Kuwait: ప్రవాసులు బీ అలెర్ట్.. సెప్టెంటర్ 1వ తారీఖు నుంచి కొత్త నిబంధన.. అలా చేశారో స్వదేశానికి రావడం కష్టం..!
ABN, First Publish Date - 2023-08-24T07:48:29+05:30
గృహ అవసరాలకు వినియోగించిన విద్యుత్, వాటర్ తాలూకు పెండింగ్ బిల్లు క్లియర్ చేసిన తర్వాతే ప్రవాసులు దేశం దాటాలనే కొత్త నిబంధనను అమలు చేసేలా కువైత్ (Kuwait) పావులు కదుపుతోంది.
కువైత్ సిటీ: గృహ అవసరాలకు వినియోగించిన విద్యుత్, వాటర్ తాలూకు పెండింగ్ బిల్లు క్లియర్ చేసిన తర్వాతే ప్రవాసులు దేశం దాటాలనే కొత్త నిబంధనను అమలు చేసేలా కువైత్ (Kuwait) పావులు కదుపుతోంది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి దేశం విడిచిపెట్టి వెళ్లాలనుకునే ప్రవాసులు ట్రాఫిక్ చలాన్ల మాదిరిగానే ఎలక్ట్రిసిటీ బిల్స్‌ను సైతం చెల్లించడం తప్పనిసరి చేసింది. ఈ మేరకు ఆ దేశ విద్యుత్, నీరు మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వశాఖ (Ministry of Electricity, Water and Renewable Energy) తాజాగా ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబర్ 1వ తారీఖుు నుంచి ఈ నిబంధన అమలులోకి వస్తుందని వెల్లడించింది.
కరెంట్ బిల్లు బకాలను మ్యూ-పే (mew-pay) లేదా సహేల్ (Sahel) యాప్ ద్వారా చెల్లించవచ్చని పేర్కొంది. అలాగే ప్రభుత్వ ఎలక్ట్రానిక్ సర్వీసులు లేదా కువైత్ ఇంటర్నెషనల్ ఎయిర్‌పోర్టులోని టెర్మినల్-04లోని కస్టమర్ సర్వీస్ కేంద్రంలో కూడా బిల్లులు చెల్లించే వెసులుబాటు కల్పించినట్లు ఈ సందర్భంగా మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది.
ఇక ఈ నెల 19వ తేదీ నుంచి ఏ కారణంతోనైన సరే కువైత్ విడిచిపెట్టి వెళ్లే ప్రవాసులు (Expats) ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి జరిమానాలు ఉంటే చెల్లించడం తప్పనిసరి అని ప్రకటించిన విషయం తెలిసిందే. లేనిపక్షంలో వారి ప్రయాణాలపై నిషేధం ఉంటుందని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం అమలులోకి వచ్చిన 24 గంటల వ్యవధిలోనే 70 మంది ప్రవాసులపై చర్యలకు ఉపక్రమించింది. ట్రాఫిక్ చలాన్లు చెల్లించని కారణంగా వారిపై ట్రావెల్ బ్యాన్ (Travel Ban) విధించినట్లు ఆ దేశ అంతర్గత మంత్రిత్వ శాఖ (Ministry of Interior) వెల్లడించింది. అంతేగాక వారి వద్ద నుంచి జరిమానాల రూపంలో 66వేల కువైటీ దినార్లు (రూ. 1.77కోట్లు) వసూలు చేసినట్లు మంత్రిత్వశాఖ పేర్కొంది.
ట్రాఫిక్ ఫైన్స్ ఉన్న విదేశీయులు (Foreigners) మంత్రిత్వశాఖకు చెందిన అధికారిక ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా (లేదా) ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ ఆఫీస్‌లో (లేదా) విమానాశ్రయంలోని ఆఫీస్‌లో (లేదా) బార్డర్ పోర్ట్ వద్ద ఏర్పాటు చేసిన కార్యాలయంలో చెల్లించవచ్చని తెలిపింది. ఈ సందర్భంగా ప్రతి ప్రవాసుడు (Expat) చట్టానికి కట్టుబడి ఉండాలని, వాటిని ఉల్లంఘించవద్దని మంత్రిత్వ శాఖ సూచించింది.
Prohibited Items: దుబాయ్ వెళ్తున్నారా? అయితే అక్కడికి తీసుకెళ్లకూడని ఈ వస్తువుల జాబితాపై ఓ లుక్కేయండి..!
Updated Date - 2023-08-24T07:49:50+05:30 IST