు
* కనీసం ఆరు నెలల చెల్లుబాటుతో కూడిన పాస్‌పోర్ట్.
* యూఏఈలో మీ రెసిడెన్సీని కవర్ చేసే చెల్లుబాటయ్యే ఆరోగ్య బీమా.
2. రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్ వీసా
మీరు యూఏఈలో రియల్ ఎస్టేట్ (Real Estate) లో ఎంత పెట్టుబడి పెట్టారు అనేదానిపై ఆధారపడి మీరు రెండు సంవత్సరాల స్వీయ-ప్రాయోజిత నివాస వీసాను పొందవచ్చు. అలాగే 10 సంవత్సరాల కాలపరిమితితో వచ్చే గోల్డెన్ వీసా (Golden Visa) కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారులకు రెండేళ్ల రెసిడెన్సీ వీసా ఇలా..
మీరు కనీసం 7.50లక్షల దిర్హమ్స్ (రూ.1,69,69,360) విలువైన ఆస్తిని కలిగి ఉండాలి. లేదా మీరు మరియు మీ జీవిత భాగస్వామి ఉమ్మడిగా అదే విలువ కలిగిన ఆస్తిని కలిగి ఉంటే సరిపోతుంది. మీరు దుబాయ్ ల్యాండ్ డిపార్ట్‌మెంట్ (Dubai Land Department) క్యూబ్ సెంటర్ ద్వారా ప్రాపర్టీ ఇన్వెస్టర్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారులకు గోల్డెన్ వీసా ఎలాగంటే..
మీరు 2 మిలియన్ దిర్హమ్స్ లేదా అంతకంటే ఎక్కువ విలువైన ఆస్తిని కలిగి ఉంటే, మీరు గోల్డెన్ వీసాకు అర్హులు. రియల్ ఎస్టేట్ పెట్టుబడి ద్వారా గోల్డెన్ వీసా పొందేందుకు ఇతర కొన్ని షరతలు..
* రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారులు కనీసం 2 మిలియన్ దిర్హమ్స్ విలువైన ఆస్తిని కొనుగోలు చేసిన సందర్భంలో గోల్డెన్ వీసా పొందవచ్చు.
* కొన్ని నిర్దిష్ట స్థానిక బ్యాంకుల నుండి రుణం ద్వారా ఆస్తిని కొనుగోలు చేసిన పెట్టుబడిదారులు సైతం గోల్డెన్ వీసాను పొందేందుకు అర్హులు.
* ఆమోదించబడిన స్థానిక రియల్ ఎస్టేట్ కంపెనీల నుండి 2 మిలియన్ దిర్హమ్స్‌కు తక్కువ కాకుండా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఆఫ్-ప్లాన్ ప్రాపర్టీలను కొనుగోలు చేసినప్పుడు కూడా పెట్టుబడిదారులు గోల్డెన్ వీసాను పొందవచ్చు.
3. యూఏఈ రిటైర్మెంట్ వీసా
55 ఏళ్లు పైబడిన పదవీ విరమణ పొందిన వారు ఈ ఐదేళ్ల దీర్ఘకాలిక వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హతలు..
* యూఏఈ లోపల లేదా వెలుపల 15 సంవత్సరాల కంటే తక్కువ కాకుండా పని చేసి ఉండాలి. లేదా పదవీ విరమణ సమయంలో 55 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు కలిగి ఉండాలి.
* 1 మిలియన్ దిర్హమ్స్ కంటే తక్కువ కాకుండా ఆస్తులను కలిగి ఉండాలి. 1 మిలియన్ దిర్హమ్స్ కంటే తక్కువకాకుండా సేవింగ్స్ లేదా నెలవారీ ఆదాయం 15వేల దిర్హమ్స్ (రూ.3.39లక్షలు) ఉండాలి. అలాగే గత ఆరు నెలలకు సంబంధించిన లావాదేవీల తాలూకు బ్యాంక్ స్టేట్‌మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది.
Kuwait: ఆ కార్మికులే లక్ష్యంగా భద్రతాధికారుల సోదాలు.. ఎట్టిపరిస్థితుల్లో అలాంటివారిని దేశంలో ఉండనివ్వరట!
Updated Date - 2023-09-16T19:50:39+05:30 IST