America లో మరోసారి పేలిన తూటా.. మిచిగాన్ యూనివర్శిటీలో తుపాకీతో కాల్పులు.. ముగ్గురు మృతి
ABN, First Publish Date - 2023-02-14T11:43:50+05:30
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు చోటు చేసుకున్నాయి.
మిచిగాన్: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు చోటు చేసుకున్నాయి. మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీ క్యాంపస్‌లో (Michigan State University Campus) జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతిచెందారు. మరో ఐదుగురు గాయపడ్డారు. ఓ సాయుధుడు యూనివర్శిటీ క్యాంపస్‌లోకి చోరబడి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. రెండు చోట్ల కాల్పులకు పాల్పడినట్లు యూనివర్శిటీ పోలీసులు వెల్లడించారు. యూఎస్ కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 8.30 గంటల సమయంలో తమకు ఈ ఘటనపై సమాచారం అందినట్టు పోలీస్ అధికారి క్రిస్ రోజ్‌మన్ (Chris Rozman) తెలిపారు. క్యాంపస్‌లోకి రెండు భవనాల వద్ద కాల్పులు జరిపినట్లు యూనివర్శిటీ సిబ్బంది వెళ్లడించారు.
ఇక కాల్పుల శబ్ధం వినిపించడంతో భయాందోళనకు గురైన విద్యార్థులు, సిబ్బంది వెంటనే గదుల్లోకి పారిపోయారు. కాల్పుల అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ఆధారంగా నిందితుడి ఫొటోలను విడుదల చేశారు. ఎవరికైనా ఆచూకీ తెలిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని రోజ్‌మన్ చెప్పారు. ఇదిలాఉంటే.. అమెరికాలోని ఉన్నత విద్యాసంస్థల్లో మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీ ఒకటి. కాల్పులు జరిగిన ఈస్ట్ లాన్సింగ్ క్యాంపస్‌లో 50వేల మంది వరకు విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇక తాగాజా చోటు చేసుకున్న ఈ ఘటన నేపథ్యంలో 48 గంటల పాటు క్యాంపస్‌లో అన్ని తరగతులు, ఇతర కార్యకలాపాలను రద్దు చేసినట్లు యూనివర్శిటీ పోలీసులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: కోవిడ్ సమయంలో ఆపన్నహస్తం.. క్వీన్ ఎలిజబెత్ ప్రశంసలు.. ఇప్పుడేమో దేశ బహిష్కరణ.. యూకేలో భారతీయుడి దీనగాథ!
Updated Date - 2023-02-14T11:44:51+05:30 IST